నవ దళపతి సుధీర్ బాబు, బాలీవుడ్ పవర్‌హౌస్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర. అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించే ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అర్ణు అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్‌హల్, నిఖిల్ నందా నిర్మించారు. ఈ చిత్రంలో శిల్పా శిరోధ్కర్ కీలక పాత్ర పోషించారు. జటాధర నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.
ఈ సందర్భంగా హీరో సుధీర్ బాబు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “చిన్నప్పుడు మనం జానపద, చందమామ కథలు వినుంటాం. ‘బ్యాంకులు లేని సమయంలో ధనాన్ని భూమిలో పాతి ఒక బంధనం వేసి దానికి ఒక పిశాచి కాపలాగా ఉంటుంది’ అని ప్రచారంలో ఒక కథ ఉండేది. ఈ కథకు అలాంటి ఒక జానపదం ఆధారం. అలాంటి కథని ఈ కాలంలోకి వచ్చి తీసుకొచ్చి చాలా ఆసక్తికరంగా ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాలో -దెయ్యం, కుటుంబ భావోద్వేగాలు, ఆధ్యాత్మికత, శివుడు గురించి కథలు… ఇలా చాలా లేయర్స్ వున్నాయి. అరుణాచల ప్రస్తావన కూడా వుంది. యాక్షన్, ఫ్యామిలీ, మైథలాజి… అన్ని ఎమోషన్స్ కుదిరిన సినిమా ఇది. -ఈ సినిమాలో ఘోస్ట్ హంటర్‌గా కనిపిస్తా. అయితే తనకి దెయ్యాలు ఉన్నాయంటే నమ్మకం వుండదు. దేవునిపై నమ్మకం వుంటుంది. సైన్స్ ని నమ్ముతాను. అలా ఎందుకనేది సినిమాలో చాలా ఆసక్తికరంగా వుంటుంది. బిగ్ స్క్రీన్ పై చూడదగ్గ సినిమా ఇది. సోనాక్షి చాలా అద్భుతమైన నటి. సినిమాలో ధనపిశాచి పాత్రలో తన నటన అందరినీ ఆకట్టుకుంటుంది. -శిల్పా శిరోద్కర్ శోభ అనే పాత్రలో కనిపిస్తారు. అద్భుతంగా నటించారు. ఇక నెక్స్ రాహుల్ రవీంద్రన్ తో ఒక సినిమా వుంది. ఇప్పుటి వరకు అలాంటి కాన్సెప్ట్ వరల్డ్ సినిమాల్లో రాలేదు. కాన్సెప్ట్ పరంగా అది ఒక బాహుబలి లాంటి సినిమా. అలాగే పుల్లెల గోపీచంద్ బయోపిక్ కూడా చేయాలి” అని అన్నారు.