సామాజిక, మానవ అభివృద్ధిలో రికార్డు సాధిస్తున్న ‘దేవభూమి’ కేరళ, తీవ్రమైన పేదరికం నుంచి విముక్తి పొందినట్టు 69వ రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబరు 1న రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించడం దేశానికే ఆదర్శాన్ని చాటుతోంది. తమ ప్రభుత్వం పేదరిక నిర్మూలనకు రూ. 1000 కోట్లకుపైగా ఖర్చు చేసినట్టు వెల్లడించారు. ఇదే సాఫల్యమైన కేరళ అసలు స్టోరీగా అభివర్ణించారు. అనేక రంగాల్లో కేరళ అభివృద్ధి సాధించడం ద్వారా ‘కేరళ మోడల్’ అన్న పేరు బాగా ప్రసిద్ధి చెందిందన్నది అందరికీ తెలుసు. ఇప్పుడు తీవ్ర పేదరిక రహిత రాష్ట్రంగా కేరళ చరిత్ర సృష్టించింది. పినరయి విజయన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మదాం నియోజకవర్గం ఇప్పటికే దేశం లో, పేదరిక రహిత నియోజకవర్గంగా ప్రకటించబడడం గమనార్హం. పేదరిక కుటుంబాలను గుర్తించడంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. వివిధ ఏజెన్సీల సహకారంతో ప్రణాళిక రూపొందించింది. స్థానిక స్వపరిపాలన శాఖ నేతృత్వంలో సామాజిక భాగస్వామ్యానికి ప్రణాళికలో చోటు కల్పించింది.
2021 మేలో రాష్ట్ర ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం అత్యంత పేదరిక నిర్మూలన కార్యక్రమం (ఎక్స్‌ట్రీమ్ పోవెర్టీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ ఇపిఇపి) ప్రారంభించింది. ప్రపంచ బ్యాంకు ఇటీవల సవరించిన అంతర్జాతీయ దారిద్య్రరేఖ ప్రకారం రోజుకు మూడు అమెరికన్ డాలర్ల కంటే తక్కువ ఖర్చుతో జీవించే వ్యక్తులను తీవ్ర పేదరికంతో ఉన్నట్టు పరిగణిస్తారు. ఈ లెక్కన కేరళ ప్రభుత్వం ప్రజా కేంద్రీకృత అభివృద్ధి, వికేంద్రీకృత ప్రణాళికతో పేదరికాన్ని తగ్గించగలిగింది. 1973 74లో 59.8% వరకు ఉన్న పేదరికం 201112 నాటికి 11.3 శాతానికి తగ్గింది. నీతి ఆయోగ్ నేషనల్ మల్టీ డైమెన్షనల్ పోవెర్టీ ఇండెక్స్ 2023లో దేశం మొత్తం మీద అతి తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రంగా సూచించింది. కేరళ జనాభాలో కేవలం 0.55 శాతం మంది మాత్రమే బహుముఖ పేదరికంలో ఉన్నారని స్పష్టం చేసింది. ఇది జాతీయ తలసరి పేదరికం 14.96% కన్నా చాలా తక్కువ. కేరళ రాష్ట్ర ప్రభుత్వం పేద కుటుంబాలను గుర్తించడంలో పూర్తిగా స్వీయ నమోదుపై ఆధారపడకుండా ప్రత్యేకంగా దాదాపు 4 లక్షల ఎన్యూమరేటర్లను నియమించింది. వీరికి స్థానిక పాలనా సంస్థలతోపాటు కుడుంబశ్రీ వర్కర్ల సహాయం కూడా అందించింది.
