కోల్‌కతా: సైబర్ నేరగాళ్లకు చిక్కితే.. సామాన్యుడైనా.. పెద్ద సెలబ్రిటీ అయినా బలి కావాల్సిందే. తాజాగా ఓ ఎంపి విషయంలో ఇది అక్షరాల నిజమైంది. ఓ ఎంపిని బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు ఏకంగా అతడి బ్యాంకు ఖాతా నుంచి రూ.56 లక్షలు కాజేశారు. నకిలీ కెవైసితో వాళ్లు ఈ నేరానికి పాల్పడ్డారు .
తృణమూల్ కాంగ్రెస్ నేత, పార్లమెంట్ సభ్యులు కల్యాణ్ బెనర్జీకి పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉంది. ఈ బ్యాంక్ బ్రాంచ్ ఖాతా నుంచి సైబర్ కేటుగాళ్లు డబ్బు దోచేశారు. దీనిపై బ్యాంకులో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. బెనర్జీ ఖాతాను సంబంధించిన కెవైసిని అప్‌డేట్ చేయడానికి నకిలీ ఆధార్, పాన్ కార్డులను ఉపయోగించారు.
ఖాతాలకు లింక్ అయిన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్లను మార్చారు. ఈ వివరాలన్నీ మారిన తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పలు మార్లు లావాదేవీలు నిర్వహించారు. మొత్తంగా రూ.56 లక్షలు కాజేశారు. వాటిని వేర్వేరు ఖాతాల్లోకి బదిలీ చేసి బంగారం కొనుగోలు చేసినట్లు సమాచారం. కొంత మొత్తాన్ని ఎటిఎం ద్వారా విత్‌డ్రా చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఎంపి బ్యాంకు అధికారులను అప్రమత్తం చేయడంతో వాళ్లు సైబర్ క్రైమ్ కింద ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతోందని కోల్‌కతా సైబర్ క్రైమ్‌కు చెందిన ఉన్నతాధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు.