అమెరికాలో షట్‌డౌన్ ప్రభావం అనేక రంగాలను కల్లోల పరుస్తోంది. వివిధ రాష్ట్రాల్లో ఆహార సంక్షోభానికి దారితీస్తోంది. వాణిజ్య రాజధాని న్యూయార్క్‌కు ప్రభుత్వం నుంచి ఆహార సాయం అందక ఆ రాష్ట్రం స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని ప్రకటించింది. కోట్లాది మంది అల్పాదాయ కుటుంబాలకు జీవనాధారమైన ‘సప్లిమెంట్ న్యూట్రిషన్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్’ లేదా ‘ఫుడ్‌స్టాంప్స్’ ప్రయోజనాలు అందని ప్రమాదం ఏర్పడింది. మరోవైపు షట్‌డౌన్ ప్రభావం కారణం గానే విమాన సర్వీస్‌ల సిబ్బందికి జీతాలు చెల్లించలేక 10 శాతం సర్వీస్‌లను తగ్గిస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు నుంచి పార్క్ వార్డెన్ల వరకు 1.4 మిలియన్ ఫెడరల్ వర్కర్లు శెలవుపై వెళ్లడమో లేదా వేతనం లేకుండా పని చేయవలసి రావడమో తేల్చుకోలేక త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడుతున్నారు. ఇటువంటి తీవ్ర సంక్షోభం నేపథ్యంలో అన్నవస్త్రాలు ప్రజలకు ఎలా అందించాలన్న ప్రయత్నాలకు బదులు అణ్వస్త్రాల పోటీకి అమెరికా ప్రభుత్వం మొగ్గు చూపడం శాంతికాముక దేశాలను కలవరపరుస్తోంది. తాజాగా ఫ్లోరిడా లోని మయామిలో జరిగిన అమెరికన్ బిజినెస్ ఫోరమ్‌లో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. అణు నిరాయుధీకరణ గొప్ప విషయమని, దీనిపై రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో చర్చించానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక వైపు హితవచనాలు పలుకుతూ మరోవైపు తమ వద్ద ఉన్న అణ్వాయుధాలతో ఈ ప్రపంచం మొత్తాన్ని 150 సార్లు పేల్చేయొచ్చని బెదిరించడం ఫక్కా నియంతృత్వ ధోరణిని ప్రతిబింబిస్తోంది.
దక్షిణ కొరియాలో అక్టోబర్ 29న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ కావడానికి కొన్ని నిముషాల ముందు అమెరికా అణ్వాయుధాల పరీక్షను ఇతర దేశాలతో సమానంగా ప్రారంభిస్తుందని ట్రంప్ ప్రకటించడం సంచలనం రేపుతోంది. ‘రష్యా, చైనా దేశాలు అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. కానీ అవి వాటి గురించి ఎక్కడా ఎప్పుడు ప్రస్తావించడం లేదు. ఉత్తర కొరియా కచ్చితంగా అణ్వాయుధాలను పరీక్షిస్తూనే ఉంది. పాకిస్థాన్ కూడా ఇదే దారిలో ముందుకు వెళ్తోంది’ అని ట్రంప్ బహిరంగంగా వ్యాఖ్యానించడం గమనార్హం. ఉత్తర కొరియా విషయంలో ట్రంప్ చెప్పింది అక్షరాలా సత్యం. నవశతాబ్దంలో ఉత్తరకొరియా బహుళ అణ్వాయుధాలను పరీక్షించింది. కానీ అణ్వాయుధ నిల్వలు కలిగిన అమెరికా, చైనా, రష్యా తదితర అగ్రరాజ్యాలతో సహా ఇతర దేశాలు 1990 నుంచి అణ్వాయుధ పరీక్షలపై తాత్కాలిక నిషేధాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే అణ్వాయుధాలను మోసుకెళ్లే క్షిపణులను అవి పరీక్షించగలవు. ఇప్పుడు అణుశక్తితో నడిచే అస్త్రాన్ని రష్యా సిద్ధం చేసింది. 15 గంటల పాటు గాల్లోనే ఉండి, 14 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించే ‘బురెవెస్ట్‌నిక్’ అణుక్షిపణిని పరీక్షించింది. అలాగే సముద్ర గర్భ టార్పెడోను ప్రయోగించి పరీక్షించింది. ఈ పరీక్షలు విజయవంతమయ్యాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించగానే ట్రంప్ స్పందించి తమ దేశం కూడా అణ్వాయుధ పరీక్షలను తిరిగి చేపడుతోందని ప్రకటించడం విశేషం.
