వెంగళరావు నగర్ డివిజన్‌లో తుమ్మల పాదయాత్ర
పాల్గొన్న పిసిసి చీఫ్
మన తెలంగాణ/హైదరాబాద్ :
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక భవిష్యత్‌ను నిర్దేశించే కీలకమయిన ఉప ఎన్నిక అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌లు అన్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్ విజయాన్ని కాంక్షిస్తూ ఆదివారం మంత్రి తుమ్మల పాదయాత్ర నిర్వహించారు. ఈ పాద యాత్రలో పిసిసి చీఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్‌ఎస్, బిజెపి పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిర పరచాలనే కుట్రలను చైతన్యవంతమైన జూబ్లీ హిల్స్ ఓటర్లు తిప్పి కొట్టాలని వారు కోరారు. హైదరాబాద్ సుస్థిర అభివృద్ధి కోసం సిఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా జూబ్లీ హిల్స్ ఓటర్లు చారిత్రక తీర్పు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మేథావులు అపార్ట్‌మెంట్ వాసులు పోలింగ్ కు తరలి రావాలని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి నవీన్ యాదవ్ ను గెలిపించాలన్నారు. ఎల్లారెడ్డి గూడ కృష్ణ అపార్ట్ మెంట్ వాసులు ఆత్మీయ సమావేశంలో మంత్రి తుమ్మల పాల్గొన్నారు. వెంగళరావు నగర్ డివిజన్ లో మంత్రి తుమ్మల పాదయాత్రకు పలు సంఘాలు కాలనీ వాసులు సంఘాబావం గా కదలి వచ్చారు. జూబ్లీ హిల్స్ గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని ఈ సందర్భంగా వారు ధీమా వ్యక్తం చేశారు. ప్రజలతో ముచ్చటిస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైరా ఎంఎల్‌ఏ రాందాస్ నాయక్, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.
వన సమారాధనలో పాల్గొన్న మంత్రులు తుమ్మల, వాకిటి
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా ప్రచారంలో భాగంగా వెంగళరావు నగర్ డివిజన్లో కార్తీక వనభోజన మహోత్సవంలో మంత్రులు వాకిటి శ్రీహరి,తుమ్మల నాగేశ్వర రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఆలోచన విధానం జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమన్నారు. మీరు వేసే ఓటుతోనే ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యం అవుతుందని తెలిపారు. గత ప్రభుత్వం హయంలో ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని, మూడు పర్యాయాలు బిఆర్‌ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చినా స్థానికంగా సమస్యలకు పరిష్కారం దొరుకలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతోనే ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యం అవుతుందని, తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.
00000