ప్రపంచ దేశాల్లో మార్పు తథ్యం అనిపిస్తున్నది. అమెరికాలో భారతీయ మూలాలున్న నాయకులు కీలక రాజకీయ పదవులు అధిరోహిస్తున్న నేపథ్యంలో ఇది మరింత బలపడుతోంది. ఇటీవలి ఎన్నికల్లో పలువురు భారతీయ- అమెరికన్లు విజయాలు సాధించడం, అమెరికాలో 44 లక్షలకు పైగా ఉన్న భారతీయ వంశీయుల రాజకీయ ప్రభావం పెరుగుతున్నదనే సంకేతాలు ఇస్తోంది. అత్యంత ప్రధానంగా న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికలలో జోహ్రాన్ మమ్దాని విజయం సాధించి నగర మేయర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. 34 ఏళ్ల వయసులో, ఒక శతాబ్దం తరువాత న్యూయార్క్‌కు అత్యంత యువ మేయర్‌గా ఆయన నిలవనున్నారు. ఉగాండా భారతీయ మూలాల తల్లిదండ్రులకు జన్మించిన మమ్దాని, గృహ వసతి, వలసదారుల హక్కులు, ప్రజారవాణా వంటి అంశాలపై పనిచేసినందుకు సిద్ధ్దపడుతున్నారు.
ప్రపంచంలో ఏది తప్పుగా జరుగుతోంది? ఏ అన్యాయానికి పరిష్కారం అవసరం? ఏ కథ లోకానికి చెప్పడం లేదు?’ అన్న అంశాలపై జోహ్రాన్ చర్చించారు. ఆ విశ్లేషణలను వింటూ పెరిగిన వాడు ఇప్పుడు ప్రపంచమంతా తన వైపు తిప్పుకునేంత ఎత్తు ఎదిగారు. అమెరికా గడ్డపై న్యూయార్క్ పట్టణ మేయర్‌గా తొలిసారి ఓ సోషలిస్టుగా ఎన్నికై తన పేరును చరిత్ర పుటల్లో లిఖించాడు. జోహ్రాన్ చిన్నవయస్సులోనే సమకాలీన అంశాలను విశ్లేషించే వారు. మతతత్వశక్తులపై నిరసనలు తెలియచేసారు. భారత్‌లో రామ్ మందిర్ నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు, గాజాలోని ముస్లింలపై దాడులను నిరసన వ్యక్తం చేసారు. జోహ్రాన్ 1991లో ఉగాండాలోని కంపాలలో జన్మించారు. తల్లి మీరానాయర్, తండ్రి మహ్మద్ మమ్దానీ. ఇద్దరూ భారతీయులే. మీరా బాలీవుడ్ చిత్రరంగంలో అవార్డులు కొల్లగొట్టిన ప్రముఖ చిత్రాలు ‘సలాం బాంబే’, ‘మాన్‌సూన్ వెడ్డింగ్’ వంటి సినిమాలని తెరకెక్కించారు.
ఈ కుటుంబం జోహ్రాన్‌కి ఐదేళ్లప్పుడు దక్షిణాఫ్రికాకి వెళ్లి, ఆ తరువాత న్యూయార్క్ నగరంలో స్థిరపడ్డారు. బాల్యం నుండి న్యూయార్క్ వీధుల్లో పెరిగిన జోహ్రాన్ ఎన్నోసార్లు వివక్షని ఎదుర్కొన్నాడు. ఆ సందర్భాన్ని ఒకసారి ఆయన ఇలా చెప్పారు. ‘నా స్నేహితుడు ఒకసారి నన్ను ‘మీరు సనాతనవాదులు కారు’ అని చెప్పాడు. జోహ్రాన్ బదులిస్తూ మేము బుద్ధిమంతులం, తెలివిపరులమని తెలియజేసారు. మా కుటుంబంలో ప్రార్థన ఉంది. కవిత్వమూ ఉంది. మా ఇంట్లో ఉర్దూ గజల్స్ ఉంటాయి. ఆఫ్రికన్ జానపద కథలు వినిపిస్తాయి’ అని చెప్పాడు. ఎన్నో చేదు అనుభవాలు అతనికి ఎదురయ్యాయి. ‘తనని ఇంతటి శక్తిమంతుడిగా తీర్చిదిద్దింది అమ్మానాన్నే’ అని జోహ్రాన్ గర్వంగా చెబుతారు. ‘వలస వెతలు, బాల కార్మికులు, గుర్తింపు, సంస్కృతి వంటి ఇతివృత్తాలను అద్భుతంగా తెరకెక్కించిన తల్లి పెంపకంలో తాను ఉన్నతంగా ఎదిగానని జోహ్రాన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మరోసారి తన తల్లి గురించి ఆయన ఇలా అన్నారు. ‘హ్యారీ పోర్టర్ లాంటి సినిమాలని ఏ మంచి దర్శకుడైనా రూపొందిస్తారు.
