కశ్మీర్ గురించి, పాక్ ఆక్రమిత కశ్శీర్ గురించి బిజెపి తరచు కొన్ని ఆలోచనలు వ్యక్తపరుస్తుంటుంది. కశ్మీర్ గురించి అనేవి, ఆ విషయమై మొదటి ప్రధానమంత్రి నెహ్రూ తప్పు చేసారని. పిఒకె గురించి అనేది ఆ ప్రాంతాన్ని ఎప్పటికైనా స్వాధీనపరచుకోగలమని. ఈ రెండు మాటలు కూడా సగటు భారతీయుని దేశభక్తి భావనలకు అనుగుణమైనవి. ఆ విషయం దృష్టిలో ఉంచుకుంటూనే కొన్ని మాటలు చెప్పుకోవటం అవసరం. అవి వాస్తవిక దృష్టితో కూడినవి. ముందుగా పిఒకె సంగతి చూద్ధాము. దేశ విభజన సమయంలో అప్పటి కశ్మీర్ రాజు హరిసింగ్ తన రాజ్యాన్ని భారత యూనియన్‌లో విలీనం చేసేందుకు పలు ప్రయత్నాల తర్వాత అంగీకరించారు. ఆ ప్రక్రియ సాంకేతికంగా పూర్తియింది. కాని వాస్తవ స్థితిని చూసినపుడు, కశ్మీర్‌లో కొంత భాగం పాకిస్థాన్ ఆక్రమణకు గురై ఇప్పటికీ వారి అధీనంలోనే ఉంది. ఈ భాగం, ఆ భాగం అని గాక మొత్తం కశ్మీర్ ప్రశ్నపై రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధాలలో ఏమీ తేలలేదు. భారత సైన్యం తూర్పు పాకిస్థాన్‌ను విడదీసి అక్కడి పాకిస్థాన్ సైన్యాన్ని పెద్ద సంఖ్యలో బందీగా పట్టుకున్నపుడు, పిఒకెను మనకు వదలుకున్నట్లయితేనే ఆ బందీలను వదలగలమనే షరతు విధించవలసిందనే అభిప్రాయం ఒకటుంది. ఎందుకైతేనేమి అది జరగలేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత కాలం, కశ్మీర్ సరిహద్దు వివాద పరిష్కారంపై చర్చలు జరిగాయి గాని, పిఒకెను సైనికంగా స్వాధీన పరచుకోవడమనే అంశం అజెండా పైకి రాలేదు.
బిజెపి, ముఖ్యంగా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ అధికారానికి వచ్చినప్పటి నుంచి పిఒకె స్వాధీనం ప్రస్తావనలు వస్తున్నాయి. ఎప్పటికైనా ఆ పని చేస్తామంటున్నారు. ఆయన నాయకత్వాన గత ప్రధాని వాజపేయికి మించి తీవ్ర జాతీయవాద వైఖరిని అవలంబిస్తున్నందున అటువంటి ప్రస్తావనలు సహజమనాలి. ఆ ధోరణికి అనుగుణంగానే ఆయన ప్రభుత్వం, కశ్మీర్ వివాదమంటూ అసలు ఏమీ లేదని, దానిపై పాకిస్థాన్‌తో చర్చించవలసింది కూడా ఏమీ లేదని, చర్చించటమంటూ ఉంటే వారు పిఒకెను మనకు వశపరచటం గురించి మాత్రమేనని అంటూ వస్తున్నది. అందుకు పొడిగింపుగా మాట్లాడుతూ, మనమే ఒక రోజు ఆ భూభాగాన్ని స్వాధీనపరచుకోగలమని చెప్తున్నది.
దీనంతటిలోని సాంకేతికతలను అట్లుంచితే, ఆచరణకు సంబంధించిన ప్రశ్నలు కొన్నింటిని గమనించవలసి ఉంటుంది. ఆ విధమైన ఆక్రమణ సాధ్యమా అన్నది ఒక ప్రశ్న కాగా, ఒకవేళ ఆక్రమించినా దానిని అధీనంలో ఉంచుకుని నియంత్రించగలరా అన్నది మరొక ప్రశ్న. యుద్ధాలు, ఆక్రమణలు, నియంత్రణలు అనే మూడు కూడా ఆషామాషీ విషయాలు కావు. అందువల్ల ఆవేశంతోగాక జాగ్రత్తగా ఆలోచించవలసి ఉంటుంది. మొదట యుద్ధం మాట చూస్తే, పాకిస్థాన్ కన్న ఇండియా చాలా శక్తివంతమైనదని వేరే చెప్పనక్కరలేదు. కాని ఇరువురికి అణ్వస్త్రాలు ఉండటం విస్మరించలేనిది. పాకిస్థాన్ ‘నూక్లియర్ విధానం’ ప్రకారం, తమ భూభాగానికి, భౌగోళిక సమగ్రతకు ముప్పు ఏర్పడినట్లయితే అణ్వస్త్రాలు ఉపయోగిస్తారు. ఆ పని నిజంగా జరుగుతుందా అనేది వేరే విషయం. కాని, జరగదని కూడా ఎవరూ హామీ ఇవ్వలేరు. ఒకసారి తూర్పు పాకిస్థాన్‌ను కోల్పోయిన తర్వాత, మరొక భూభాగాన్ని పోగొట్టుకునేందుకు సిద్ధపడటం తేలిక కాదు. అందువల్ల, పిఒకెను స్వాధీనపరచుకునే లక్షంతోనే యుద్ధమన్నది తేలిక కాదు. ఆ స్థాయి యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా జోక్యమన్నది సరేసరి.
