మనతెలంగాణ/హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గతంలో కంటే అధిక మెజార్టీతో గెలువబోతున్నామని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలను తక్కువ అంచనా వేసినవారికి, తెలంగాణ ప్రజల చైతన్యాన్ని తక్కువ అంచనా వేసిన వారికి నవంబర్ 14న మంచి సౌండ్ వినిపిస్తుందని అన్నారు. కడుపు మండిన 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల తరపున 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ప్రజలు ఓటు వేసి కాంగ్రెస్‌కు బుద్ది చెప్పబోతున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఏ సర్వే చూసినా కచ్చితంగా బిఆర్‌ఎస్ గెలుస్తుందనే చెబుతున్నాయని పేర్కొన్నారు.
2023లో జూబ్లీహిల్స్‌లో 16 వేల ఓట్ల మెజార్టీతో గెలిచామని, ఈసారి అంత కంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో ప్రజలకు మేలు చేయకపోగా, తీవ్ర నష్టం చేసిందని, అది ఈ ఎన్నికల్లో కనిపిస్తుందని చెప్పారు. కడుపు మీద దెబ్బకొడితే కులం, మతం ప్రభావం ఏమీ ఉండదని అన్నారు. రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన ప్రజల ఆస్తి హారతి కర్పూరంలా కరిగిపోయిందని, దాంతో సాధారణ ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతిందని తెలిపారు. రెండేళ్ల తర్వాత ప్రజల్లో నైరాశ్యం, అసంతృప్తి కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
సిఎం రేవంత్‌రెడ్డి మాటలు నమ్మి చాలా రోజులు మోసపోయారు..మళ్లీ మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కెటిఆర్ ఆదివారం ‘మన తెలంగాణ’ ఇంటర్వూలో పలు అంశాలపై మాట్లాడారు.2023 సెప్టెంబర్‌లో కెసిఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు జిఎస్‌టి వసూళ్లలో తెలంగాణ దేశంలోనే నెంబర్‌వన్ రాష్ట్రంగా ఉంటే, 2025 సెప్టెంబర్‌లో జిఎస్‌టి వసూళ్లలో 28వ స్థానానికి పడిపోయిందని చెప్పారు. ప్రజల కొనుగోలు శక్తి, ఆదాయం తగ్గడంతో ప్రతికూల ఆర్థిక వృద్థి నమోదైందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ, రెండేళ్లలో ఒక్కటీ అమలు చేయలేదని, దాంతో ప్రజల్లో నైరాశ్యం కనిపిస్తోందని అన్నారు.