పూర్నియా (బీహార్): బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తనబలం ఉపయోగించి ఓట్ల చోరీకి బీజేపీ ప్రయత్నిస్తోందని, దీనికి వ్యతిరేకంగా పోరాడ వలసిన బాధ్యత యువకులదేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలియజేశారు. గురువారం ఇక్కడ ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ప్రతి ఎన్నికల్లోనూ ఓట్లు చోరీ చేసి బిజేపి గెలుస్తోందని, హర్యానా ఎన్నికల్లో బీజేపీ, ఎన్నికల కమిషన్ కలిసి ఓట్లు చోరీ చేశారని యావత్ ప్రపంచానికి తాము చూపించామని, అదే విధంగా బీహార్ లోనూ జరుగుతుందన్నారు. దీన్ని అడ్డుకునే బాధ్యత యువతదేనని, రాజ్యాంగాన్ని రక్షించాలని సూచించారు.
పోలింగ్ కేంద్రాల్లో జాగ్రత్తగా గమనించాలని యువతకు సూచించారు. యువత నిరుద్యోగంతో అల్లాడుతుంటే కోటీశ్వరుల పాలనను ప్రధాని మోడీ కోరుకుంటున్నారని విమర్శించారు. అరారియాలో జరిగిన మరో ర్యాలీలో మాట్లాడుతూ మోడీ, అమిత్‌షా దేశంలో జంగిల్‌రాజ్‌ను అమలు చేస్తున్నారని, దీనికి ఇడి, సిబిఐ, ఐటి దాడులే ఉదాహరణగా చెప్పారు. కులం, మతం ఆధారంగా మోడీ ప్రజల్లో చీలిక తెస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై విమర్శలు గుప్పిస్తూ రాష్ట్రం లోని యువకులను లేబర్‌గా మారుస్తున్నారన్నారు.