వివేక్ అగ్నిహోత్రి.. తాష్కెంట్ ఫైల్స్, కశ్మీర్ ఫైల్స్ వంటి వివాదాస్పద చిత్రాలతో పేరు తెచ్చుకున్నాడు. భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రీ మరణం వెనుక జరిగిన కుట్రలపై తాష్కెంట్ ఫైల్స్.. 1990లో జమ్మూ కశ్మీర్‌లో చెలరేగిన తిరుగుబాట్లపై కశ్మీర్ ఫైల్స్‌ని ఆయన తెరకెక్కించాడు. తాజాగా ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘ది బెంగాల్ ఫైల్స్’. 1946లో బెంగాల్‌లో చెలరేగిన అల్లర్ల బ్యాక్‌డ్రాప్ స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వివేక్ అగ్నిహోత్రి ట్రయాలజీలో ఇది చివరి సినిమా.
ఈ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్లలోకి వచ్చింది. దాదాపు మూడున్నర గంటల నిడివి గల ఈ సినిమా కశ్మీర్ ఫైల్స్ అంత సక్సెస్ సాధించలేకపోయింది. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ సినిమా ఒటిటిలో విడుదలకు సిద్ధమైంది. గత రెండు చిత్రాల్లానే ఈ చిత్రం కూడా జి-5లో నవంబర్ 21వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ జి-5 పోస్టర్‌ని పంచుకుంది.