భాగల్‌పూర్/అరారియా: ఓటు బ్యాంకు రాజకీయాలతో బీహార్‌లో ఆర్‌జేడీ, కాంగ్రెస్ ఉమ్మడి భాగస్వాములు చొరబాటుదారులపై సుముఖత, పరమాత్ముడు రామునిపైన, ఛఠీమైయా (సూర్యభగవానుని సోదరి)పైన వ్యతిరేకత చూపిస్తున్నారని ప్రధాని నరేంద్రమోడీ గురువారం బీహార్ ఎన్నికల ర్యాలీల్లో ధ్వజమెత్తారు. భాగల్‌పూర్, అరారియా జిల్లాల్లో నిర్వహించిన ర్యాలీల్లో ప్రసంగిస్తూ అయోధ్య లోని నిషధరాజ్, మాతాశబరి, మహర్షివాల్మీకి వంటి దర్శనీయమైన క్షేత్రాలను సందర్శించడానికి విపక్ష నాయకులు విముఖత చూపిస్తుంటారని ఆరోపించారు. గతంలో 15 ఏళ్ల ‘జంగిల్‌రాజ్ ’ పాలనలో అభివృద్ధి సున్నాయని, ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ నేతృత్వం లోని ఎన్‌డిఎ ప్రభుత్వం లోనే రాష్ట్రంలో అనేక ఎక్స్‌ప్రెస్‌వేలు, బ్రిడ్జిలు, నాలుగు సెంట్రల్ యూనివర్శిటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయని ఉదహరించారు.
ఓటు చోరీ జరిగిందన్న ఆరోపణలతో రాహుల్ సాగించిన ఓటర్ అధికార యాత్రను పరోక్షంగా ప్రస్తావిస్తూ తప్పుడు కథనాలతో రాజకీయ యాత్రలు సాగించారని విమర్శించారు. 1984లో సిక్కు వ్యతిరేక హింస మాదిరిగా 1989లో భాగల్పూర్‌లో మత ఘర్షణలు కాంగ్రెస్ రెచ్చగొట్టిందని, కుల హింసను ఆర్‌జేడీ ప్రేరేపించిందని ఆరోపించారు. ఆర్‌జేడీ పోస్టర్లపై కాంగ్రెస్ తన నామ్‌దార్ (రాహుల్) చిత్రం లేదన్న ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. ఎన్నికలు పూర్తయ్యాక ఇండియా కూటమిలోని వారంతా కుమ్ములాడుకుంటారని వ్యాఖ్యానించారు.