జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో పలు ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గం పరిధిలో 9వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి పోలింగ్ జరగనున్న 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు, తిరిగి ఓట్ల లెక్కింపు జరిగే 14న ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. పార్టీల జెండాలు, లాఠీలు, ఫైర్ ఆర్మ్, సమావేశాలు, పోలింగ్ స్టేషన్లకు కిలో మీటర్ దూరంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని హెచ్చరించారు. అసెంబ్లీ నియోజకవర్గంలో మైక్‌లు, పబ్లిక్ అడ్రస్ సిస్టంను రాజకీయ పార్టీలు ఏర్పాటు చేయవద్దని తెలిపారు.
ఎన్నికల రోజు, ఓట్ల లెక్కింపు రోజుల్లో మద్యం దుకాణాలన్నీ మూసి వేయాలని, హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బులు మూసివేయాలని ఆదేశించారు. నియోజకవర్గం వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధమన్నారు. ఓట్ల లెక్కింపు రోజున రోడ్లపై, జనవాసాల్లో టపాసులు పేల్చడం నిషేధించామని తెలిపారు. ఎన్నికల ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ హెచ్చరించారు.