రష్యా ప్రయోగించిన ఆ రెండు అణుక్షిపణులు అమెరికా రక్షణ క్షిపణి వ్యవస్థలను అధిగమించేలా డిజైన్ చేశారు. అవి అణ్వాయుధాలను ఎక్కడికైనా తీసుకెళ్ల గలవు. కానీ అవి అణువిస్ఫోటన పరీక్షలు కావు. సోవియెట్ యూనియన్ ఉన్నప్పుడు 1990 లో రష్యా ఆఖరిసారి అణ్వాయుధ పరీక్ష నిర్వహించింది. అలాగే 1992 లో అమెరికా ఆఖరి అణుబాంబు పరీక్ష, 1996లో చైనా ఆఖరి అణుపరీక్ష నిర్వహించాయి. అన్ని అణుపరీక్షలను నిషేధిస్తూ 1996లో సమగ్ర నిషేధ ఒప్పందం (సిటిబిటి) కుదిరింది. కానీ అవసరమైన సంఖ్యలో దేశాలు దీనిని ఆమోదించకపోవడంతో ఆ ఒప్పందం అమలు లోకి రాలేదు. ఒప్పందంపై అమెరికా, చైనాలు సంతకాలు చేసినా దాన్ని ఆమోదించడం మాత్రం జరగడం లేదు. రష్యా ఒప్పందంపై సంతకం చేసి ఆమోదం తెలియజేసినా, 2023లో అమెరికాతో ఉద్రిక్తతలు పెరిగిపోవడంతో ఒప్పందానికి కట్టుబడి ఉండకూడదని నిర్ణయించుకుంది. ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్టుల వివరాల ప్రకారం ప్రపంచం మొత్తం మీద భారీ ఎత్తున అణ్వాయుధాలు కలిగిన రష్యాలో 4309 అణుక్షిపణులు ఉన్నాయి. తరువాత రెండోస్థానం అమెరికాలో 3700, చైనాలో 1000 అణుక్షిపణులు ఉన్నాయని అంచనా. చారిత్రకంగా అమెరికా అనేక సార్లు అణు పరీక్షలు నిర్వహించింది.
1030 అణు విస్ఫోటనాలను నిర్వహించింది. తరువాత సోవియెట్ యూనియన్ 715, ఫ్రాన్స్ 210, చైనా 45 అణువిస్ఫోటన పరీక్షలను చేపట్టాయి. ఒప్పందం తరువాత మొత్తం 2056 అణుపరీక్షలు జరిగాయి. ఈ నేపథ్యంలో అమెరికా మళ్లీ అణుపరీక్షలు కొనసాగించడానికి సిద్ధం కావడం చర్చకు దారి తీస్తోంది. దీన్ని సమర్థిస్తున్నవారు అణ్వాయుధాలు పనిచేస్తున్నాయో లేదో తిరిగి పరీక్షించుకోవడం అవసరమని చెబుతున్నారు. అయితే అమెరికా సెక్రటరీ ఆఫ్ ఎనర్జీ క్రిస్‌వ్రైట్ తమ దేశం అణ్వాయుధ పరీక్షలు తిరిగి ప్రారంభించబోదని, ఎలాంటి అణు విస్ఫోటనం జరగకుండా కేవలం దేశవాళీ పేలుడు పదార్ధాలతోనే తక్కువ శక్తిగల ప్లుటోనియం 239పై ఒత్తిడి తీసుకొచ్చే పరీక్షలు చేస్తుందని నవంబర్ 2న చెప్పుకొచ్చారు. అంతరిక్షం, సముద్ర జలాలు మొదలుకొని ఎలాంటి పర్యావరణ వాతావరణంలో కూడా అణుపరీక్షలు చేయరాదని 1963లో పాక్షిక పరీక్ష నిషేధ ఒప్పందంపై సోవియట్ యూనియన్, అమెరికా, బ్రిటన్ దేశాలు సంతకం చేశాయి. ఇప్పుడు అమెరికా తిరిగి అణుపరీక్షలు ప్రారంభిస్తే ఇతర అణ్వాయుధ దేశాలపై కూడా ఆధిపత్య ప్రభావం పడుతుంది. ఇప్పటికే చైనా గతంలో 1964 లో మావో ప్రయోగించిన అణుబాంబు విస్ఫోటన ప్రదేశం లాప్‌నూర్ వద్ద అణుపరీక్షలకు సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రభావం మిగతా దేశాలపై చూపిస్తుంది.