పిఒకె స్వాధీనం జరుగుతుందని వాదన కోసం ఒప్పుకుంటే, అపుడు నియంత్రణ ప్రశ్న ముందుకు వస్తుంది. స్వాధీనం తక్షణం జరిగేది కాగా, నియంత్రణ దీర్ఘకాలికం. అందులోని సాధకబాధకాలేమిటి? కశ్మీర్ లోయ భూభాగం 15 వేల చదరపు కిలోమీటర్లకు పైగా ఉంది. పిఒకె వైశాల్యం అంతకు రెట్టింపు కన్న ఎక్కువ. జనాభా ఇక్కడ సుమారు కోటీ 80 లక్షల కాగా, అక్కడ దాదాపు 55 లక్షలు. వీరంతా ముస్లింలే. ఇటు వైపు భూభాగం ఏ విధంగానైతే కొండలు, లోయలు, నదులతో సంక్లిష్టమైనదో, అటువైపుది బహుశా అంతకన్న సంక్లిష్టమైనది. ఇటువైపు గలవారికి మన పట్ల ప్రేమ, విధేయత అన్నవి లేవనుకుంటే, వారికీ లేవు. వీరు నిరసనలకు, తీవ్రవాద చర్యలకు పాల్పడుతున్నారనుకుంటే, అటువైపు వారు అందుకు తోడవుతారు. అటువైపు వారికి పాకిస్థాన్ పట్ల కొంత నిరసన ఉండవచ్చు. దాని అర్థ్ధం ఇండియాను ప్రేమిస్తున్నారని కాదు. వీరూవారు కలిస్తే కశ్మీరీ జాతి మొత్తంగా స్వతంత్ర భావనలు బలపడి, రెండు దేశాలతో సంబంధం లేని విధంగా స్వతంత్ర కశ్మీర్ ఆలోచనలు తలెత్తగల అవకాశం ఎంతైనా ఉంటుంది. ఇంత మాత్రమే కాదు.
ఒకసారి మ్యాప్‌ను చూడండి. రెండు కశ్మీర్‌లను ఆనుకుని ఉత్తరాన, పడమరన అఫ్ఘానిస్థాన్‌తోపాటు మధ్య ఆసియా ముస్లిం దేశాలు విస్తరించి ఉన్నాయి. వాటన్నింటా ఇస్లామిస్ట్ తీవ్రవాద సంస్థలున్నాయి. లోగడ ఒక దశలో ఆ సంస్థలు కొన్ని కశ్మీర్‌ను ఇండియా నుంచి విముక్తం చేయగలమని ప్రకటించి అక్కడి సంస్థలకు ఆయుధాలు, నిధులు, శిక్షణలు కూడా ఇచ్చాయి. మధ్య ఆసియాలోని ఇస్లామిస్ట్ తీవ్రవాదం కొన్ని దశాబ్దాలుగా అంతులేకుండా పెచ్చరిల్లుతూనే ఉంది. సమయానుసారంగా ఆ ధోరణులకు ఆ ప్రాంతపు దేశాలలోపాటు, తమ వ్యూహాత్మక క్రీడల కోసం అగ్రరాజ్యాలూ ప్రోత్సాహం ఇస్తూనే ఉన్నాయి. ఈ వివరాలన్నింటిని లెక్కలోకి తీసుకుంటూ ఇపుడు ఆలోచించండి, పిఒకె స్వాధీనం ఒకవేళ సాధ్యం అనుకున్నా, ఎంతవరకు వాంఛనీయం? అందులోని లాభనష్టాలేమిటి? ఇప్పటికే కశ్మీర్‌లో మన బలగాలు కొన్ని లక్షలు మోహరించి ఉన్నట్లు అంచనా. పిఒకె స్వాధీనం తర్వాత మరెన్ని మోహరింపులు అవసరం కావచ్చు? ఎంతకాలం? అట్లయినా పిఒకె శాశ్వతంగా భారతదేశంలో ఉండిపోగలదనే హామీ ఉంటుందా?
