హైదరాబాద్: మాగంటి గోపినాథ్ మరణాన్ని తాను రాజకీయం చేయదలచుకోలేదని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాగంటి గోపినాథ్ మరణం వివాదాల్లోకి తనను లాగొద్దని కోరారు. గోపినాథ్ మరణంపై ఆయన తల్లి కొన్ని ఆరోపణలు చేశారని.. గోపినాథ్ మరణంపై అనుమానాలు ఉంటే బండి సంజయ్ ఫిర్యాదు చేయాలని అన్నారు. బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే పోలీసులు దర్యాప్తు చేస్తారని పేర్కొన్నారు.
మాగంటి గోపినాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఈ ఉపఎన్నికలో గెలవాలని అన్ని ప్రధాన పార్టీలో కసరత్తు చేస్తున్నాయి. సిఎం రేవంత్ సైతం ఈ ప్రచారంలో పాల్గొన్నారు. రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్ నిర్వహించారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పాలనలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని.. బిఆర్ఎస్, బిజెపి ప్రభుత్వాలు హైదరాబాద్‌కు చేసింది శూన్యమని ఆయన అన్నారు.