అనేక స్థాయిల్లో మధింపు జరిగిన తరువాత 64,006 అతి పేద కుటుంబాలకు చెందిన 1,03,099 మంది పేదలను గుర్తించింది. వీరిలో చాలా మందికి కనీస ధ్రువీకరణ పత్రాలు లేవు. నాలుగు అంశాల ఆధారంగా వీరి పేదరికాన్ని గుర్తించారు. వారు తింటున్న ఆహారం, ఆరోగ్య ప్రమాణాలు, ఉండడానికి ఇల్లు ఉందా లేదా, వారి చదువు తదితర వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ కుటుంబాల్లో చాలా మందికి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు కూడా లేవు. 21,263 కుటుంబాలకు రేషన్ కార్డులు ఇచ్చి రేషన్ అందేలా చేశారు. 4000 కుటుంబాలకు 5422 ఇళ్లు కట్టించి ఇచ్చారు. మరో 5522 ఇళ్లను తిరిగి నిర్మించారు. 1500 కుటుంబాలకు సాగుభూమి అందించారు. శిథిల స్థితిలో ఉన్న ఇళ్లల్లో నివాసం ఉంటున్న కుటుంబాలకు ఇళ్ల మరమ్మతుల కోసం రూ. 2 లక్షల వంతున సహాయం అందించారు. పేదరికం నుంచి ఒకసారి విముక్తి కల్పించడమంటే అన్ని సమస్యలు వారికి వెంటనే పరిష్కారమైనట్టు కాదు. పేదరికాన్ని ఎదుర్కోవడం ఎప్పటికీ అంతం కాని పని. రాష్ట్రప్రభుత్వం తీవ్ర పేదరిక నిర్మూలన ఆదర్శనీయమైన పద్ధతిలో కొనసాగించడంలో అసలు ఉద్దేశం కటిక పేదరికం మళ్లీ ఏర్పడకూడదని, కొత్తగా ఏ కుటుంబం పేదరికంలో పడకూడదని.. పేదరికం ఏ రూపంలో ఉన్నా నిర్మూలించడానికే ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం కట్టుబడి ఉంది.
విద్య, ఆరోగ్య రంగాల్లోనూ స్థానిక ప్రభుత్వాలు గట్టిగా కృషి చేస్తున్నాయి. 2025 నాటికి కేరళలో అక్షరాస్యత 96 శాతం చేరుకుంది. ఆరోగ్య భద్రత విషయాన్ని పరిశీలిస్తే రాష్ట్రంలో 5415 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. మహిళల ప్రసూతి సమయంలో శిశుమరణాల సంఖ్య జాతీయ స్థాయిలో ప్రతివెయ్యి కాన్పులకి 28 వరకు ఉండగా, కేరళలో వెయ్యి కాన్పులకు 5 మాత్రమే ఉండటం గమనార్హం. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలతో పోలిస్తే కేరళలో భారీ పరిశ్రమలు అంటూ లేవు. అయినా మానవాభివృద్ధి, సుస్థిరాభివృద్ధి సూచికల్లో అగ్రగామిగానే కేరళ ఉంటోంది. పేదరిక నిర్మూలన నిరంతర కార్యక్రమమని, 2026 మార్చి నాటికి పేదరికం 0.002 శాతానికి చేరేలా ప్రయత్నిస్తామని రాష్ట్ర ప్రభుత్వం లక్షంగా పెట్టుకుంది.
అయితే కేరళ నమూనాను విమర్శించేవారు కూడా ఉన్నారు. అభివృద్ధి విషయంలో స్తబ్ధత నెలకొందని, నిరుద్యోగం పెరుగుతోందని ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలకు సాక్షాలన్న విమర్శలు వస్తున్నాయి. పేదరిక నిర్మూలన గణాంకాలు ఉత్త బోగస్ అని కాంగ్రెస్ నేతృత్వం లోని విపక్షం ఆక్షేపిస్తోంది. ఈ విమర్శలను సవాలుగా తీసుకొని ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను, సాంకేతిక హరిత ఆధారిత పరిశ్రమలను నెలకొల్పడాన్ని ప్రభుత్వం వేగవంతం చేసింది. నిరుద్యోగాన్ని తొలగించడానికి విద్యావంతులకు నైపుణ్యాభివృద్ధిని చేపట్టింది. దేనికీ రాజీపడని ప్రగతిశీల పరిపాలన సంక్షేమాన్ని, అభివృద్ధిని ఈ రెండిటినీ సమతుల్యం చేసుకోగలదని ‘ఇపిఇపి’ నిరూపిస్తోంది. సమాజం నడిపించే ఈ నమూనా అట్టడుగు స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. కేరళ స్టోరీ దేశం మొత్తంమీద ఆదర్శవంతమే కాక, విస్తృతంగా అనుసరించేలా ప్రచారం చేయదగిందనే చెప్పవచ్చు.