మన తెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగనున్న ఉప ఎన్నికల ప్రచారానికి ఆదివారం సాయంత్రానికి తెరపడనున్నది. గత నెల 13వ తేదిన ఈ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయినప్పటి నుంచి నేడు ప్రచారం ముగిసే వరకు దాదాపు మూడు వారాల పాటు అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ మధ్య నీవ్వా, నేనా? అన్నట్టుగా దాదాపు మూడు వా రాల పాటు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ఈ ఎన్నికను అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్, ప్రతిపక్ష బీజేపీ మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే బరిలో ఈ మూడు పార్టీలు ఉన్నప్పటికీ ప్రధాన పోటి మాత్రం కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మధ్యనే నెలకొన్నది. అయినప్పటికీ ఇక్కడ బీజేపీ చీల్చుకోబోయే ఓట్లు గెలుపు ఓటములను ప్రభావితం చేయనున్నాయని రా జకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
అయితే ఆ మేర కు బీజేపీ గట్టి పోటి ఇస్తుందా? లేదా? అనేది ఎన్నికల ఫలితాల తర్వాతనే తేలనున్నది. బీజేపీ నేతలేమో ఎమ్మెల్సీ ఎన్నికల మాదిరిగా తమకు సైలెంట్ వేవ్ ఉందని, అధికార, ప్ర ధాన ప్రతిపక్షానికి షాక్ ఇచ్చే విధంగా ఫలితాలు ఉండబోతున్నాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉప ఎన్నిక ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి మాత్రమే సంబంధించింది అయినప్పటికీ ఇక్కడ వచ్చే ఫలితం రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తాయన్న అంచనాతో అన్ని పార్టీ లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీనికి ప్రధాన కారణం ఈ ఉప ఎన్నిక తర్వాత స్థానిక సంస్థలకు రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్నాయి. వీటిని జూబ్లీహిల్స్‌లో వచ్చే ఫలితం ఎంతో కొంత ప్రభావితం చేస్తాయని రాజకీయ పక్షాలు అంచనా వేస్తోన్నాయి.
మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి సరిగ్గా రెండేండ్లు పూర్తి అవుతోన్న నేపథ్యంలో జరుగబోతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రభుత్వ పాలనకు రెఫరాండంగా రాజకీయ పక్షాలు భావిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ రెండేండ్ల స్వల్ప వ్యవధిలోనే ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ విమర్శిస్తోంది. దీంట్లో ఎంత వరకు వాస్తవం ఉందనేది కూడా జూబ్లీహిల్స్ ఫలితాలు తేటతెల్లం చేయబోతున్నాయి. ఇక్కడ విజయం సాధిస్తే స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపొందేందుకు ట్రెండ్ క్రియేట్ అవుతుందని బీఆర్‌ఎస్ అంచనా వేస్తోంది.
అధికారం, అభివృద్ధి ని నమ్ముకున్న కాంగ్రెస్
ఉప ఎన్నికలు ఎక్కడ జరిగినా అధికార పార్టీకి అనుకూల ఫలితాలు రావడం సర్వసాధారణం. ఈ లెక్కన జూబ్లీహిల్స్‌లో విజయం సాధించడం ఖాయమని అధికార కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇందుకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికకు షెడ్యూల్ ప్రకటించక ముందు నుంచే దీనిపై అధికార కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. ఒక్క జిహెచ్‌ఎంసి తరఫుననే ఇక్కడ వంద కోట్ల రూపాయలను అభివృద్ధి పనులపై ఖర్చు చేసింది. ఇవ్వే కాకుండా ఇతర శాఖల పరిధిలో కూడా అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. మొదట ముగ్గురు మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వర్‌రావును ఎన్నికల
ఇంచార్జీలుగా నియమించి వాడ వాడలో విస్తృతంగా అభివృద్ధి పనులు చేపట్టింది. అలాగే ఈ నియోజకవర్గంలోని ఆరు డివిజన్లలో ఒక్కో డివిజన్‌కు ఇద్దరేసి మంత్రులకు ఎన్నికల బాధ్యతలను అప్పగించింది. దీనికి తోడు సీఎం రేవంత్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ఎప్పటికప్పుడు ఎన్నికల వ్యూహంపై ఇంచార్జీలుగా ఉన్న మంత్రులకు దిశ నిర్దేశం చేసిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి ప్రతి డివిజన్‌లో రోడ్ షోలు నిర్వహించారు. ఏఐసీసీ పరిశీలకులు ప్రతి డివిజన్‌లో పర్యటించి రాష్ట్ర పార్టీకి, అధిష్టానానికి నివేదికలు పంపించడంతో పాటు లోటుపాట్లపై అప్రమత్తం చేస్తున్నారు.
