మన తెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ని శ్శబ్ద విప్లవం రాబోతుందని బిఆర్‌ఎస్ పార్టీ అగ్రనేత, మాజీ మంత్రి త న్నీరు హరీష్‌రావు అన్నారు. జూబ్లీహిల్స్ ప్రజల తీర్పుతో రాష్ట్ర భవిష్యత్‌కు దశ దిశ ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఈ అరాచక ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. జూబ్లీహిల్స్ తీర్పు రాష్ట్ర ప్రజలకు మేలు చేకూర్చాలని ప్రజలంతా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. రెండేళ్ల రేవంత్ పాలన అరాచకాలకు జూబ్లీహిల్స్ ప్ర జలు చరమగీతం పాడనున్నారని అన్నారు. కెసిఆర్ పాలనలో వికాసం, రేవంత్ పాలనలో విధ్వంసం అని, జూబ్లీహిల్స్ ఎన్నిక వికాసానికి, వి ధ్వంసానికి మధ్య జరుగుతున్న ఎన్నిక పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌లో ఎ న్నికలు నాలుగు లక్షల మంది భవిష్యత్తు కాదు అని, ఈ ఉప ఎన్నిక నా లుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల భవిష్యత్తు నిర్ణయిస్తుందని స్పష్టం చే శారు. బిఆర్‌ఎస్ హయాంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రూ. 5300 కోట్లతో పనులు చేశామని తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నికలో ప్రజలు ఇచ్చే తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుందని అన్నారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలిస్తే మూడేళ్లపాటు నరకయాతన అనుభవించాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజలు ఆలోచించి ఆత్మసాక్షిగా ఓటు వేయాలని కోరారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో హరీష్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ, సిఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చెప్పుకోవడానికి ఏమీ లేకనే.. జూబ్లీహిల్స్‌లో రేవంత్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. బ్లాక్ మెయిల్ చేసి జూబ్లీహిల్స్‌లో ఓట్లు వేయించుకోవాలని రేవంత్ చూస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేయకుంటే.. రేషన్ కార్డులు ఆగిపోతాయని, పెన్షన్లు రావని అంటున్నారని మండిపడ్డారు. సంక్షేమ పథకాలు రేవంత్ ఇంట్లో నుంచి ఇస్తున్నారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో బెదిరింపులకు తావు లేదని అన్నారు. రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సమాచార హక్కు చట్టం ఉపయోగించి రియల్ ఎస్టేట్ వర్గాలను, వ్యాపారవేత్తలను బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ బెదిరింపులకు ఎవరూ భయపడద్దని, ప్రజలకు బిఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బిఆర్‌ఎస్ ప్రజల గొంతుగా పోరాడుతుందని తెలిపారు. జూబ్లీహిల్స్‌లో ప్రజలు ప్రశ్నించే గొంతును గెలిపించాలని కోకారు. రాష్ట్రంలో రెండే టీమ్‌లు ఉన్నాయని ఒకటి ఆరు గ్యారంటీఉల ఎగ్గొట్టిన టీమ్ అయితే రెండోది ఆరు గ్యారంటీల అమలుపై గల్లా పట్టి అడిగే టీమ్ అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పాలనలో నలుగురు బ్రదర్స్ మాత్రమే హ్యాపీగా ఉన్నారు
రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తిగా లేదని హరీష్‌రావు అన్నారు. కాంగ్రెస్ పాలనలో నాలుగు కోట్ల ప్రజలు కాదు.. నలుగురు బ్రదర్స్ మాత్రమే హ్యాపీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. హామీ ఇచ్చిన గ్యారంటీలు ఎగ్గొట్టిన ప్రభుత్వం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అడుగుతున్న కళాశాలను రేవంత్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్‌ఆర్ ప్రారంభించిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలను కెసిఆర్ కొనసాగించారని గుర్తుచేశారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.19500 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేశామని, కరోనా సమయంలో కూడా నిధులు ఆపలేదని చెప్పారు. రెండేళ్లలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండు రూపాయలు కూడా ఇవ్వలేదని, దాంతో ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం కాలేజీ యాజమాన్యాలు నిరవధిక బంద్‌కు దిగాయని అన్నారు. ఆ కాలేజీల్లో చదువుతున్న పిల్లలు జూబ్లీహిల్స్‌లో కూడా ఉన్నారని చెప్పారు. ఆరోగ్య శ్రీ వైఎస్‌ఆర్ తెచ్చిన పథకం అని గొప్పలు చెప్పడం కాదు..
