మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదంటూ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీజేపీపై, కేంద్ర ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని, దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని కేంద్ర మంత్రి జి కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. ఈ మేరకు కిషన్‌రెడ్డి ఆదివారం ప్రకటన విడుదల చేసారు. కేంద్రం తెలంగాణను నిర్లక్ష్యం చేస్తోందంటూ రాజకీయ కోణంలో ఆరోపణలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. వాస్తవాలను ప్రజలకు చెప్పకుండా వక్రీకరిస్తున్నాయని విమర్శించారు. గత పదేళ్లుగా తెలంగాణకు అనేక అభివృద్ధి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని, దీనిపై జూన్ 7న 2023వ తేదిన ’తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం పాత్ర’ పై బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిమని కిషన్ రెడ్డి గుర్తు చేసారు.
మరోసారి తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం చేసిన కార్యక్రమాలపై బహిరంగ చర్చ సిద్ధమని దీనికి వేదిక ఏర్పాటు చేయాల్సిందిగా ఈ మేరకు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కు లేఖ రాసినట్టు తెలిపారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పై తప్పుడు ఆరోపణలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకొనే ప్రయత్నం చేస్తున్నాయని కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. నిజానిజాలు ప్రజలకు తెలియాల్సి అవసరం ఉందని, అందుకే తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేసారు. ఈ విషయంపై బహిరంగ చర్చకు సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కెసిఆర్‌తో సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
హైదాబాద్ ప్రెస్ క్లబ్ వేదికగా బహిరంగ చర్చకు ఏర్పాటు చేయాలని ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్‌కు రాసిన లేఖలో కోరినట్టు వివరించారు. బహిరంగ చర్చా వేదికకు తేదీ, సమయం నిర్ణయించి సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానిస్తే వస్తానని తాను కూడా వస్తానని పేర్కొన్నారు. వాస్తవాలు ఏమిటో ప్రజలకు తెలిసే విధంగా మీడియా ముందు నిర్మాణాత్మకమైన చర్చకు ప్రెస్‌క్లబ్ చొరవ తీసుకోవాలని సూచించారు. అయితే, వారిద్దరూ మాట్లాడే భాష ప్రెస్ క్లబ్ నియమ నిబంధనలకు అనుగుణంగా, పద్ధతిగా, పార్లమెంటరీ పద్ధతిలో ఉండాలన్నారు. సానుకూలంగా చర్చ జరిగేలా చూడాలని కిషన్‌రెడ్డి కోరారు.