మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం, బాదంపెల్లి సమీపంలో గల గోదావరి నదిలో ఒక యువకుడు ప్రమాదవశాత్తు పడి గల్లంతయ్యాడు. మృతుడి కుటుంబీకులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని పొన్కల్‌కు చెందిన గుండా శ్రావణ్ కుమార్ (32) శుక్రవారం తన నాన్నమ్మ సంవత్సరీకం కార్యక్రమం జరిపాడు. శనివారం ఉదయం కుటుంబ సభ్యులు గోదావరికి వెళ్ళి స్నానం చేసి ఇంటికి చేరుకున్నారు. గుండా శ్రావణ్ కుమార్ ఒక్కడే మళ్లీ గోదావరి స్నానానికి వెళ్ళాడు. స్నానం చేసిన అనంతరం అక్కడ స్నానానికి వచ్చిన మరో వ్యక్తికి తన ఫోన్ ఇచ్చి ఫొటో తీయమని చెప్పాడు. గోదావరిలో పారుతున్న నీటి పక్కనే ఉన్న
రాయిపై నిల్చొని ఫొటో దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి వెనుక వైపు ఉన్న గోదావరిలో పడిపోయాడు. నీటిలో కొట్టుకుపోతున్న శ్రావణ్‌ను కాపాడటానికి మరో వ్యక్తి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, స్నేహితులు అక్కడికి వెళ్లి పలు ప్రాంతాలను గాలించారు. శ్రావణ్ ఆచూకీ కోసం గజఈతగాళ్లు గోదావరిలో గాలిస్తున్నారు. సంఘటన ప్రాంతాన్ని ఎస్‌ఐ అనూష సందర్శించి వివరాలను సేకరించారు. సిమెంట్ వ్యాపారి గుండా లచ్చన్నకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. గల్లంతైన శ్రావణ్ వారి ద్వితీయ పుత్రుడు. ముగ్గురికి కూడా ఇంకా వివాహం కాలేదు.