అమరావతి: దేవుని గుడికి దంపతులు వెళ్తుంటే బైక్‌ను ఆర్‌టిసి బస్సు ఢీకొట్టడంతో భార్య ఘటనా స్థలంలోనే మృతి చెందింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా తెర్లాం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పెరుమాలి గ్రామానికి చెందిన కొరగంజి సంఘంనాయుడు(49), శ్రీలత(43) అనే దంపతులు మానసాదేవి గుడిని దర్శించుకునేందుకు బైక్‌పై వెళ్లారు. గరివిడి మండలం చిన ఐతాంవలస గ్రామ శివారులోకి రాగానే ఆర్‌టిసి బస్సు వీరి బైక్‌ను ఢీకొట్టడంతో భార్య కిందపడిపోయింది. భార్య తలపై నుంచి బస్సు చక్రాలు వెళ్లడంతో ఆమె ఘటనా స్థలంలోనే చనిపోయింది. భర్త కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ‘దేవత నీ దగ్గరికి వస్తుంటే నా భార్యనే తీసుకెళ్లావా?’ అని భర్త కన్నీంటి పర్యంతమయ్యారు. ‘ఇప్పుడు నా బాగోగులు ఎవరు చూసుకోవాలి’ అని ఆవేదన వ్యక్తం చేశారు. భార్య మృతదేహం పట్టుకొని భర్త రోదించిన తీరు చూసి వాహనాదారులు కన్నీంటిపర్యంతమయ్యారు.