లక్నో: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉండడంతో ప్రియురాలి భర్తను ప్రియుడు తుపాకీతో కాల్చి చంపాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మీరట్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అగ్వాన్‌పూర్ గ్రామంలో అంజలి, రాహుల్ అనే దంపతులు నివసిస్తున్నారు. అంజలి అదే గ్రామానికి చెందిన అజయ్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. వివాహేతర సంబంధానికి రాహుల్ అడ్డగా ఉండడంతో అతడిని చంపాలని ప్రియుడు ప్లాన్ వేశాడు. అగ్వాన్‌పూర్ గ్రామ శివారులో పొలంలో రాహుల్ పని చేసుకుంటుండగా అజయ్ తుపాకీ తీసుకొని అతడిపై కాల్పులు జరిపాడు. గ్రామస్థులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహంపై మూడు బుల్లెట్ గాయాలు కనిపించాయి. దారిదోపిడీదారులు డబ్బుల కోసం హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసులు లోతుగా విచారణ ప్రారంభించారు. అజయ్‌తో అంజలి పారిపోవడంతో పోలీసులకు అనుమానం కలిగింది. వెంటనే పోలీసులు అజయ్‌ను అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.