తన సొంత చెల్లిని, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ మాగంటి గోపీనాథ్ తల్లిని బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మోసం చేశారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. మాగంటి తల్లి ఆవేదన చూస్తుంటే కేటీఆర్ ఎంత పెద్ద మోసకారో అర్థమవుతుందని అన్నారు. 91 ఏండ్ల వృద్ధురాలు అని చూడకుండా మాగంటి తల్లిని అవమానపరిచారని తెలిపారు. జూబ్లీహిల్స్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్, హరీష్ రావులపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్, హరీష్ రావు హడావుడి చూస్తే టిఆర్‌ఎస్ ఓటమి ఖాయంగా కనిపిస్తుందని అన్నారు. మాగంటి తల్లి చేసిన ఆరోపణలపై కెసిఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హరీష్ రావు నిశ్శబ్ద విప్లవం అంటూ ప్రగల్పాలు పలుకుతున్నారని అంటూ 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇలాగే నిశ్శబ్ద విప్లవమని అన్నారని, అయితే అ నిశ్శబ్ద విప్లవం మిమ్మల్ని నిండా ముంచిందని ఎద్దేవా చేశారు.
ఓటమి తప్పదని తెలిసి అవస్తవాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో బిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో విధ్వంసం చేశారని విమర్శించారు. వైను, మైను, ల్యాండ్, సాండ్ అన్ని మాఫియాలతో తెలంగాణలో విధ్వంస పాలన చేశారని బిఆర్‌ఎస్ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మీకు గుణపాఠం చెప్పారని అన్నారు. తెలంగాణ ప్రజల సమస్యలను రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారని, పదేళ్లు కనీసం ఒక రేషన్ కార్డు ఇవ్వని దుష్ట పాలన కెసిఆర్‌దని అన్నారు. మీరు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే ఆ కబ్జాల నుంచి మేము ఆ భూములను విడిపిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌ను నిండా ముంచింది మీరేనని, మీ పదేళ్ల పాలనలో హైదరాబాద్‌లో కనీస మౌలిక వసతులు కల్పించలేదని ఆరోపించారు. మహిళా సంఘాలకు రూ.3 వేల కోట్లు వడ్డీలు ఎగ్గొట్టిన వాళ్లకు మహిళలు ఓటెయ్యరని అన్నారు.
మహిళా సాధికారత కోసం ఎంతో కృషి చేస్తున్నామని చెప్పారు.ఉచిత బస్సు ప్రయాణం మొదలుకొని, కోట్ల రూపాయల వ్యాపారాలు మహిళలు చేపట్టేలా చేయూతనందిస్తున్నామని తెలిపారు. దాన్ని ఓర్చుకోలేక మహిళలను రికార్డు డాన్సు చేసుకోండి అని కేటీఆర్ అన్న మాటలను ఆడకూతుళ్లు మర్చిపోలేదని అన్నారు. సొంత చెల్లిని, మాగంటి తల్లిని మోసం చేసిన కేటీఆర్‌కు జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని మంత్రి సీతక్క అన్నారు.