భారత క్రికెట్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ నుంచి అతడి భార్య హసిన్ జహాన్ తనకు, తన కుమార్తెకు ఇచ్చే నెలవారీ భరణాన్ని పెంచాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో కోర్టు షమీకి, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.తనకు నెలకు రూ. 1.5లక్షలు, కుమార్తెకు రూ. 2.5 లక్షలుగా జీవనోపాధిని నిర్ణయించిన కలకత్తా హైకోర్టు ఉత్తర్వులను జహాన్ సవాలు చేశారు. షమీ సంపాదన, లైఫ్ స్టైల్ దృష్ట్యా ఈ మొత్తం సరిపోదని, భరణాన్ని పెంచాలని ఆమె తన పిటిషన్ లో కోరింది. పిటిషన్ విచారణ సందర్భంగా , నెలకు రూ. 4 లక్షలు ఇప్పటికే చాలా డబ్బు కాదా అని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయినా, షమీ ని, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని
తమ స్పందనను 4 వారాలలోగా తెలియజేయాలని ధర్మాసనం కోరింది. కేసు తదుపరి విచారణ డిసెంబర్ లో జరుగుతుంది.షమీ ఆదాయం, ఆస్తులు ప్రస్తుతం చెప్పుకుంటున్న దానికన్న చాలా ఎక్కువగా ఉన్నాయని జహాన్ తరుపు న్యాయవాది వాదించారు. షమీ చాలా డబ్బు సంపాదిస్తాడు. వందలకోట్ల ఆస్తి, లగ్జరీ కార్లు ఉన్నాయి పదేపదే విదేశాలకు వెళ్తాడు. దుబారాగా జీవిస్తాడు అని ఆయన కోర్టుకు విన్నవించాడు. గృహహింస, వరకట్న వేధింపులు, ఆర్థిక వివాదాల ఆరోపణల నేపథ్యంలో 2018 లో షమీ, జహాన్ మధ్య ప్రారంభమైన న్యాయపోరాటంలో ఈ పరిణామం కొత్త అధ్యాయాన్ని సూచిస్తోంది.