ఆరుగాలం శ్రమించి పండించిన పత్తి పంట ప్రమాదశాత్తు నిప్పంటుకొని రైతుకు కోలుకోలేని నష్టాన్ని మిగిల్చింది. మంచి గిట్టుబాటు ధరకు అమ్ముకుందామని నిలువ చేయగా ప్రమాద శాత్తు పత్తి దగ్ధం కావడంతో రైతు బోరున విలపించిన ఘటన పలువురు ని కంటతడి పెట్టించింది. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా, బెజ్జంకిలో చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన బండి ఐలయ్య తన సొంత 12 ఎకరాల భూమితోపాటు మరో 20 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు. గిట్టుబాటు ధర వచ్చాక అమ్ముకుందామని సుమారు 350 క్వింటాళ్ల పత్తి ఇటీవల కురిసిన వర్షానికి తేమశాతం ఎక్కువ ఉందని ఇంటి పరిసరాల ప్రాంతాల్లో ఆరబెట్టాడు.ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం అకస్మాత్తుగా మంటలు చెలరేగి పత్తి మొత్తం కాలి బూడిదైంది.
స్థానికులు ట్యాంకర్ల ద్వారా నీటిని పిచికారీ చేసినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. సంఘటన స్థలానికి రూరల్ సిఐ శ్రీను, ఎస్‌ఐ సౌజన్య చేరుకొని సిద్దిపేట నుండి ఫైర్ ఇంజన్‌ను తెప్పించారు. సిద్దిపేట నుండి ఫైర్ ఇంజన్ వచ్చేటప్పటికి పత్తి సగానికి ఎక్కువ కాలి బూడిదయింది. పండించిన పంట మొత్తం కాలి బూడిదయిందని, దీని వల్ల 30 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకొని ఆర్థిక సహాయం అందజేయాలని రైతు ఐలయ్య వేడుకున్నాడు. కాగా బాధిత రైతు కుటుంబాన్ని పలువరు బిఆర్‌ఎస్ నాయకులు పరామర్శించారు. నష్టపోయిన రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.