ఇటీవల కాలంలో సంభవిస్తున్న తుఫానులు పెను విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ను దాటిన మొంథా తుఫాను తీవ్రవిధ్వంసం సృష్టిస్తుందనే భయంకరమైన పరిస్థితులనుండి ప్రజలు బయటపడి ఊపిరి పీల్చుకున్నారు. అయితే తుఫాను తీరం దాటిన తర్వాత ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల వలన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయి? ప్రకృతిలో ఎందుకు అవాంఛనీయ పరిణామాలు సంభవిస్తున్నాయి? ఆకస్మిక వాతావరణ మార్పులకు కారణమేమిటి? ఇలాంటి కీలకమైన అంశాలపై తీవ్రమైన పరిశీలన, మేధో మథనం జరగాలి. మానవ చర్యల వలన ప్రకృతిలో సంభవించే విపత్తులనుండి ప్రజలను కాపాడుకోవాలి. ప్రకృతి విధ్వంస దుష్ఫలితాలను కనీసస్థాయికి తగ్గించాలి. ప్రకృతి భూమికి రక్షణ కవచం వంటిది. అలాంటి ప్రకృతిని విధ్వంసం చేయడం మనల్ని మనం ప్రమాదంలో పడేసుకోవడమే. మన చుట్టూ ఆవరించి ఉన్న ప్రకృతిని నిర్లక్ష్యం చేసి, పర్యావరణానికి ముప్పు కలగచేయడం క్షమార్హం కాదు. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను వివరిస్తూ, ఎన్నోఅవగాహనా సదస్సులు, ఎన్నో అంతర్జాతీయ సమావేశాలు జరుగుతున్నా పర్యావరణ విధ్వంసం యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది.
పర్యావరణ విధ్వంసంతో మానవ ప్రపంచం విలపిస్తున్నది. ప్రపంచాన్ని పచ్చదనంతో నింపితేనే భూగ్రహాన్ని కాపాడగలం. స్వీడన్, ఫిన్లాండ్, న్యూజిలాండ్, ఐస్‌లాండ్, డెన్మార్క్, యు.కె, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ వంటి దేశాలు హరిత దేశాలుగా పేర్కొనబడుతున్నాయి. సహజ వనరులను పరిరక్షించి, కర్బన ఉద్గారాలను తగ్గించడం ద్వారా డెన్మార్క్ గ్రీనెస్ట్ కంట్రీ దిశగా పయనిస్తున్నది. ఖతార్, నైజర్, గ్రీన్ లాండ్ వంటి దేశాల్లో పచ్చదనం తక్కువగా ఉంది. ధరిత్రిని కలుషిత వ్యర్ధాలనుండి కాపాడడం, ప్లాస్టిక్‌ను నెమ్మదిగా తగ్గించడం, పునరుత్పాదక ఇంధన వనరుల వైపు ప్రపంచాన్ని మళ్ళించడం, జీవవైవిధ్యాన్ని కాపాడడం, అడవులను సంరక్షించడం, పచ్చదనాన్ని పెంపొందించడం వంటి చర్యలతో పర్యావరణాన్ని పరిరక్షించవచ్చు. ప్రస్తుత కలుషితభరితమైన ప్రపంచంలో ప్రతీ చోట వినిపించే మాట ‘పర్యావరణం’. పర్యావరణం అనే పదానికి నిర్వచనం చాలా మందికి తెలియకపోవచ్చు. పచ్చదనమే పర్యావరణ పరిరక్షణకు నిజమైన పరిష్కారమన్న అవగాహన మాత్రం సామాన్య ప్రజల్లో కూడా ఏర్పడింది. కాని ఆచరణలో పర్యావరణ పరిరక్షణ అంశం విఫలమవుతూనే ఉంది.
పర్యావరణం శరవేగంగా విధ్యంసమవుతూనే ఉంది. మానవ ప్రపంచాన్ని పెను ప్రమాదం వెంటాడుతూనే ఉంది. మన చుట్టూ పంచభూతాలతో ఆవరించి ఉన్న సహజసిద్ధమైన ఏర్పాటును ‘పర్యావరణం’గా పేర్కొనవచ్చు. అలాంటి పర్యావరణం మానవ స్వార్థంతో, తప్పిదాలతో విధ్వంసం కావడం పెను ప్రమాదానికి సంకేతం-, మానవ మనుగడకు శరాఘాతం. సకల జీవరాశుల మనుగడకు ఏకైకఆధారం భూగ్రహం. మిగిలిన గ్రహాల్లో జీవించడానికి అనువైన పరిస్థితులు లేవు. ఇతర గ్రహాలపై పరిశోధనలు జరుగుతున్నా ఇప్పటి వరకు జీవరాశుల జాడ కనిపించలేదు. వేలాది కోట్ల ధనం ఇతర గ్రహాలపై పరిశోధనలకు ఖర్చుపెడుతున్నా ఫలితాలు నిరాశాజనకంగానే ఉన్నాయి. ఇతర గ్రహాలపై తిష్ఠవేయాలనే మానవ జిజ్ఞాస కేవలం అత్యాశగానే మిగిలిపోతుందేమో అనే సంశయం కలగడం సహజం. సువిశాలమైన భూగ్రహాన్ని నాశనం చేసి, ఇతర గ్రహాలపై నివాసానికి కలలు కనడం హాస్యాస్పదం. ప్రకృతి హొయలతో అలరాడే అందమైన భూగ్రహాన్ని కాలుష్యంతో కురూపిగామార్చి, ఇతర గ్రహాలపై పరిశోధనలు చేయడం కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిన చందంగా మారింది. భూగ్రహం కూడా ఈ సమస్త విశ్వంలో ఒక భాగమే.
