అమెరికానే కాదు, ప్రపంచాన్ని గందరగోళానికి గురిచేస్తున్న ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా నిలబడి జోహ్రాన్ మమ్దాని న్యూయార్క్ నగర్ మేయర్‌గా గెలిచాడు. ఇది ప్రపంచ దృష్టిని ఎంతగానో ఆకర్షించింది. ఆధిపత్యం, అణచివేతలు ఎల్లకాలం సాగవనే సత్యాన్ని ఓటు శక్తి ద్వారా న్యూయార్క్ ప్రజలు నిరూపించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహూల్ గాంధీ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ హర్యానాలో జరిగిన గత ఎన్నికల్లో ఓట్ల గోల్ మాల్‌కు, ఓట్ల చోరికి పాల్పడి ఏ విధంగా గెలిచిందో అనేక ఉదాహరణలతో వివరించారు. అమెరికాలో జరిగిన జోహ్రాన్ మమ్దాని విజయంగానీ, ఓట్లను తొలగించి బిజెపి గెలిచిందనే వార్త గానీ ఈ రెండు ఓటు శక్తిని నిరూపిస్తున్నాయి. ప్రాచీన కాలంలో మధ్యయుగాల్లో కత్తులు, బాణాలు, తుపాకులు ఏ విధంగా రాజ్యాలను గెలుచుకోవడానకి ఉపకరించాయో ఆధునిక కాలంలో ఓటు హక్కు కూడా అటువంటి పాత్రను పోషిస్తుంది. జోహ్రాన్ మమ్దాని భారతీయ సంతతికి చెందినవాడు కావడం ఒక విశేషం. ఇదే విధంగా హైదరాబాద్‌కు చెందిన గజాలా హష్మి వర్జినియా గవర్నర్‌గా గెలిచింది. గజాలా హష్మి కూడా ట్రంప్ ప్రత్యర్థి పార్టీ డెమొక్రాట్ పార్టీకి చెందిన అభ్యర్థి.
ఆధునిక ప్రజాస్వామ్య వ్వవస్థలో ఓటు హక్కు అనేది సాదాసీదా పరికరం కాదు, ఇది ఒక వ్యవస్థ రూపురేఖలు మార్చగలిగే అధునాతన ఆయుధం. ఓటు హక్కు కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. అయితే మొదట్లో మన దేశంతో సహా ఏ దేశంలోనైన కేవలం సంపన్న వర్గాలకే ఓటు హక్కు ఉండేది. అప్పుడు అది ఒక రకంగా పాక్షిక ప్రజాస్వామ్యమే. ఒక రకంగా అది సంపన్న స్వామ్యమే. అయితే భారత దేశంలో బాబా సాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళు సార్వజనీన ఓటు హక్కు కోసం అంటే కులం, మతం, ధనిక, పేద, అక్షరాస్యత, నిరాక్షరాసత, ఆడ, మగ తేడా లేకుండా వయోజనులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండాలని పట్టుబట్టి సాధించిపెట్టారు. నిరక్షరాస్యులు, పేదలు ఓటు హక్కును సరైన పద్ధతిలో ఉపయోగించలేరని వాదించిన వాళ్ళున్నారు. అయితే భారత దేశంలో అనుభవం దానిని తప్పని రుజువు చేసింది. కేంద్రంలో, రాష్ట్రాల్లో ప్రజావ్యతిరేక చర్యలకు పూనుకున్న ప్రభుత్వాలు నడిపిన పార్టీలను ఓడించి, ఓటు హక్కు ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణ కోసమేనని ప్రజలు రుజువు చేశారు.
