తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీల భవితవ్యానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక గీటురాయిగా మారనుంది. ఇది కేవలం ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఎన్నికగా కొట్టిపారేయలేని పరిస్ధితి. రెండేళ్ల కాంగ్రెస్ పాలనకు ఇది రెఫరెండమ్. రెండు ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన భారత రాష్ట్ర సమితి జవజీవాలను నిర్ధారించే ఎన్నిక. అటు కేంద్రంలో పాలనతోనూ, ఇటు రాష్ట్రంలో అధికారంపైనా దృష్టిసారించిన బిజెపి భవిష్యత్తును ఖరారుచేసే ప్రజాభిప్రాయ వేదిక. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికను ఈ మూడు ప్రధాన పార్టీలు ఒక సవాలుగా తీసుకున్నాయి. అందువల్లే గతంలో హోరాహోరీగా జరిగిన ఉప ఎన్నికలకు ఏమాత్రం తీసిపోకుండా ఓట్ల సమరాంగణంలో కోట్ల రూపాయిలను ఖర్చు చేసే పరిస్ధితి స్పష్టంగా కనిపిస్తోంది.ఎంఎల్‌ఎ మాగంటి గోపీనాథ్ మరణంతో ఏర్పడిన ఖాళీని భర్తీచేసేందుకు నవంబర్ 11న ఉప ఎన్నిక జరుగనుంది. 4 లక్షలకు పైగా ఓటర్లను కలిగిన ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం 58 మంది పోటీపడుతున్నారు. వీరిలో బిఆర్‌ఎస్ తరపున మాగంటి సునీత, కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బిజెపి పక్షాన లంకల దీపక్‌రెడ్డి ప్రధాన అభ్యర్థులు కాగా, వీరి మధ్యే పోటీ స్పష్టంగా కనిపిస్తోంది.
మిగిలిన 55 మందికి కనీసం డిపాజిట్ దక్కే అవకాశాలు లేవనే చెప్పాలి. ఈ ముగ్గురిలో సునీత, దీపక్ రెడ్డి ఒసిలు కాగా, నవీన్ యాదవ్ బిసి కులానికి చెందినవారు. హైదరాబాద్‌లోని 15 నియోజకవర్గాల్లో ఒకటైన జూబ్లీహిల్స్ నియోజకవర్గం (నెంబర్ 61) సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒకటి. ఈ నియోజవర్గంలో ఆరు డివిజన్లు, సుమారు 146 కాలనీలు ఉన్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంటే అత్యంత సంపన్నమైనదన్న ప్రచారానికి భిన్నంగా ఇక్కడ దినసరి కూలీలు, సినీ కార్మికులు, పేద మధ్య తరగతి ప్రజలే అత్యధికులు.నియోజకవర్గంలో ముస్లింలు బిసి కులాల తర్వాత ఒసి. ఎస్‌సి కులస్ధుల సంఖ్యే ఎక్కువ. 2009లో ఈ నియోజకవర్గానికి కాంగ్రెస్ తరపున పి. విష్ణువర్ధన్‌రెడ్డి ఎన్నిక కాగా, మాగంటి గోపీనాథ్ 2014 లో టిడిపి తరపున, 2018, 2023లో టిఆర్‌ఎస్ తరపున పాతినిధ్యం వహించారు. 2023 ఎన్నికల్లో గోపీనాథ్ 80,549 (43.95%) ఓట్లు సాధించగా, కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ 64,212 (35.03%) బిజెపి అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి 25,866 (14.12%) ఓట్లు, ఎంఐఎం అభ్యర్ధి రషీద్ ఫరాజుద్దీన్ 7,848 (4.28%) ఓట్లు పొందారు. గోపీనాథ్ 16,337(8.91%)ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్‌పై విజయం సాధించగా, పోటీలో ఉన్న 19 మందిలో 16 మంది డిపాజిట్లు కోల్పోయారు.జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా 55 శాతం కంటే తక్కువగానే ఓట్లు పోల్ అవుతున్నాయి. ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకునే వారిలో పేద మధ్య తరగతి వారే ఎక్కువ. అయితే ఈసారి ఉప ఎన్నికల అత్యంత ప్రతిష్టాత్మకంగా మారినందున ఈసారి 4 లక్షల ఓట్లలో 75 శాతం వరకు ఓట్లు పోలవుతాయని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఎవరు లక్షన్నర ఓట్లు సాధిస్తారో వారిని విజయం వరించే అవకాశాలున్నాయి.
