పశ్చిమ బెంగాల్‌లోని సుందర్బన్ ప్రాంతంలో గ్రామ దేవత ఆలయం ఎదుట నిలబడి ఇద్దరు యువతులు పెళ్లి చేసుకున్నారు. ఇక్కడి నదులకు రక్షణగా ఉన్నట్లున్న దట్టమైన అడవులు. మామిడి తోటల మధ్యలో ప్రశాంతంగా ఉండే జలబేరియా తండాలో ఈ వింత వివాహ తంతు జరిగింది. శాస్త్రీయ నృత్య కళాకారిణులు యువతులు రియా సర్దార్, రాఖీ నస్కార్‌లు మనువాడారు. ఈ నెల 4వ తేదీన స్థానిక పలేరు చాక్ దేవాలయం ఆవరణలో వందలాదిగా జనం తరలిరాగా, కొందరు ఉత్సాహంగా శంఖాలు పూరిస్తూ ఉండగా, డప్పులు వాయిద్యాలు మోగిస్తూ ఉండగా , ఇంకా 20 సంవత్సరాలు కూడా రాని ఈ ఇద్దరు మహిళలు ఒక్కటయ్యారు. మాంగల్యధారణ జరిగింది. రియా వధువు వేషధారణతో, రాఖీ వరుడిగా తలపాగాతో కన్పించారు.
స్థానిక పూజారి ఈ పెళ్లి తంతును మంత్రాల నడుమ సంపూర్తి చేశారు. తండావారిలో అనేకలు విస్మయం చెందారు. మౌనంగా ఈ విచిత్ర వివాహాన్ని ఆమోదించారు. జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో ఆడ మగ భేధ భావన అనుచితం, మేమిద్దరం ఇష్టపడ్డాం. ఒక్కటి కావాలనుకున్నామని, అదే చేశామని వారు ప్రకటించారు. తాము యుక్త వయస్కులం, మేజర్లమని, తమ జీవితాన్ని తాము ఎంచుకున్నామని ఇరువురు సవినయంగా తెలిపారు. ఈ పెళ్లి గురించి తమకు ముందస్తు సమాచారం లేదని, అయినా స్థానికులు దగ్గరుండి చేయించిన పెళ్లి, ఇది ఎటువంటిది అయినా తాము చేసేది ఏమీ లేదని, పిలిస్తే తాము కూడా వెళ్లి , విందు భోజనం ఆరగించి వచ్చేవారమని స్థానిక పోలీసులు తెలిపారు