అయితే గత పది సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం చాలా రాష్ట్రాల్లో ముఖ్యంగా ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల్లో ఓట్లను తొలగించడం, దొంగ ఓట్లను చేర్చడం చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీతో సహా ప్రతిపక్షాలన్నీ ఆరోపిస్తున్నాయి. దీనికి రుజువులు కూడా చూపెడుతున్నారు. అయితే ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యమైన అంశమని మనం భావిస్తున్నాం. అది రుజువైంది కూడా. రాజ్యాంగ రచనా సమయంలో కొంతమంది అప్పుడే పేదలు, చదవులేని వారికి ఓటు హక్కు వద్దని మాట్లాడారు. దానికి వాళ్ళు చూపెట్టిన కారణం, ఈ ఆధునిక పద్ధతులు వాళ్ళకు అర్థం కావని చెప్పారు. అయితే అప్పుడేమో కానీ ఇప్పుడు దీని అంతరార్థం అర్థమవుతున్నది. ఓటు ఒక హక్కు మాత్రమే కాదు, ఒక బలం. ఒక శక్తి. అది అందివస్తే పేదలు ముఖ్యంగా నిమ్నకులాలు తమ మాట వినవనే వాళ్ళుకు తెలుసు. అప్పుడేమో చట్టపరంగా, విధాన నిర్ణయంగా అడ్డుకోవాలని చూశారు. అయితే ఇప్పుడు ఓటు హక్కు శక్తి తెలిసి వచ్చింది. కాబట్టి, తమకు అనుకూలంగా లేని సమూహాల, కులాల, మతాల ఓట్లను తొలగిస్తున్నట్టు అర్థమవుతుంది. ఇది 75 ఏళ్ళ కింద ఆనాటి ఆధిపత్య కులాలు, సంపన్నవర్గాలు చేసిన కుట్రకు ఇది కొనసాగింపు మాత్రమే.
అయితే 75 ఏళ్ళ తర్వాత ఈ ఓట్ల మీద దాడి ఎందుకు జరుగుతుంది? ఓటు హక్కు అనే దానిని ఎందుకు నిర్వీర్యం చేయాలనుకుంటున్నారు? ఇది కేవలం ఓటు హక్కుతో మొదలై ఓటు హక్కుతో ముగిసిపోయేది కాదు. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో రాజకీయ సమానత్వానికి ప్రాతిపదిక. ప్రజలందరూ ప్రజాస్వామ్యంలో తమ ప్రతినిధులను ఎన్నుకోవడానికి ఉన్న ఏకైక అవకాశం. ఇది ప్రజలను పాలనలో భాగస్వాములు కావడానికి ఉన్న అవకాశం. కానీ ఇది ఈ రోజు ముగింపుకు వచ్చినట్టు కనపడుతున్నది. ఎవరైతే ప్రభుత్వాలకు అనుకూలంగా లేరో, ఎవరైతే ఈ పాలన మారాలని అనుకుంటున్నారో వారికి ఓటు హక్కు లేకుండా చేయడమంటే, రాజకీయ ప్రజాస్వామ్యానికి చరమగీతం పాడడమే. బీహార్, అసోం, హర్యానాలలో ఇదే జరిగినట్టు విమర్శలున్నాయి. ఇది నూటికి నూరు పాళ్ళు అవాంఛనీయం.
ఇలా జరిగే ప్రమాదముందని, 75 ఏళ్ళ కిందట రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ హెచ్చరిక కూడా చేశారు. 1949, నవంబర్ 25వ తేదిన రాజ్యాంగ సభలో చివరి ఉపన్యాసం చేస్తూ ‘జనవరి, 26, 1950 నుంచి మనం వైరుధ్య జీవితంలోకి ప్రవేశించబోతున్నాం. ఒక మనిషి, ఒక ఓటు, ఒక విలువ అనే విధానం ద్వారా రాజకీయ సమానత్వాని సాధించుకున్నాం. కానీ సామాజిక, ఆర్థిక రంగాల్లో ఇంకా అసమానతులు కొనసాగుతున్నాయి. ఇవి ఇలాగే కొనసాగితే ప్రజాస్వామ్యం ప్రమాదపు అంచుల్లోకి వెళ్లుతోంది’ బాబా సాహెబ్ అంబేద్కర్ అన్న మాటలు ఈ రోజు అద్దంలో ప్రతిబింబం లాగా కనిపిస్తున్నాయి. దాని ఫలితమే ఓటు హక్కును దుర్వినియోగం చేస్తూ, ప్రజలను ఓటు హక్కుకు దూరం చేయడమే.