ఇక అభ్యర్ధుల విషయానికి వస్తే.. బిజెపి అభ్యర్ధి లంకల దీపక్ రెడ్డి గత ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటికీ ఈసారి కూడా అధిష్టానం ఆలోచించి చాలా ఆలస్యంగా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. బిజెపి తరపున కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తో పాటు రాష్ట్ర అధ్యక్షుడు రాంచందరరావు ముందుండి ప్రచారం సాగిస్తున్నారు. కిరాయికి జెండా పట్టుకునే వారు కాకుండా కేవలం కార్యకర్తలే ప్రచారంలో పాల్గొంటున్నారు. తాజాగా దీపక్ రెడ్డికి జనసేన పార్టీ కూడా మద్దతు తెలపడంతో త్రిముఖ పోటీలో ఒకరిగా ఈయన గుర్తింపు పొందారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై అభిమానం ఉన్నప్పటికీ అసెంబ్లీ స్థాయిలో అంతగా ఆదరించకపోవచ్చునని పలువురి మాటలను బట్టి తెలుస్తోంది. అయితే గతంలో కంటే ఈసారి దీపక్‌రెడ్డి గణనీయంగా ఓట్లను సాధించగలరని అంచనా. వాస్తవానికి ఇక్కడ హిందూ ముస్లిం అనే పోటీ లేకుండా ఎంఐఎం ఏకంగా తమ అభ్యర్థిని నిలపకుండా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించడంతో బిజెపి తన ట్రంప్ కార్డును వినియోగించే అవకాశం లేకుండాపోయింది. అయినప్పటికీ అజారుద్దీన్‌కు మంత్రి పదవిని ఇవ్వడం సరికాదంటూ కాంగ్రెస్‌ను, గత పదేళ్లలో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిందంటూ బిఆర్‌ఎస్‌పైనా నిప్పులు కురిపించింది.
ఇవన్నీ ఆశించిన స్థాయిలో బిజెపికి ఈ ఎన్నికల్లో అనుకూలంగా మారే అవకాశాలు లేకపోయినా రానున్న కాలంలో మాత్రం తప్పకుండా ప్లస్ పాయింట్లగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని ముస్లింలు అత్యధికంగా ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఒకటైన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపు 33% ముస్లిం ఓటర్లు ఉన్నందున బిజెపికి ఇక్కడ గెలుపు అందని ద్రాక్షగా మిగిలే సూచనలే కనిపిస్తున్నాయి. బిఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీదారుగా ఉన్నారు. ఆమెకు కుటుంబపరంగా కూడా ఇటు నామినేషన్ సమయంలోనూ, అటు ప్రచారాలు పరాకాష్టకు చేరుకున్న సమయంలోనూ సవాళ్లు తప్పలేదు. దివంగత గోపీనాథ్ రెండవ భార్య అయిన సునీత విషయంలో బిఆర్‌ఎస్ మొదటినుంచి స్ధిరాభిప్రాయంతోనే ఉంది.ఆమె పేరును బిఆర్‌ఎస్ బాస్ కెసిఆర్ స్వయంగా ప్రకటించి మరీ ఖర్చులకు డబ్బులిచ్చి పంపారు. అయితే ఈ ఎన్నికల్లో ఆయన ప్రచారానికి రాకపోవడం ఒక విధంగా లోటే అని చెప్పాలి. కానీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ స్టార్ క్యాంపెయినర్‌గా మారి ఇటు కాంగ్రెస్, అటు బిజెపికి బదులిస్తూ ముందుకు సాగుతున్నారు. మరో స్టార్ హరీశ్ రావు కూడా ప్రచారం పీక్‌కు తీసుకువెళ్లే సమయంలోనే తండ్రి మృతి కారణంగా దాదాపు 11 రోజుల పాటు ప్రచారానికి దూరమయ్యారు. బిఆర్‌ఎస్ తరపున మిగిలినవారి ప్రచారం పెద్దగా ప్రభావం చూపకపోయినా మంచివ్యక్తిగా గోపీనాథ్ కుటుంబంపై సానుభూతి, గతంలో కెసిఆర్ అమలు చేసిన పెన్షన్లు ఇప్పటికీ చాలా మంది మదిలో ఉండిపోయాయి. అంతేగాక గోపీనాథ్ పెద్దకర్మ నుంచి దాదాపు ఈ నియోజకవర్గంలో బిఆర్‌ఎస్ చాపకిందనీరులా తమ ప్రచారానికి తెరతీసింది.
