బ్రిస్బేన్: వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచిన టీమిండియా శనివారం ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరిగే ఐదో, చివరి టి20 పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. ఇక రెండుటి20 మ్యాచుల్లో వరుస ఓటములు చవిచూసిన ఆతిథ్య ఆస్ట్రేలియాకు ఈ పోరు సవాల్‌గా మారింది. సిరీస్‌ను సమం చేయాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి జట్టుకు నెలకొంది. దీంతో ఆసీస్ టీమ్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. అయితే ఎటువంటి స్థితిని అయినా తట్టుకుని ముందుకు సాగే సత్తా ఉన్న కంగారూ టీమ్‌ను తక్కువ అంచనా వేయలేం. సమష్టిగా రాణిస్తే సిరీస్‌ను డ్రాగా ముగించడం ఆస్ట్రేలియాకు అసాధ్యమేమీ కాదు.
ఓపెనర్లపైనే ఆశలు..
టీమిండియా ఆశలన్నీ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మలపై నిలిచాయి. కిందటి మ్యాచ్‌లో ఇద్దరు జట్టుకు మెరుగైన ఆరంభాన్ని అందించారు. అయితే శుభారంభం అందిస్తున్న ఇటు గిల్ అటు అభిషేక్‌లు ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోతున్నారు. దీంతో జట్టుకు ఇబ్బందులు తప్పడం లేదు కీలకమైన ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు నిలకడైన బ్యాటింగ్‌ను కనబరచాల్సినఅవసరం ఎంతైనా ఉంది. కిందటి మ్యాచ్‌లో గిల్ మెరుగైన బ్యాటింగ్‌తో అలరించాడు. ఇది జట్టుకు ఊరటనిచ్చే అంశంగా చెప్పొచ్చు. అభిషేక్, గిల్‌లు తమ మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే టీమిండియా బ్యాటింగ్ కష్టాలు చాలా వరకు తీరిపోతాయి. మరోవైపు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, తెలుగు కుర్రాడు తిలక్ వర్మలు పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశ పరుస్తున్నారు. జట్టును ముందుండి నడిపించడంలో సూర్య విఫలమవుతున్నాడు. అతని వైఫల్యం జట్టుపై బాగానే ప్రభావం చూపుతోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా ఉన్న సూర్య తన మార్క్ బ్యాటింగ్‌ను కనబరచలేక పోతున్నాడు. కనీసం ఈసారైనా అతను బ్యాట్‌ను ఝులిపించాల్సి ఉంది. వికెట్ కీపర్ జితేశ్ శర్మ, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబె తదిరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా కనిపిస్తోంది. సుందర్ ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిసి వచ్చే అంశమే. అర్ష్‌దీప్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, అక్షర్‌లతో బౌలింగ్ కూడా బాగానే ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్ పేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.