హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థుల గంజాయి పార్టీ నగరంలో కలకలం సృష్టించింది. బేగంపేటలోని హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థులకు టెస్ట్ నిర్వహించగా ఆరుగురు విద్యార్థులకు పాజిటివ్ వచ్చింది. హైదరాబాద్ నార్కోటిక్ పోలీస్ స్టేషన్ పోలీసులు బేగంపేటలోని కులినరి అకాడమీ ఆఫ్ ఇండియాలో విద్యార్థులకు గంజాయి తీసుకుంటున్నారనే సమాచారం వచ్చింది. ఈ క్రమంలోనే కాలేజీలో పార్టీ ఏర్పాటు చేశారని, అందులో విద్యార్థులు గంజాయి తీసుకుంటున్నారనే సమాచారం రావడంతో ఈగల్ పోలీసులు దాడి చేసి 11మందిని అదుపులోకి తీసుకున్నారు. వారికి తల్లిదండ్రుల సమక్షంలో టిహెచ్‌సి పరీక్ష నిర్వహించగా సాక్షి ఈమాలియా, మోహిత్ షాహి, శుభం రావత్, కరోలినా సైన్‌తియా హరీసన్, ఆరిక్ జోనథన్ ఆంటోనీ, లాయ్ బారౌహాకు పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన విద్యార్థులకు రిహ్యాబిలిటేషన్ సెంటర్‌కు తరలించారు. మోహిత్ అనే విద్యార్థి గతంలో ఉడిపిలోని మణిపాల్ యూనివర్సిటీలో చదువుతుండగా డ్రగ్స్ తీసుకుంటుండగా, అతడి తండ్రి అక్కడి నుంచి నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ జాయిన్ చేశాడు. ఇక్కడికి వచ్చినా కూడా గంజాయి తీసుకోవడం ఆగలేదు. ఎస్‌ఆర్ నగర్‌కు చెందిన జాసన్ తన స్నేహితులు లాయ్, ఆరిక్ జోనాథన్ కలిసి విద్యార్థులకు గంజాయి సరఫరా చేస్తున్నారు.