భారతదేశంలో మతం, అందులో నుంచీ పుట్టిన వర్ణ వ్యవస్థ, కులం వ్యవస్థ మనుషుల మధ్య అంతరాలకు కారణమైనవి. సామాజిక వైషమ్యాలను సృష్టించాయి. ప్రపంచ దేశాలతో పోలుస్తే ఇది భిన్నమైన కుట్రపూరితమైన అణచివేత అని చెప్పవచ్చు. వీటికి వ్యతిరేకంగా సమానత్వం, స్వేచ్ఛ, మానవ విలువల పునాదిగా ఆవిర్భవించిన భారతీయ మతం బౌద్ధం. అనంతరం ఈ విలువలకు దగ్గరున్నది సిక్కు మతం. ఈ రెండు కూడా భారతదేశంలో పుట్టిన మతాలు. సిక్కు మతం సమానత్వం, సామాజిక ఐక్యత, పరస్పర గౌరవానికి కృషి చేసింది. సిక్కు మత స్థాపకులు గురునానక్ దేవ్. ఆయన 1469లో నన్కానా సాహెబ్ జన్మించారు. ఏట కార్తీకమాసంలో గురునానక్ జయంతి జరుపుకుంటారు. ఆయన హిందూ, ఇస్లాం మత గ్రంథాలు అధ్యయనం చేసి, అన్ని మతాల సామరస్యాన్ని, ఏక దేవతా సిద్ధాంతాన్ని బోధించారు. కుల వ్యవస్థను, మతపరమైన వివక్షను తీవ్రంగా వ్యతిరేకించారు. ‘ఏక్ ఓంకార్’ సిద్ధాంతాన్ని ఉద్బోధించారు. చివరికి ‘గురు గ్రంథ్ సాహిబ్’ అనే మత గ్రంథానికి ప్రేరణ ఇచ్చారు.
గురునానక్ ప్రత్యేకంగా అణచివేయబడిన వర్గాల విముక్తినీ కోరుకున్నారు. ఈ క్రమంలో గురునానక్ సిద్ధాంతాలను ప్రభావితమైన కొందరు దళితులు కూడా సిక్కు మతంలో చేరారు, వారు అక్కడ గౌరవం, సమానత్వం పొందగలిగారు. సిక్కు మత స్థాపకుడైన గురునానక్ సంత్ రవిదాస్ శిష్యుడే. సిక్కు మత గ్రంథమైన ఆదిగ్రంథ్‌లో చెప్పులు కుట్టే చమార్ సంత్ రవిదాస్ బోధనలే అధికంగా ఉన్నాయి. ఆయన బోధనలతో ఉత్తర భారతదేశంలో అట్టడుగు వర్గాలు ఆత్మగౌరవంగా జీవిస్తూ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. రవిదాస్ మాదిగలకు ప్రశాంతమైన జీవితం స్వరాజ్యంలో లేదంటే శ్మశానంలో లభిస్తుందనీ చారిత్రక వాస్తవాన్ని చెప్పాడు. గురునానక్, సంత్ రవిదాస్ వంటి మహనీయుల బోధనలతో ప్రభావితమై కాన్షిరాం విప్లవం సృష్టించాడు. బహుజన రాజ్యాధికారానికి పునాది వేశాడు. నేడు ఆయన చైతన్యంతోనే బిసి, ఎస్‌సి, ఎస్‌టిలు సామాజిక న్యాయం, రాజ్యాధికారం కోసం పోరాడుతున్నారు. సిక్కు మతంలో పురుషుల పేరు చివర ‘సింగ్’ అనే పదం చేర్చి మానసిక పరివర్తనగావించారు. దీనర్థం ‘సింహ’ (lion). ఇది ఈ చారిత్రకంగా దేశమూలవాసులుగా సమానత్వం, ధర్మం, రాజసత్వం, బలహీనుల రక్షించడం, ధైర్యానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.
ఈ క్రమంలో ప్రముఖ రాజకీయవేత్త డాక్టర్ విశారదన్ మహరాజ్ ఊరి బయట జీవిస్తున్న మాదిగలకు ‘మహారాజులు’గా నామకరణం చేశాడు. మాదిగలు ఒకప్పుడు ఈ దేశాన్ని పాలించిన మహారాజులనే చారిత్రక వాస్తవాన్ని గుర్తు చేశారు. ఆత్మనూన్యత వీడి మళ్ళీ మహారాజులుగా (పాలకులుగా) పునర్జీవింపజేయడానికి 5 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. గురునానక్ కుల, మతాలను తిరస్కరించడం, సమానత్వాన్ని ప్రచారం చేయడం వంటి గొప్ప ఆదర్శాలతో అంబేద్కర్ ప్రేరేపితుడయ్యారు. గురునానక్ దళితులకు అత్యధిక గౌరవం ఇచ్చిన మత నాయకుడని, ఆయన బోధనలు దళితుల విముక్తి మార్గంగా ఉన్నాయని గుర్తించారు. చారిత్రకంగా భారత మనువాద సమాజంలో అట్టడుగు కులంగా దళితలు కులంపేరుతో తీవ్రంగా పీడనకు గురైనారు. ఈ క్రమంలో అంబేద్కర్ ‘కుల నిర్మూలన’ పోరాటంలో గురునానక్ నాయకత్వంలోని మత, సామాజిక విప్లవాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ముంబయిలో ఉన్న గురునానక్ ఖల్సా కళాశాల స్థాపన అంబేద్కర్ ఆలోచనతో ఏర్పడింది. అన్ని వర్గాల వారికీ ఉన్నత విద్య అందించాలనే సంకల్పంతో దీనికి ప్రోత్సాహించారు. భారతదేశంలో ఇప్పటికీ కుల, మత ఉన్మాదాలు హెచ్చరిల్లుతున్నాయి. వీటి పేరుతో చాపకింది నీరులా దుర్విచక్షణ కొనసాగుతుంది. దీంతో అట్టడుగు అణగారినవర్గాలు సామాజిక, సాంస్కృతిక, రాజకీయ అస్తిత్వం అణచివేయబడుతుంది. ఆధిపత్య సాంస్కృతిక భావజాలం, ప్రభుత్వ విధానాలే దీనికి ప్రధాన కారణం. ఇవీ ప్రజలను రెచ్చగొడుతూ ఓటు బ్యాంకు రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నాయి. అంతిమంగా సామాజిక సంఘర్షణలకు కారణమవుతున్నాయి. కావున దేశంలో సమానత్వం, సామాజిక న్యాయం, మానవ విలువలను కోసం ఉద్యమించాల్సిన అవశ్యకత ఉంది. దీనికి గురునానక్ సామాజిక ఐక్యత తత్వం అవసరం. మరోవైపు ఆయన సామాజిక చైతన్య స్ఫూర్తిని, అస్తిత్వ వాదాన్ని అర్థం చేసుకోవాలి. భారత రాజ్యాంగం మెజారిటీ ప్రజల హక్కులకు ప్రాధాన్యమివ్వడం జరిగింది. దీనికి విరుద్ధంగా భారత పరిపాలన, విధానాలు కొనసాగుతున్నాయి. దీంతో పీడితవర్గాల హక్కులు, అవకాశాలకు నష్టం జరుగుతుంది. నేడు సామాజిక న్యాయ పోరాటానికి గురునానక్ విలువలు, భారత రాజ్యాంగ సూత్రాలతో ఉద్యమించాల్సిన అవసరం ఉంది.
– సంపతి రమేష్ మహారాజ్
– 7989579428