రెండవది, కశ్మీర్ విషయమై నెహ్రూ తప్పు చేసారనేది. ఈ మాటను ప్రధాని మోడీ అక్టోబర్ 31న సర్దార్ పటేల్ 150 వ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని ఆయన ‘ఐక్యతా విగ్రహం’ వద్ద ప్రసంగిస్తూ మరో మారు అన్నారు. కశ్మీర్ సంస్థానం మొత్తాన్ని భారత్‌లో విలీనం చేయాలన్నది పటేల్ ఆకాంక్ష కాగా, అందుకు నెహ్రూ అడ్డుపడ్డారని ఆరోపించారు మోడీ. దేశ ప్రజలపై గాంధీజీ, నెహ్రూల ప్రభావం ఇప్పటికీ తగినంత ఉన్నందున, దానిని దెబ్బ తీస్తూపోతే ఆ మేరకు తమ ప్రభావం ఇంకా వ్యాపిస్తుందన్నది సంఘ్ పరివార్, బిజెపిల వ్యూహం. అందుకోసం ఆ ఇరువురిపై రకరకాలగా ఆరోపణలు, విమర్శలు తరచు చేస్తూ వస్తున్నారు. గాంధీజీపై విమర్శల పట్ల వ్యతిరేకత పెరుగుతుండటంలో ఆయనను పక్కన ఉంచి, నెహ్రూపై ఆరోపణలు పెంచుతున్నారు. గాంధీజీ, నెహ్రూలు విమర్శలకు అతీతులని కాదు. కాని ఆరోపణలు, విమర్శలు ఎవరు ఎవరిపై చేసినా అందుకు ఆధారాలుండాలి. ఆ విధంగా చూసినపుడు కశ్మీర్ విషయమై నెహ్రూ, పటేల్ పాత్రలు తెలుపు, నలుపు పద్ధతిలో గిరిగీసినట్లేమీ లేవు. పటేల్ జీవిత చరిత్రను, రికార్డులు, వ్యక్తిగత లేఖలు, ఇంటర్వూల ఆధారంగా అతి సమగ్రంగా రచించిన వాడు, గాంధీజీ మనుమడైన రాజ్‌మోహన్ గాంధీ. ఆయన తను పేర్కొన్న ప్రతి అంశానికి ఆధారాలను ఉదహరించారు. వాటిని గమనించినపుడు ప్రధాని మోడీ వాదనలు పరిశీలనకు నిలవవు. కేవలం నెహ్రూను కించపరచి, దేశ ప్రజల దృష్టిలో తన విలువను తగ్గించి, బిజెపి భావజాలానికి అనుకూలుడని తాము భావించే పటేల్‌ను పైకెత్తటం కోసం ఆ విధంగా మాట్లాడుతున్నట్లు అర్థమవుతుంది. కశ్మీర్ తోపాటు గల దేశ విభజన విషయంలోనూ నెహ్రూ, పటేల్ వైఖరుల గురించి వారు ఇదే విధంగా ప్రచారాలు చేస్తున్నారు.
ఉదాహరణకు పటేల వ్యక్తిగత కార్యదర్శి, సన్నిహిత సలహాదారు అయిన వి. పి. మెనన్ రాసిన ‘ద ట్రాన్స్‌ఫర్ ఆఫ్ పవర్ ఇన్ ఇండియా’, వి. శంకర్ రచన ‘మై రెమిని సెన్సెస్ ఆఫ్ సర్దార్ పటేల్’ వంటి గ్రంథాలను చదివితే కశ్మీర్‌పట్ల ఎవరి వైఖరి ఏమైనదీ స్పష్టమవుతుంది. ముస్లింలు ఆధిక్యతలో గల కశ్మీర్ విషయమై పటేల్ ఆసక్తి చూపకపోవటం దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం లభించిన తర్వాత కూడా 1947 సెప్టెంబర్ 13 వరకు కొనసాగింది. ఆయన ఆ రోజు రక్షణ మంత్రి బల్ దేవ్ సింగ్‌కు లేఖ రాస్తూ, “ఒకవేళ (కశ్మీర్) వేరే డొమినియన్ (పాకిస్థాన్ అని భావం) లో చేరదలచుకుంటే” ఆ వాస్తవిక స్థితిని తాను గుర్తించగలనని చెప్పారు. తర్వాత అదే రోజు మధ్యాహ్నం, జునాగఢ్ విలీనాన్ని పాకిస్థాన్ అంగీకరించిన తర్వాతనే పటేల్ వైఖరి మారింది. జునాగఢ్ సంస్థాన పాలకుడు ముస్లిం, అక్కడి ప్రజలు మెజారిటీ హిందువులు. అటువంటి సంస్థానం పాకిస్థాన్‌లో విలీనమైనపుడు, హిందూ పాలకుడు, మెజారిటీ ప్రజలు ముస్లింలు అయిన కశ్మీర్‌ను ఇండియాలో ఎందుకు విలీనం చేసుకోరాదన్న నిర్ణయాన్ని పటేల్ అపుడు మాత్రమే తీసుకున్నారు. ఇందుకు భిన్నంగా, తమ పూర్వీకుల జన్మభూమి అయిన ఆ సుందర దేశాన్ని వదలుకోవటం నెహ్రూకు ఎప్పుడూ ఆమోదయోగ్యం కాలేదు. తన మిత్రుడైన షేక్ అబ్దుల్లా తోడ్పాటుతో కశ్మీర్ విలీనానికే నిరంతరం ప్రయత్నించారు. అందువల్ల, ఇటువంటి పలు పరిణామాలను విస్మరిస్తూ ప్రస్తుత రాజుకీయాల కోసం చరిత్రను వక్రీకరించటం తగిన పనికాదు.
టంకశాల అశోక్