ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలో భయం మొదలైందని.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత పదవీగండం పొంచి ఉందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ జి.జగదీష్‌రెడ్డి అన్నారు. సిఎం మానసిక స్థితి దెబ్బతిన్నట్లుందని.. సందర్భం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్షాలపై నిఘా పెట్టేందుకు కెసిఆర్ కమాండ్ కంట్రోల్ కట్టారని గతంలో రేవంత్‌రెడ్డి అన్నారని, ఇప్పుడు ఆయన అక్కడ కూర్చొని తమ మీద పెడుతున్నారా..? అని ప్రశ్నించారు. ప్రగతిభవన్‌లో బుల్లెట్ ప్రూఫ్ కిటికీలు ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. బుల్లెట్ ప్రూఫ్ కిటికీలు, కమాండ్ కంట్రోల్, సెక్రటేరియట్‌పై కమీషన్ వేయవచ్చు కదా..? అని అడిగారు. కెసిఆర్ దగ్గర ఉండి పని చేయించారు కాబట్టే.. ఆనాడు శాంతి భద్రతలు అదుపులో ఉండేవి అని పేర్కొన్నారు. కానీ, రేవంత్‌రెడ్డి చేయరాని పనులు చేస్తున్నారేమో, శాంతి భద్రతలు దెబ్బతిని, క్రైమ్ రేటు పెరిగిందని అన్నారు. తెలంగాణ భవన్‌లో శనివారం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్ అభివృద్ధి అజెండాపైనే జూబ్లీహిల్స్ ప్రజలు ఓటు వేయబోతున్నారని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఎవరూ తిట్టని విధంగా వైఎస్సార్‌ను, సోనియా గాంధీని తిట్టింది రేవంత్‌రెడ్డినే అని పేర్కొన్నారు. ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలను ఎన్ని రోజులు భయపెడుతారని ప్రశ్నించారు. ఏం చేసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదు అని, రేవంత్ రెడ్డి చేసే తప్పులకు చరిత్ర క్షమించదు అని చెప్పారు.బిహార్ ఎన్నికల ప్రచారానికి రేవంత్ రెడ్డిని వద్దని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పిలిపించుకున్నారని ఆరోపించారు. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి పదవుల్లో ఉన్నారు కాబట్టి.. ఇద్దరు బ్యాడ్ బ్రదర్స్ అని, వారు ఇద్దరూ మోదీ శిష్యులేనని అని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి,హైదరాబాద్ అభివృద్ధి బాధ్యత రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్ తీసుకోవాలని సూచించారు.మాగంటి గోపీనాథ్ తల్లితో ఎవరు మాట్లాడిస్తున్నారో అందరికీ తెలుసు అని చెప్పారు.