విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు‘. ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్ బ్యానర్స్‌పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. ‘సంతాన ప్రాప్తిరస్తు‘ సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు, యంగ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ అతిథులుగా ‘సంతాన ప్రాప్తిరస్తు‘ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ “ఇప్పటివరకు కల్యాణ్ ప్రాప్తిరస్తు అని వినేవాళ్లం, ఇప్పుడు సంతాన ప్రాప్తిరస్తు అని వింటున్నాం. ప్రస్తుతం సహజీవనం, పెళ్లి సులువు అయ్యింది. కానీ పిల్లలు పుట్టడమే సమస్యగా మారుతోంది. అందుకే ఈ సినిమాకు ఈ టైటిల్ పెట్టుకున్నారు. ‘సంతాన ప్రాప్తిరస్తు‘ సినిమా ప్రేక్షకులకు, మీడియాకు నచ్చి మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను”అని అన్నారు.
డైరెక్టర్ సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ “సంతాన ప్రాప్తిరస్తు‘ ఒక స్వచ్ఛమైన ప్రేమ కథ. ఈ కథకు ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఒక చిన్న సామాజిక సమస్యను కూడా జతచేసి రూపొందించాం. మనం బయటకు వెళ్లి చూస్తే చాలా ఫెర్టిలిటీ సెంటర్స్ కనిపిస్తున్నాయి. ప్రపంచంలో చూస్తే మన దేశంలోనే ఎక్కువ సంఖ్యలో ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. మా కథకు ఇలాంటి ఒక అంశాన్ని కలిపితే బాగుంటుంది అనిపించింది. ఈ నెల 14న రిలీజ్ అవుతున్న మా చిత్రాన్ని చూసి ఆదరించాలని కోరుతున్నా”అని పేర్కొన్నారు. ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ “నేను మొదటి నుంచీ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తుంటాను. ఈ సినిమా కూడా మంచి కాన్సెప్ట్ ఉన్న క్యూట్ మూవీ. కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ ను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. మా ‘సంతాన ప్రాప్తిరస్తు‘ సినిమాను కూడా ప్రేక్షకులు సక్సెస్ చేస్తారని నమ్ముతున్నాం”అని తెలిపారు. ఈ కా ర్యక్రమంలో హీరో విక్రాంత్, హీరోయిన్ చాందినీ చౌదరి, నిర్మాత నిర్వి హరిప్రసాద్ రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ, స్క్రీన్ ప్లే రైటర్ షేక్ దావూద్.జి, కల్యాణ్ రాఘవ్ పాల్గొన్నారు.