భూగ్రహంపై మూడొంతుల నీరు, ఒక వంతు భూమి కలదు. వృక్షాలతో, నదీనదాలతో, కొండలు, లోయలు, సముద్రాలతో పలు జీవరాశులతో, విభిన్నమైన భౌగోళిక నైసర్గీక స్వరూపాలతో, పచ్చని ప్రకృతి మధ్య జీవించే మహాద్భాగ్యాన్ని మానవుడే చెరిపేస్తున్నాడు. స్వార్థ ప్రయోజనాల కోసం విచక్షణ కోల్పోయి ప్రకృతిని చెరబట్టి, వికృతంగా మారుస్తున్నాడు. అడవులను నరికి నివాసాలను ఏర్పాటు చేసుకోవడం, పంటభూములను మానవావసరాలకు వినియోగించడం, కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను ఏర్పాటు చేయడం, శిలాజ ఇంధనాలను ఇబ్బడిముబ్బడిగా వినియోగించడం వలన ధరిత్రిపై కాలుష్యపు క్రీనీడలు కమ్ముకుంటున్నాయి. శిలాజ ఇంధనాల వాడకం వలన, అడవులను ధ్వంసం చేయడం వలన, పారిశ్రామిక విప్లవం వలన వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్, మిథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి గ్రీన్‌హౌస్ వాయువుల శాతం పెరిగి, భూ ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుతున్నది. ఇదే పరిస్థితి కొనసాగితే ‘గ్లోబల్ వార్మింగ్’ సమస్య పెరిగి భూమిపై మనుగడ సాగిస్తున్న పలు జీవరాశుల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. భూ ఉష్ణోగ్రతలు పెరగడానికి మానవ తప్పిదాలే కారణం. ప్రకృతిలో లభ్యమయ్యే వనరులను అవసరాలకు మించి వినియోగించడం, ధనాశతో, దురాశతో దూరదృష్టి కోల్పోయి, పర్యావరణానికి చేటుతేవడం మానవ మనుగడకు పెనుముప్పు.
పచ్చదనమే ప్రపంచ మానవాళికి నిజమైన ధనం. ఈ విషయాన్ని మరచిపోయి, కలుషితాల మధ్య జీవిస్తూ సుఖసౌఖ్యాలను ఆస్వాదిస్తున్నామని భ్రమించడం దురదృష్టకరం. పంచభూతాలు కలుషితమైపోయాయి. పర్యావరణం కాలుష్యంతో నిండిపోయింది. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు రాబోవు ప్రళయానికి సంకేతాలు. సూర్యరశ్మి, గాలి, నీరు మొదలైన వనరులను పునరుత్పాదక శక్తివనరులుగా పిలుస్తారు. జంతువుల, మొక్కల వ్యర్ధాల నుండి ఉత్పత్తి కాబడే ఇంధనాన్ని బయోమాస్ ఎనర్జీ అంటారు. ఇది కూడా పునరుత్పాదక ఎనర్జీ. పునరుత్పాదక శక్తి వనరులను వినియోగించే కొద్దీ తిరిగి భర్తీ చేయబడతాయి. సౌరశక్తి, గాలి వంటి సహజసిద్ధమైన వనరులను వినియోగించుకుని కాలుష్యాన్ని తగ్గించవచ్చు. వీటి వలన పర్యావరణం కూడా పరిరక్షించబడుతుంది. సూర్యరశ్మి, గాలి వంటి ప్రకృతి సిద్ధమైన వనరుల నుండి లభ్యమయ్యే శక్తి కారకాలను ఇబ్బడి ముబ్బడిగా వినియోగించినా తిరిగి పొందగలం. వీటిని వినియోగించడం వలన కాలుష్యాన్ని తగ్గించవచ్చు.
పునరుత్పాదక శక్తివనరులతో వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించి, కాలుష్యాన్ని అరికట్టవచ్చు. దీనినే క్లీన్ ఎనర్జీ అంటారు. ప్రపంచంలో ప్రకృతి ప్రేమికులకు కొదవలేదు. అయినా ఆశించినంత ప్రయోజనం ఆచరణలో కనిపించడం లేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరగకుండా, ప్రజల అవసరాలు తీర్చే ప్రణాళికలు చేపట్టకుండా పర్యావరణ విధ్వంసాన్ని ఆపలేం. పర్యావరణాన్ని పరిరక్షించి, భూతలాన్ని కాపాడేందుకు ‘రాచెల్ లూయీస్ కార్సన్’ వంటి పర్యావరణ వేత్తల ఆలోచనలు స్ఫూర్తి కావాలి. గేలార్డ్ నెల్సన్ లాంటి దూరదృష్టిగల పర్యావరణ ప్రేమికులను వర్తమాన ప్రపంచం తయారు చేయాలి. జాదవ్ పాయెంగ్, వనజీవి రామయ్య వంటి ప్రకృతి, పర్యావరణ సేవకులు సమాజం నుండి ఉద్భవించాలి. ప్రపంచ స్థాయి సంస్థలు, ప్రభుత్వాలు, పర్యావరణ వేత్తలు పర్యావరణ పునరుద్ధరణకు నడుంబిగించి, మానవాళిని పెను సంక్షోభం నుండి బయటకు తీసుకురావడానికి వడివడి అడుగులు వేయాలి. సహజసిద్ధమైన, కలుషిత రహితమైన గత కాలం నాటి,ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పునర్జీవింపచేయాలి. మానవ చర్యల వలన ఏర్పడుతున్న వాతావరణ మార్పులకు అడ్డుకట్ట వేయాలి. ప్రకృతి వైపరీత్యాలనుండి ప్రజలను కాపాడాలి.
– సుంకవల్లి సత్తిరాజు
97049 03463