జూబ్లీహిల్స్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆస్తులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ కన్నేశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కమార్ వ్యాఖ్యానించారు. గోపీనాథ్‌కు చెందిన ఆస్తి పంపకాల్లో రేవంత్, ట్విట్టర్ టిల్లు మధ్య ఇటీవల గొడవలు వచ్చాయని బండి సంజయ్ కమార్ మరోమారు సంచలన ఆరోపణలు చేశారు. గోపీనాథ్ మరణం మిస్టరీ అని స్వయానా ఆయన తల్లే ఆరోపించిందని చెబుతూ దీనిపై ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్ నేతలెవరూ స్పందించకపోవడానికి కారణం ఇదేనని చెప్పారు. నిజంగా చిత్తుశుద్ధి ఉంటే గోపీనాథ్ మరణంతోపాటు ఆస్తిపాస్తులపై
ముఖ్యమంత్రి సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలు నిగ్గు తేల్చాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్, పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ (ఐఎంసీ) మధ్యే పోటీ ఉందని బండి సంజయ్ పేర్కొన్నారు. హిందువులంతా తమ సత్తా ఏమిటో కాంగ్రెస్‌కు రుచి చూపాలని కోరుతున్నానని అన్నారు. కాంగ్రెస్ గెలిస్తే మజ్లిస్ గెలిచినట్లే అరాచకాలు, అక్రమాలకు తావిచ్చినట్లేనని అన్నారు.
ఫీజు బకాయిలు అడిగితే బ్లాక్ మెయిల్ చేస్తారా?
అసెంబ్లీ సాక్షిగా ప్రతినెల రూ.500 కోట్ల చొప్పున ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు చెల్లిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఇచ్చింది నిజం కాదా? అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు చెల్లిస్తామని టోకెన్లు ఇచ్చి మోసం చేసింది నిజం కాదా?, ఆనాటి నుండి నేటి వరకు ఒక్క రూపాయి కూడా బకాయి చెల్లించకుండా కాలేజీ యాజమాన్యాలను మోసం చేస్తోంది నిజం కాదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అసెంబ్లీ సాక్షిగా ఎందుకు హామీ ఇచ్చినట్లు? అని అడిగారు. చట్టసభలో ఇచ్చిన హామీకే విలువ లేకుంటే ఇక అసెంబ్లీకి విలువ ఏముందని అన్నారు. అసలు ఫీజు రీయంబర్స్ మెంట్ పథకాన్ని కొనసాగిస్తారా? ఎత్తి వేస్తారా? ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.