నల్గొండ జిల్లా, చిట్యాల మండలం, గుండ్రంపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారి 65పై శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైoది. ఎస్‌ఐ రవికుమార్ తెలిసిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన వినోద్ పటేల్ తన కారులో కుటుంబ సభ్యులతో ఏడుగురుతో కలిసి విజయవాడకు వెళుతుండగా గుండ్రంపల్లి శివారులోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సమీపంలో ఉన్న యూటర్న్ వద్ద కారు డివైడర్‌కు ఢీకొట్టింది. దీంతో వేగంగా ఉన్న కారు రివర్స్‌లో పల్టీ కొట్టింది. వెంటనే అందులో ఉన్న వారంతా అప్రమత్తమై నుంచి బయటికి వచ్చారు. అయితే, కారుకు అగ్గి రాజుకుని కాసేపట్లోనే మంటలు వ్యాపించి దగ్ధమైంది. ఈ సంఘటనలో కారు నడుపుతున్న వినోద్ పాటేల్‌కు రెండు మోచేతులకు గాయాలు కాగా అతని కుటుంబ సభ్యులకు ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని దగ్ధమవుతున్న కారును ఆర్పివేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవికుమార్ తెలిపారు.