హైదరాబాద్: బిఆర్ఎస్ నేత మాగంటి గోపినాథ్ అకాల మరణంతో నగరంలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలో విజయం సాధించాలని అన్ని ప్రధాన పార్టీలో తీవ్రస్థాయిలో కృషి చేశాయి. గత కొద్ది రోజులుగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్, బిజెపి నేతలు క్షేత్రస్థాయిలో ప్రచారం చేశారు. కాగా ఆదివారం సాయంత్రంతో ఈ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. మంగళవారం (నవంబర్ 11)న ఈ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. 14న ఫలితాలు వెలువడతాయి.
ఈ ఉప ఎన్నికల బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి మధ్యే ఉంది. బిఆర్ఎస్ తరఫున మాగంటి సునీత, కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్, బిజెపి తరఫున దీపక్ రెడ్డి బరిలో నిలిచారు. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో 139 ప్రాంతాల్లో డ్రోన్లలో పటిష్టమైన నిఘా.. 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద రెండంచెల భద్రతను పోలీసులు సిద్ధం చేస్తున్నారు జిహెచ్ఎంసి కేంద్ర కార్యాలయంలో కంట్రోల్ రూంని ఏర్పాటు చేశారు.