ఆ పథకం అమలు చేయడం లేదని విమర్శించారు.ఆరోగ్య శ్రీ బకాయిలు అడిగితే ఆసుపత్రులను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. కాలేజీలు, ఆసుపత్రులు బకాయిలు అడిగితే విజిలెన్స్ దాడులు చేయిస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యోగులు డిఎలు, పిఆర్‌సి అడిగితే ఉద్యోగులపై ఎసిబి దాడులు చేస్తున్నారని అన్నారు. దేశంలో అత్యధిక డి.ఎలు పెండింగ్‌లో ఉన్న రాష్ట్రం మన తెలంగాణ అని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు ఇచ్చేందుకు డబ్బులు లేవు కానీ, కమీషన్లు వచ్చే మూసీ అభివృద్ధి పనులుకు, ఫ్యూచర్ సిటీ పనులకు డబ్బులు ఉన్నాయా..? అని ప్రశ్నించారు. హైడ్రా విషయంలో డిప్యూటీ సిఎం భట్టి, సిఎం బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ హరీష్ రావు మండిపడ్డారు. 13 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు చెరువులో ఉన్నాయని, ఆ ప్రాజెక్టులు ఎవరివి అయినా కూల్చివేస్తామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ప్రెస్‌మీట్ చెప్పారని, తర్వాత వాటి గురించి మాట్లాడలేదని ఆరోపించారు. డిప్యూటీ సిఎం ప్రెస్‌మీట్ పెడితే, సిఎం సెటిల్‌మెంట్ చేసుకున్నారని ఆరోపించారు. హైడ్రా పేదల ఇళ్లను కూలగొడుతూ పెద్దల జోలికి మాత్రం వెళ్లడం లేదని అన్నారు.
బిఆర్‌ఎస్ ఒత్తిడితోనే ముస్లింలకు మంత్రి పదవి
కంటోన్మెంట్‌లో కడతామన్న ఆరు వేల డబుల్ బెడ్రూం ఇళ్ళు ఎక్కడ..? అని హరీష్‌రావు సిఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టి కంటోన్మెంట్‌లో గెలిచారని విమర్శించారు. బిఆర్‌ఎస్ ఒత్తిడితోనే ముస్లింలకు మంత్రి పదవి వచ్చిందని, తమ ఒత్తిడితోనే ఎన్‌టిఆర్, పిజెఆర్ విగ్రహాల హామీలు ఇస్తున్నారని పేర్కొన్నారు. రెండేళ్ళుగా అజహారుద్దీన్‌కు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. సినీ యాక్టర్స్‌ను జైల్లో పెట్టిన రేవంత్.. సినీ కార్మికులకు ఒంగి ఒంగి దండాలు పెడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. 2023లో పిజెఆర్ కొడుకుకు ఎందుకు టికెట్ ఇవ్వలేదని అడిగారు. కాంగ్రెస్ అరాచకం, మంత్రి పదవి ఇవ్వకపోవటంతోనే పిజెఆర్ చనిపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
సొంత ప్రభుత్వంపై సిఎంకు పట్టు లేదు
బిఆర్‌ఎస్ నేతలు మర్రి జనార్థన్ రెడ్డి, రవీందర్ రావు ఇంటిపై దాడులను మాజీ మంత్రి హరీష్‌రావు ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్‌ఎస్ నాయకులను బెదిరిస్తోందదని మండిపడ్డారు. కాంగ్రెస్ అరాచకాలపై 20 ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి హోంమంత్రిగా, విద్యామంత్రిగా, మున్సిపల్ మంత్రిగా ఫెయిల్ అయ్యారని, ముఖ్యమంత్రిగా అట్టర్ ఫెయిల్ అయ్యారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిపై రోజుకో కాంగ్రెస్ ఎంఎల్‌ఎ ఉత్తరాలు రాస్తున్నారని ఎద్దేవా చేశారు. సొంత ప్రభుత్వంపై ముఖ్యమంత్రికి పట్టు లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి హయాంలో క్రైం రేటు పెరిగిందని, రాష్ట్రంలో గన్ కల్చర్ వచ్చిందని అన్నారు. డిజిపికి నియామకపత్రం ఇచ్చిన ఏకైన సిఎం రేవంత్‌రెడ్డినే అని విమర్శించారు. రేవంత్‌రెడ్డి సచివాలయంలో సమీక్షలు చేయడం లేదని, కమీషన్ల కోసం కమాండ్ కంట్రోలు సెంటర్‌లో సిఎం సమీక్షలు చేస్తున్నారని ఆరోపించారు.
ముస్లింలకు రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి
కాంగ్రెస్ లేకుంటే.. ముస్లింలు లేరని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం దారుణం అని హరీష్‌రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ఎప్పుడు వచ్చింది..? ముస్లింలు ఎప్పుడు నుంచి ఉన్నారు..? అని నిలదీశారు. ముస్లింలను రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు. ముస్లింలకు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.బిజెపి నుంచి 8 మంది ఎంపీలు గెలిచినా తెలంగాణకు తెచ్చింది గుండు సున్నా అని హరీష్‌రావు విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఒక్కటే అని ఆరోపించారు. ప్రధాని చెప్పిన ఆర్‌ఆర్ టాక్స్‌పై ఎందుకు చర్యలు లేవని ప్రశ్నించారు. కాంగ్రెస్, బిజెపిలు కలిసి బిసిలను మోసం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదన్ తమ్ముడు వెంకట్ యాదవ్‌కు మూడు ఓట్లు ఉన్నాయని, ఈ విషయంపై, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కొత్త ఓట్ల నమోదుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని అన్నారు. రాష్ట్రంలో పోలీసులు కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని, అందుకే జూబ్లీహిల్స్ ఎన్నికలకు కేంద్ర బలగాలను మోహరించాలని తమ ఎంపీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని హరీష్‌రావు తెలిపారు.