హైదరాబాద్: ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో మేఘాలయ క్రికెటర్ ఆకాష్ కుమార్ చౌదరి ప్రపంచ రికార్డు సాధించాడు. అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. అరుణాచల్‌ప్రదేశ్‌తో సూరత్ వేదికగా జరుగుతున్న రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్ మ్యాచ్‌లో కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఈ క్రమంలో వేన్ వైట్ 2012లో లీసెస్టర్‌షైర్ తరఫున సాధించిన రికార్డు(12 బంతుల్లో అర్థ శతకం)ను ఆకాశ్ బద్దలుకొట్టాడు.
ఈ మ్యాచ్‌లో ఆకాశ్ 14 బంతుల్లో 50 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇతరు వరుసగా ఎనిమిది సిక్సులు బాదగా.. ఒకే ఓవర్‌లో ఆరు సిక్సులు కొట్టాడు. అంతేకాక.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో వరుసగా ఎనిమిది సిక్సులు బాదిన ఆటగాడిగా ఆకాశ్ రికార్డు సృష్టించాడు. ఆకాశ్ కంటే ముందు మేఘాలయ బ్యాటర్లు అర్పిత్ (207), రాహుల్ దలాల్ (144), కిషన్ లింగ్డో (119) చెలరేగిపోయారు. దీంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌ను 628/6 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో అరుణాచల్‌ప్రదేశ్ జట్టు కేవలం 73 పరుగులకే ఆలౌట్ అయింది.