హైదరాబాద్: జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి అని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఏ పదవి లేకపోయినా.. కొనాళ్లుగా ఎన్నో సేవాకార్యక్రమాలు చేపట్టారని అన్నారు. ఈ సందర్భంగా భట్టి మీడియాతో మాట్లాడుతూ.. నవీన్ యాదవ్ ను గెలిపించుకుని జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని, పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తోందని తెలియజేశారు. పదేళ్లపాటు బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని, ఈ ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చి.. సన్నబియ్యం కూడా ఇస్తోందని అన్నారు. మహిళా సంఘాలను బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డిలేని రుణాలు ఇస్తోందని, బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒక్కసారి కూడా గ్రూప్-1 పరీక్షలు జరగలేదని భట్టి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్-1 పరీక్షలు నిర్వహించి.. నియామకాలు కూడా చేసిందని, ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు.. ప్రైవేటులోనూ ఉద్యోగాల కల్పన చేస్తున్నామని పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాల కోసం రెండేళ్లలోనే రూ.1.06 లక్షల కోట్లు ఖర్చు చేశామని, బిఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్ పెట్టిన సంక్షేమ పథకాల బిల్లులను తాము చెల్లించామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.