ఆసియాకప్ ఫైనల్ జరిగి నెల రోజులు దాటినా.. టోర్నమెంట్ ట్రోఫీ వివాదం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఈ టోర్నమెంట్ విజేతగా నిలిచిన భారత్.. ఎసిసి ఛైర్మన్ మోసిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని అందుకొనేందుకు భారత క్రికెట్ జట్టు తిరస్కరించింది. నఖ్వీ కూడా ట్రోఫీ తానే ఇస్తానని పట్టుబట్టడంతో వివాదం కాస్త ముదిరింది. అయితే ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఐసిసి ముందుకొచ్చింది. శుక్రవారం జరిగిన ఐసిసి బోర్డు సమావేశంలో బిసిసిఐ ఆసియాకప్ విషయాన్ని ప్రస్తావించింది. ఆసియా కప్ ట్రోఫీ తమకు అందేలా చూడాలని ఐసిసిని కోరింది. దీంతో ఐసిసి ఈ సమస్య పరిష్కారం కోసం ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.
బిసిసిఐ, పిసిబి రెండింటితోనూ సత్సంబంధాలు కలిగిన ఒమన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ పంకజ్ ఖిమ్జీని ఈ కమిటీకి నాయకత్వం వహించనున్నారు. ఐసిసి సమావేశానికి ముందు బిసిసిఐ నఖ్వీకి లేఖ రాసింది. ట్రోఫీ తమకు అందజేయాలని లేఖలో కోరింది. అయితే నవంబర్ 10న దుబాయ్‌లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి ట్రోఫీని తానే అందిస్తానని నఖ్వీ సమాధానం ఇచ్చారు. ఈ ప్రతిపాదనను బిసిసిఐ తిరస్కరించింది. నఖ్వీ నుంచి నేరగా ట్రోఫీని తీసుకోవడానికి అంగీకరించమని బిసిసిఐ కార్యదర్శి సైకియా స్పష్టం చేశారు. అలా చేయడానికి జట్టు సిద్ధంగా ఉంటే ఫైనల్ జరిగిన వెంటనే ట్రోఫీ తీసుకొనేది కదా అని అన్నారు. ఈ నేపథ్యంలో ట్రోఫీ వివాదాన్ని పరిష్కరించడానికి ఐసిసి మధ్యవర్తిత్వం చేస్తోంది.