డిఎన్‌ఎలో డబుల్ హీలిక్స్ నమూనాను ఆవిష్కరించి విశ్వవిఖ్యాత కీర్తి గడించిన ప్రముఖ శాస్త్రవేత్త జేమ్స్ వాట్సన్ (97) గురువారం నార్త్‌పోర్ట్‌లో కన్నుమూశారు. ఆయన కుమారుడు డంకన్ వాట్రస్ ఈ సమాచారాన్ని ధ్రువీకరించారు. డిఎన్‌ఎ ఆవిష్కరణకు గాను ఫ్రాన్సిస్ క్రిక్, మారిస్ విల్కిన్స్‌తో కలిసి నోబెల్ బహుమతిని 1962 లో అందుకున్నారు. 1928 ఏప్రిల్ 6 న చికాగోలో జన్మించిన వాట్సన్ 19 ఏళ్లకే చికాగో యూనివర్శిటీ నుంచి జువాలజీ, ఆ తరువాత మూడేళ్లకే ఇండియానా యూనివర్శిటీ నుండి పిహెచ్‌డి పొందారు. 1953 లో డీఎన్‌ఏ డబుల్ హీలిక్స్ నమూనాను ఆవిష్కరించారు. ఇది వంశపారంపర్య సమాచారాన్ని తరాల బదిలీ చేయడానికి
అనుమతించే పరమాణు నిర్మాణాన్ని వెల్లడించింది. ఈ ఆవిష్కరణకు డార్విన్ పరిణామ సిద్ధాంతం ప్రేరణగా నిలిచింది. జన్యుశ్రేణి, ఫోరెన్సిక్ విశ్లేషణ, వారసత్వ వ్యాధుల అధ్యయనానికి ద్వారాలు తెరిచింది. జన్యుపరీక్ష అభివృద్ధి నుంచి బయోటెక్నాలజీ, ఆధునిక వైద్యం వరకు ప్రతి అంశాన్ని ప్రభావితం చేసింది. జాతుల మధ్య మేధస్సు తేడాలు ఉన్నాయని, స్త్రీలపై , లింగ భేదాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. 2014లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా తన నోబెల్ బహుమతిని వేలం వేయగా రష్యా బిలియనీర్ 4.8 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసి వాట్సన్‌కు సాయం అందించారు.