గత 75 సంవత్సరాలుగా ఆర్థిక ప్రగతి ఎంతో సాధించిందని మన దేశం గురించి మనం చెప్పుకుంటున్నాం. కానీ ప్రజలు అభివృద్ధికి దూరంగా జరిగిపోయారు. ఆర్థిక రంగం రోజు రోజుకు గుత్తాధిపత్యం సంపాదించుకుంటున్నది. గతంలో వృత్తులు ఉన్న సమూహాలు ఆర్థిక స్వాతంత్య్రాన్ని కలిగి ఉండేవి. ఈ రోజు అన్ని పారిశ్రామికాధిపతులు, కార్పొరేట్లు ఆక్రమించుకున్నారు. దీనితో ఆర్థిక స్వాలంబనను కలిగి ఉన్న ప్రజలు పరాధీన బతుకులు అనుభవిస్తున్నారు. గ్రామీణ పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. రెండోది ఆధునీకరణ, యాంత్రీకరణ, కంప్యూటరీకరణ ద్వారా శ్రమ చేసే శక్తి ఉన్న యువతి యువకులు నిరుద్యోగులుగా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సాంప్రదాయకంగా తరతరాలుగా అనుభవిస్తున్న ఆర్థిక స్వాతంత్య్రం ఈ రోజు కార్పొరేట్లు చెప్పుచేతుల్లోకి వెళ్ళాయి.
అంతేకాకుండా గతంలో కన్నా చాలా ఎక్కువ ఆర్థిక వ్యత్యాసాలు పెరిగాయి. ఇందులో ఆధిపత్య కులాలు ఆర్థికంగా లాభపడితే నిమ్న, వెనుకబడిన కులాలు, దళితులు, ఆదివాసులు ఆర్థిక పరాన్నజీవులుగా తయారయ్యారు. గత పదేళ్ళలో అదానీ కంపెనీ ఆస్తుల పెరుగుదల చూస్తే మనం ఎటువైపు ప్రయాణం చేస్తున్నామో అర్థం కాగలదు. అంతేకాకుండా కేవలం 10 శాతం కుటుంబాలు దేశంలో సంతృప్తిగా ఉన్నాయి. మిగతా 90 శాతంలో పది శాతం పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న మధ్య తరగతి వర్గాలు, మిగిలిన 80 శాతం కుటుంబాలు ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల మీద బతుకుతున్నాయి. ఉచితాల పేరుతో చేతులు ఉన్న పని చేయని అవిటి వాళ్లులాగా తయారు చేస్తున్నారు. ఇది చాలా ఎక్కువగా, బిసిలు, ఎస్‌సిలు, ఎస్‌టిలు, మైనారిటీలు ఉన్నారు. అదే విధంగా సామాజికంగా ఈ దేశం కులాలుగా విడిపోయి ఉన్నవి. కులాలు ఒకదానికొకటి విడివిడి ఉన్నాయి. అంతేకాకుండా ఎక్కువ, తక్కువ అనే సామాజిక సంబంధాలను కలిగి ఉన్నాయి. సనాతన పేరుతో నడుస్తున్న హిందూ వ్యవస్థ కులాలను పెంచి పోషిస్తుందే. కానీ వాటిని తొలగించే ప్రయత్నం చేయడం లేదు. దానికి సాక్షాలుగా దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు, కులాంతర వివాహాలు జరిగితే ఆ వ్యక్తులపై దాడుల, హత్యలు ఈ దేశంలో సామాజిక సమానత్వాన్ని ఒక అందుకోలేని ఆకాశంగా తయారు చేస్తున్నారు. ఆర్థిక, సామాజిక అసమానతలలో వివక్షకు, అసమానతలకు, అణచివేతలకు గురవుతున్న ప్రజలు వ్యవస్థ మీద, ప్రభుత్వాలమీద తిరుగుబాటు చేస్తారేమోననే భయంతో ప్రభుత్వాల భవిష్యత్‌ను నిర్ణయించే ఓటు హక్కును దూరం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయి. అందువల్ల సామాజిక, ఆర్థిక సమానత్వలు సాధించనంత వరకు రాజకీయ ప్రజాస్వామ్యం ఒక నిజమైన అబద్ధం.
– మల్లేపల్లి లక్ష్మయ్య ( దర్పణం)