ఇలా ఉండగా ఈ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు ఎంఐఎం మద్దతు ప్రకటించడం, ముస్లీం మై నార్టీలకు ఈ నియోజకవర్గంలో ఉన్న అత్యధిక ఓట్లే కాంగ్రెస్ అభ్యర్థిని గట్టెక్కించేందుకు దోహదం చేస్తుందని ధీమాగా ఉంది.
సెంటిమెంట్‌ను నమ్ముకున్న బీఆర్‌ఎస్
జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి తమ సిట్టింగ్ ఎమ్మెల్యే గోపినాథ్ మరణంతో ఉప ఎన్నిక రావడంతో బీఆర్‌ఎస్ పార్టీ ఆయన సతీమణి సునీతకు టికెట్ ఇచ్చి బరిలోకి దించింది. భర్త మరణంతో సునీతకు సానుభూతి తోడైతే సులువుగా గెలిచే అవకాశం ఉంటుందని బీఆర్‌ఎస్ అంచనా వేసింది. అలాగే ఈ నియోజకవర్గం నుంచి మాగంటి గోపినాథ్ వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆయనకు ప్రజలతో ఉన్న విస్తృత పరిచయాలు తమ అభ్యర్థి సునీతకు కలిసి వస్తుందని కూడా భావిస్తోంది. శాసనసభ ఎన్నికలలో హైదరాబాద్ నగరం మొత్తంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే గెలుపొందడంతో ఈ ఉప ఎన్నికలో కూడా అదే విధమైన ఫలితం వస్తుందని బీఆర్‌ఎస్ మరో అంచనా. ఈ ఎన్నికను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి డివిజన్‌లో రోడ్ షోలు నిర్వహించి కాంగ్రెస్ హయాంలో చోటు చేసుకున్న ప్రజావ్యతిరేక చర్యలను ఎండగడుతూ వచ్చారు.
చివరలో కాస్త పుంజుకున్న బీజేపీ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌తో పోలిస్తే బీజేపీ కాస్త వెనుకబడిందనే చెప్పవచ్చు. అయితే వారం రోజులుగా ఆ పార్టీ ప్రచారం కూడా ఊపందుకుంది. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఇంటింటి ప్రచారం, రోడ్ షోలు నిర్వహించారు. ఏపికి చెందిన కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ, ఆ రాష్ట్ర అధ్యక్షుడు మాదవ్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఎన్నికలో బీజేపీకి బలమైన నినాదం లేకపోవడంతో జిఎస్‌టి శాతం తగ్గింపు, ప్రధాని మోడీ పట్ల ఒక వర్గం ప్రజలకున్న అభిమానం కలిసి వస్తుందని అంచనా వేస్తోంది. దీనికి తోడు ఇక్కడ జనసేనకు పెద్దగా బలం లేకపోయినప్పటికీ ఆ పార్టీ మద్దతు పలకడంతో పవన్‌కల్యాణ్ పై అభిమానంతో యువత ఓట్లు వస్తాయని అంచనా వేస్తోంది. వీరి అంచనాలు ఎంత మేరకు ఫలిస్తాయో ఓట్ల లెక్కింపు దాకా వేచి చూడాల్సిందే.