న్యూయార్క్ : అమెరికా ప్రెసిడెంట్ గా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత నేడు ఎదురు దెబ్బ తిన్నారు. షాక్ కు గురయ్యారు. భారతీయ సంతతికి చెందిన ముగ్గురు ముస్లిం డెమోక్రాట్లు జోహ్రాన్ మమ్దానీ, అఫ్తాబ్ పురేవాల్, గజాలా హష్మి ఆయనకు తొలి రాజకీయ ఓటమిని చవిచూపారు. రాజకీయ కాక పుట్టించి, న్యూయార్క్ నగరం, సిన్సినాటి, వర్జీనియాలో అధికవోట్లను అగ్రశ్రేణి డెమోక్రాట్లు – జోహ్రాన్ మమ్దానీ, అఫ్తాబ్ పురేవాల్, గజాలా హష్మి గెలుచుకున్నారు. న్యూయార్క్ నగర మేయర్ గా ఎన్నికైన జోహ్రాన్ మమ్దానీ భారతీయ – అమెరికన్ తల్లి మీరా నాయర్ దంపతుల బిడ్డ. కాగా వర్జీనియా లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా ఎన్నికైన గజాలా హష్మీ భారతదేశంలో మన హైదరాబాద్ నగరంలోని మలకపేట కు చెందిన వారు కావడం విశేషం. ఇక అఫ్తాబ్ పురేవాల్ తండ్రి పంజాబీ, తల్లి టిబెటన్ కు చెందిన వారు. జోహ్రాన్ మమ్దానీ తల్లి మీరా నాయర్ భారతీయ ప్రముఖ చిత్ర నిర్మాత, అతని తండ్రి మహ్మద్ మమ్దానీ పూర్వీకులు గుజరాత్ కు చెందిన వారే.
మహ్మద్ మమ్దానీ ప్రముఖ రచయిత, కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆంత్రోపాలజీ ప్రొఫెసర్. న్యూయార్క్ నగర మేయర్ గా ఎన్నికైన తొలి ముస్లిం గా, భారతీయ సంతతి వ్యక్తిగా జోహ్రాన్ కొత్త రికార్డు సృష్టించారు.అమెరికా అధ్యక్ష ఎన్నికలతో సహా పలు ఎన్నికల్లో డెమోక్రాట్స్ కు వరుసగా ఓటమి ఎదుర్కొంటున్న సమయంలో ఈ విజయాలు కొత్త జీవం పోశాయి. ప్రెసిడెంట్ ట్రంప్ ఈ ఎన్నికల రేస్ లో వ్యక్తిగతంగా లేకపోయినా, ఆయన ప్రభావం, నిర్ణయాలు తీవ్ర ప్రభావాన్ని చూపాయి. న్యూయార్క్ లో జహ్రానీ మమ్దానీ చేతిలో ఓడిపోయిన ఇండి పెండెంట్ అభ్యర్థి ఆండ్రూ క్యూమోను ప్రెసిడెంట్ ట్రంప్ సమర్థించారు. ఆయన న్యూయార్క్ మాజీ గవర్నర్ కూడా. ఒక దశలో ట్రంప్ మమ్దానీ మేయర్ గా గెలిస్తే, ఫెడరల్ నిధులను నిలిపివేస్తామని బెదిరించారు కూడా. ఇక వర్జీనియాలో 61 ఏళ్ల గజాలా హష్మి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎన్నికల్లో గెలిచి మరో చరిత్ర సృష్టించారు. ఆ పదవికి ఎన్నికైన భారతీయ -అమెరికన్, మొదటి ముస్లిం మహిళ కూడా. హష్మి రిపబ్లికన్ పార్టీకి చెందిన జాన్ రీడ్ పై విజయం సాధించారు.
సిన్సినాటి మేయర్ గా ఎన్నికైన అఫ్తాబ్ పూరేవాలా ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రత్యర్థి కోరీ బౌమాన్ ను ఓడించి రెండోసారి ఆ పదవి చేపట్టారు. కోరీ బౌమాన్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్ సవతి సోదరుడు. ట్రంప్ సన్నిహితుడు. ఈ ఎన్నికలు ట్రంప్ పనితీరు పట్ల మెజారిటీ ఓటర్ల అసంతృప్తికి అద్దం పడుతున్నాయి. వర్జీనియా తో సహా చాలా స్టేట్ లలో సగం కంటే ఎక్కువమంది ఓటర్లు తమ ఓటుతో ట్రంబ్ కు ఘాటైన మెసేజ్ పంపారని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ దుందుడుకు నిర్ణయాలు, సుంకాలు వలస విధానాలను ఓటర్లు తిరస్కరిస్తున్నట్లు కన్పిస్తోందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. భారతీయ మూలాలు ఉన్న ముగ్గురు ముస్లిం అభ్యర్థులు ముఖ్యంగా డెమోక్రాట్లు రిపబ్లికన్ పార్టీ జోరుకు బ్రేక్ వేశారు. ఇది 2026 మధ్యంతర, 2028 ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ఆధిక్యానికి ఏ విధంగా దెబ్బకొడుతుందో చూడాలి..