ఈసారి బిసిల ప్రతినిధిగా పోటీలోఉన్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు.. ఈసారి అత్యధిక శాతం ముస్లింల, బిసిల మద్దతుతోపాటు యువత క్రేజీగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు దాదాపు మంత్రి వర్గం, పిసిసి కార్యవర్గం కాళ్లకు బలపంకట్టుకొని తిరుగుతున్నందున సహజంగానే కాంగ్రెస్ వైపు కొంత ఆర్భాటం కనిపిస్తోంది. మంత్రులు పొన్నం, తుమ్మల, వివేక్లతో పాటు 70 మంది స్టార్ క్యాంపెయినర్లను నియమించారు. ఆరు డివిజన్లకు మంత్రులను కేటాయించగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నారు. ఈ నియోజక వర్గానికి 4వేల ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, అంతకుముందే సుమారు 400 కోట్ల రూపాయిలతో అభివృద్ధి పనులు, 14 వేల కొత్త రేషన్ కార్డుల ఇలా కొన్ని జనాకర్షక పథకాలను ప్రజల్లోకి జొప్పించారు. వామపక్షాల మద్దతు, కోదండరాం వంటి ప్రముఖుల సహకారం, సినీ కార్మికులను ఆకట్టుకునే ప్రయత్నాలు, హీరో సుమన్ ఇంటింటి ప్రచారం, దివంగత పిజెఆర్ తనయ, కార్పొరేటర్ విజయారెడ్డి ప్రచారాలు, మాలమహానాడు, 132 బిసి కులాల మద్దతు ఇవన్నీ నవీన్ యాదవ్‌కు కలిసొచ్చే అంశాలే. నవీన్‌యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ తదితరులను రౌడీలుగా పేర్కొంటూ బిఆర్‌ఎస్ చేసే ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.
గతంలో జరిగిన హుజూరాబాద్, మునుగోడు ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా జూబ్లీహిల్స్ ఎన్నికలు కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆసక్తిని పెంచాయి. దీంతో వివిధ సంస్ధలు పోటీపడి సర్వేలు ప్రారంభించాయి. ఈ నియోజకవర్గంలో ఒక్కో ఓటరుకు రోజుకు కనీసం 10కిపైగా సర్వే కోసం ఫోన్లు వస్తూ ఎవరికి ఓటు వేస్తారంటూ వేధించాయి. ఈ నియోజకవర్గంలో పరిస్థితిని గమనిస్తే వివిధ ప్రాంతాల్లో ప్రతిరోజూ కనిపించే అడ్డాకూలీలకు అడ్డగోలు డిమాండ్ ఏర్పడింది. ఒక్కొక్కరికి 600 రూపాయిల నుంచి 800 వరకూ ఇస్తూ మధ్యాహ్న భోజనం అందిస్తూ జెండాలు మోసేందుకు కాంగ్రెస్, బిఆర్‌ఎస్ భారీ ఖర్చుకు తెరతీశాయి. నియోజకవర్గంలో బిఆర్‌ఎస్ పలు ప్రాంతాల్లో హైడ్రా బూచిని చూపిస్తూ కాంగ్రెస్‌ను అడ్డుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కెసిఆర్ హయాంలోనే పెన్షన్లు వచ్చాయన్న కృతజ్ఞత కొంతమేర పెన్షనర్లలో ఉన్నా కాంగ్రెస్ మాత్రం కొత్త రేషన్ కార్డులు, ఉచిత బస్సు, ఉచిత విద్యుత్, సన్నబియ్యం, వివిధ అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తోంది. కాగా ఎవరెంత ప్రచారం చేసినా ఆఖరి మూడు రోజుల్లో పోల్ మేనేజిమెంట్ కీలకం కానుంది. ఈ ప్రయత్నంలో సఫలమైన వారికి ఆధిక్యత లభించనుంది. ప్రస్తుత పరిస్ధితులను గమనిస్తే కనీసం 5 వేల మెజార్టీతోనైనా కాంగ్రెస్ గెలుపు ఖాయమన్న ఊహాగానాలే వినిపిస్తున్నాయి. అయినా ఈ ఎన్నికల్లో గెలిస్తే ఒకలా, ఓడితే మరోలా ప్రకటనలు ఇవ్వడానికి మూడు పార్టీలు సిద్ధంగానే ఉన్నాయి.
– దిమిలి అచ్యుతరావు
(సీనియర్ జర్నలిస్ట్)