మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జూబ్లీహిల్స్ నియోజకవ ర్గం ఉప ఎన్నికల ప్రచారం ఆద్యంతం ఉత్కంఠభరితంగా కొనసాగింది. ఆయన రోడ్ షో, సమావేశాలకు అనుమతిలేదని పోలీసులు ముందు చెప్పడంతో బిజేపి శ్రేణులు రాష్ట్ర పోలీసులపై విరుచుకుపడ్డారు. కేంద్రమంత్రి బండి సంజయ్ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మజ్లిస్ చెప్పినట్లు పోలీసులు వింటున్నారని, తాను పర్యటనకు వస్తానని, ఎవరు ఆపుతారో చూస్తానంటూ తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించడం కలవర పెట్టింది. బిజెపి కార్యకర్తలంతా బోరబండ ఎన్నికల ప్రచారానికి తరలిరావాలని పిలుపునివ్వడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. సాయంత్రానికి పోలీసులు అనుమతిస్తున్నట్లు ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.బోరబండ ఎన్నికల సభలో బండి సంజయ్ మాట్లాడుతూ ‘నేను హిందువును, టోపీ పెట్టి, దొంగ నమాజ్ చేసి ఇతర మతాలను కించపర్చను, ఒక వేళ టోపి పెట్టుకునే రోజు వస్తే తల నరుక్కుంటా’ అని సంచలన వ్యాఖ్య లు చేశారు.
ఇక కెసిఆర్ కుమార్తె కవితపైనా బండి సంజయ్ విరుచుకుపడ్డారు. మీ తండ్రి వద్దకు పోయి అప్పుడప్పుడు బాగోగులు చూసుకో అంటూ కవితకు సూ చించారు. కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగితే రూ.9 వేల కోట్లపైనే సీబీఐ విచారణ ఎందుకు కోరినట్లు? అని రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రూ.లక్ష కోట్ల అవినీతిపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా? అని నిలదీశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని హిందువులారా 70 శాతం ఓట్ల సత్తా ఏందో చూపించండని పిలుపునిచ్చారు. రావు వచ్చినా, రెడ్డి వచ్చినా మేం చెప్పినట్లు వినాల్సిందేనని ఒవైసీ చెప్పినా పౌరుషం లేని దద్దమ్మలు కాంగ్రెసోళ్లు అంటూ మంత్రులు, నేతలపై సంజయ్ ఘాటుగా విమర్శించారు. టోపీ పెట్టుకున్న రేవంత్ రెడ్డిని చూస్తే సినిమా యాక్టర్ వేణుమాధవ్ గుర్తుకొచ్చాడని ఎద్దేవా చేశారు. అజహరుద్దీన్ చేత గణేష్ మంత్రం చదవించే దమ్ముందా?, ఒవైసీ సొదురులను భాగ్యలక్ష్మీ ఆలయానికి తీసుకుపోయి బొట్టు పెట్టించి అమ్మవారి పాట పాడించే దమ్ముందా? అని ప్రశ్నించారు.
దీపక్‌రెడ్డి గెలవాలి: రాంచంద్రరావు
బోరబండలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ హిందు టైగర్ బండి సంజయ్ ఎందుకు అంత ఆవేశంగా మాట్లాడారో మీకు తెలుసునని అన్నారు. బిజెపి అభ్యర్థి దీపక్ రెడ్డి గెలవాలి, ఆయన అసెంబ్లీకి వెళ్లి మన వాణి వినిపించాలని బండి సంజయ్ అలా మాట్లాడారని అన్నారు. హిందువుగా స్వాభిమానాన్ని కాపాడాలంటే జూబ్లిహిల్స్ ఎన్నికల్లో దీపక్ రెడ్డిని గెలిపించాలని కోరారు. రేవంత్ రెడ్డి రేవంతుద్దీన్ గా మారిపోయిన సంగతి తెలిసిందేనని ఎద్దేవా చేశారు. ఆయన మారినట్లుగానే మనం రహమత్ నగర్‌ను మీనాక్షి నగర్‌గా పేరు మార్చుదామని అన్నారు.