జోహ్రాన్ మమ్దానీ
జనవరి 1న న్యూయార్క్ మేయర్ పదవీ బాధ్యతలు చేపట్టనున్న జోహ్రాన్ మమ్దానీ తల్లిదండ్రులు భారతదేశంలో మూలాలు కలిగిన వారు. మమ్దానీ ఉగాండాలోని కంపాలా లో జన్మించారు.ఆయన బాల్యం దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ లో సాగినా, 7 ఏళ్ల వయస్సులో న్యూయార్క్ నగరానికి చేరారు.
కాలేజీలో గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారు 2018 లో అమెరికన్ పౌరసత్వం పొందారు. మమ్దానీ భార్య రామా దువాజీ సిరియన్ – అమెరికన్ కళాకారిణి, ఈ ఏడాదే వారి వివాహం జరిగింది. న్యూయార్క్ లోని క్వీన్స్ లో కలిసి ఉంటున్నారు. 34 ఏళ్ల మమ్దానీ స్టేట్ అసెంబ్లీ సభ్యుడు డెమోక్రటిక్ సోషలిస్ట్. జూన్ లో డెమోక్రటిక్ ప్రైమరీలో ఆండ్రూ క్యూమోను ఓడించారు.
గజాలా హష్మీ హైదరాబాదీయే
గజాలా హష్మీ 1964లో హైదరాబాద్‌లో జన్మించారు. బాల్యంలో పాతబస్తీ ప్రాంతంలోని మలక్‌పేటలో తన అమ్మమ్మ ఇంట్లో కొంతకాలం నివసించారు. ఆమె తాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో పని చేశారు. నాలుగేళ్ల వయసులోనే తన తల్లి, సోదరుడితో కలిసి గజాలా హష్మీ అమెరికాలోని జార్జియాకు వెళ్లారు. అనంతరం అక్కడే స్థిరపడ్డారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో పీహెచ్‌డీ పూర్తి చేసిన ఆమె తండ్రి ప్రసిద్ధ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పని చేసేవారు. చదువుల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తూ అనేక స్కాలర్‌షిప్పులు, ప్రోత్సాహకాలు అందుకున్న గజాలా, జార్జియా సదరన్ యూనివర్సిటీలో బీఏ ఆనర్స్ కోర్సు చదివారు. గజాలా హష్మి వర్జీనియాకు తొలి ఇండియన్ – అమెరికన్, ముస్లిం లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎన్నికయ్యారు. ఆమె రిచ్మండ్ కు చెందిన రిపబ్లికన్ జాన్ రీడ్ ను ఓడించారు. హష్మి ప్రస్తుతం స్టేట్ సెనెటర్. సౌత్ రిచ్మండ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిని ఓడించి వర్జీనియా రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తిగా ఎదిగారు. హష్మి 4 ఏళ్ల వయస్సులో తన కుటుంబంతో సహా భారతదేశం నుంచి అమెరికాకు చేరారు. ఆమె జార్జియా సదరన్ యూనివర్సిటీ నుంచి ఇంగ్లీష్ బిఏ, ఎమోరీ యూనివర్సిటీ నుంచి పిహెచ్ డి పట్టా పొందారు.
అఫ్తాబ్ పురేవాల్
భారతీయ సంతతికి చెందిన సిన్సినాటి మేయర్ అఫ్తాబ్ పురేవాల్ (43) గతంలో 2021లో నగరానికి తొలిసారి ఆసియా – అమెరికన్ మేయర్ గా ఎన్నికయ్యారు. ఇప్పుడు రెండో సారి మేయర్ గా ఎన్నికయ్యారు. పురేవాల్ తల్లిదండ్రులు ఒహియోకు వలస వచ్చిన వారు. ఆయన తండ్రి పంజాబ్ కు చెందిన వారు. పురేవాల్ కు చిన్ననాటి నుంచి రాజకీయాలంటే మక్కువ . విద్యార్థి దశలోనే నాయకుడిగా ఎదిగారు.
సిన్సినాటి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా నుంచి పట్టాపొందిన పురేవాల్ 2008 లో వాషింగ్టన్ డిసి కి చేరుకుని అక్కడ ఓలా సంస్థలో పనిచేశారు. తర్వాత అమెరికా న్యాయశాఖలో అటార్ని ప్రత్యేక అసిస్టెంట్ గా పని చేశారు. 2016లో రాజకీయ కెరీర్ ప్రారంభించారు.
మాజీ ప్రెసిడెంట్ ఒబామా శుభాకాంక్షలు
అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా డెమోక్రటిక్ విజేతలకు అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. వారి విజయం భవిష్యత్ లో డెమోక్రటిక్ పార్టీ విజయాలకు నాంది కాగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
హష్మీకి సీఎం రేవంత్, కెటిఆర్ అభినందనలు
వర్జీనియా గవర్నర్‌గా హైదరాబాదీ గజాలా హష్మీ – ఎన్నిక కావడం పట్ల సీఎం రేవంత్ అభినందనలు తెలిపారు. ఆమె తొలి ముస్లిం మహిళగా రికార్డు పొందారని, అమెరికాలో గవర్నర్‌గా ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా హష్మీ రికార్డు సొంతం చేసుకున్నారని చెప్పారు. –
అమెరికా స్థానిక ఎన్నికల్లో భారత సంతతికి చెందిన పలువురు నేతలు సత్తా చాటారని, అందులో భాగంగా వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా డెమోక్రాట్ నాయకురాలు గజాలా హష్మీ ఘన విజయం సాధించారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామరావు పేర్కొన్నారు.