కానీ అమ్మ తీసిన చిత్రాలు కేవలం ఆ వ్యక్తులు, వాళ్ల బాధలను పట్టించుకునే వ్యక్తులకు మాత్రమే సాధ్యం. సమాజంలో వివక్షకు గురవుతున్న వర్గాలపట్ల నా తల్లిదండ్రీ నిలబడడం నిజంగా నాకు గర్వకారణం. వాళ్లు చెప్పిన కథలు గ్లామర్‌గా ఉండవు. అవి సృజనాత్మకతని, విలువైన విషయాలు, ప్రపంచం చూడని కథలని ఎత్తి చూపుతాయి. వాటి శక్తిని అర్థం చేసుకోవడం అంటే ప్రజా విధానాన్ని అర్థం చేసుకోవడమే అని నా అభిప్రాయం’ అని చెబుతున్న జోహ్రాన్, తల్లిదండ్రుల సంరక్షణలో క్రియాశీలకమైన భావజాలంతో పెరిగారు. ప్రపంచంలో నెలకొన్న అసమానతలని చిన్నప్పటి నుండి అతను అవగతం చేసుకోవడం మొదలుపెట్టారు. జోహ్రాన్ మాటల్లో చెప్పాలంటే ‘కళ’, ‘క్రియాశీలత’ వేరు కాదని నేర్పించారు’ అంటారు. భారతదేశం, ఇజ్రాయెల్, పాలస్తీనా వంటి ప్రపంచ రాజకీయ అంశాలపై ఆయన వ్యక్తపరచిన అభిప్రాయాలు కొంత వివాదాస్పదంగా మారాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మమ్దాని పాలన శైలి, స్థానిక సమస్యలపై ఆయన ప్రాధాన్యత, రాబోయే కాలంలో ప్రధానంగా గమనించబడనుంది. ఇదిలా ఉండగా, వర్జీనియా రాష్ట్రంలో ఘజాలా హష్మీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికై ఆ రాష్ట్రంలో తొలి ముస్లిం, దక్షిణాసియా మూలాల నాయకురాలిగా చరిత్ర సృష్టించారు. 61 ఏళ్ల డెమొక్రాట్ నాయకురాలు హష్మీ, 54%కు పైగా ఓట్లు సాధించారు. ఆమె తన లెజిస్లేచర్‌గా పనిచేసిన కాలంలో ప్రజా విద్య, ఓటు హక్కులు, ఆరోగ్య సేవలు, పర్యావరణ సంరక్షణ అంశాలపై చురుకుగా పని చేశారు.
అలాగే, ఓహియో రాష్ట్రం సిన్సినాటి నగర మేయర్‌గా అఫ్తాబ్ ప్యూరవాల్ రెండోసారి ఎన్నికయ్యారు. ఆయన 2021లో తొలి ఆసియా మూలాల మేయర్‌గా ఎన్నికై, ఈసారి రిపబ్లికన్ ప్రత్యర్థిని ఓడించి రెండోసారి బాధ్యతలు కొనసాగిస్తున్నారు. ప్యూరవాల్ తల్లి టిబెటన్ శరణార్థి కాగా, తండ్రి పంజాబీ. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, అమెరికన్ నగరాలు, రాష్ట్రాలలో భారతీయ మూలాల నాయకులు ఎదగడం, వలసదారుల కృషి, విద్య, సామాజిక సేవల రంగాలలో వారి బలమైన పాత్రను ప్రతిబింబిస్తోంది. ఈ నాయకుల ఎదుగుదల, అమెరికా రాజకీయ వ్యవస్థ పైనేకాక ప్రపంచ సమగ్రత వైపు సాగుతున్నదనే సంకేతాన్ని ఇస్తున్నది. మమ్దాని న్యూయార్క్ నగర పాలనలో అడుగుపెడుతుండగా, హష్మీ వర్జీనియా రాష్ట్ర రాజకీయాల్లో కీలక బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ప్యూరవాల్ తన రెండో పదవీకాలాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ముగ్గురు నాయకుల పాలనా నిర్ణయాలు రాబోయే సంవత్సరాల్లో మరింత ప్రాధాన్యతను సంతరించుకోనున్నాయి. రాబోయే రోజుల్లో మెరుగైన పౌరసమాజం మూలస్తంభాలైన సామాజిక సమగ్రత, సోషలిజం,ప్రజాస్వామ్యం వైపు ప్రపంచం కదలాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
డా. ముచ్చుకోట సురేష్ బాబు
99899 88912