ప్రముఖ గాయని, నటీమణి సులక్షణ పండిట్ (71) గురువారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. శ్వాసతీసుకోవడం ఇబ్బంది కావడంతో ఆమెను గురువారం నానావతి ఆస్పత్రిలో చేర్చిన తరువాత చికిత్స పొందుతూ రాత్రి 7 గంటలకు గుండెపోటు వచ్చి తుది శ్వాస విడిచారని ఆమె సోదరుడు లలిత్ పండిట్ తెలియజేశారు. తొమ్మిదేళ్ళ వయసులోనే పాటలు పాడడం ప్రారంభించిన సులక్షణ పండిట్ సోదరుడు మంధీర్‌తో కలిసి కెరీర్ ప్రారంభించారు. 1975లో సంజీవ్ కుమార్‌తో ఆమె నటించిన ఉల్జా చిత్రం ఘన విజయం సాధించడంతో అనేక అగ్రనటులతో నటించే అవకాశం ఆమెకు వరుసగా కలిగింది. 197080 ప్రాంతంలో సంజీవ్‌కుమార్, రాజేష్ ఖన్నా, వినోద్‌ఖన్నా,
శశికపూర్, జితేంద్ర,శత్రుఘ్న సిన్హా, తదితర అగ్రనాయకులతో ఆమె నటించి పేరు పొందారు. ఆమె కెరీర్‌లో హేరా ఫేరీ, అప్నాపన్, ఖాండాన్, చెహ్రేపేచెహ్రా , ధరమ్‌కాంటా ,వక్త్ కి దీనార్ వంటి సినిమాలు బాగా ప్రేక్షకాదరణ పొందాయి.హిందీతోపాటు బెంగాలీ చిత్రాల్లోనూ ఆమె నటించారు. నటనతోపాటు పలుభాషా చిత్రాల్లో పాటలు కూడా పాడారు. గజల్ గాయనిగా కూడా పేరు పొందారు. కిశోర్ కుమార్, శైలేందర్ సింగ్, జేసుదాస్, మహేంద్ర కపూర్, ఉదిత్ నారాయణ వంటి ప్రముఖ గాయకులతో కలిసి యుగళ గీతాలు ఆలపించారు. చివరిసారి 1996లో ఖామోషీ,అనే సంగీత భరిత చిత్రంలో సాగర్‌కినారే దో దిల్ అనే పాటను పాడారు. ఈ పాటకు ఆమె సోదరులే స్వరపర్చడం విశేషం.