క్వీన్స్‌లాండ్: ఆస్ట్రేలియాతో గురువారం జరిగే కీలకమైన నాలుగో టి20లో టీమిండియా 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసినటీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లు జట్టుకు శుభారంభం అందించారు. ధాటిగా ఆడిన అభిషేక్ 21 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 28 పరుగులు చేశాడు.
కీలక ఇన్నింగ్స్ ఆడిన గిల్ 39 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 46 పరుగులు చేసి ఔటయ్యాడు. వన్‌డౌన్‌లో శివమ్ దూబె (22), కెప్టెన్ సూర్యకుమార్ (20) నిరాశ పరిచారు. తెలుగు కుర్రాడు తిలక్‌వర్మ (5), వికెట్ కీపర్ జితేశ్ శఱ్మ (3) కూడా విఫలమయ్యారు. వాషింగ్టన్ సుందర్ (12) పరుగులు చేయగా, అర్ష్‌దీప్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ధాటిగా ఆడిన అక్షర్ పటేల్ 11 బంతుల్లోనే 21 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్, జంపా మూడేసి వికెట్లను పడగొట్టారు.
శుభారంభం లభించినా..
తర్వాత లక్షఛేదనకు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు మాథ్యూ షార్ట్, మిఛెల్ మార్ష్‌లు శుభారంభం అందించారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. అయితే రెండు ఫోర్లు, 2 సిక్సర్లతో 25 పరుగులు చేసిన షార్ట్‌ను అక్షర్ వెనక్కి పంపాడు. కొద్ది సేపటికే జోష్ ఇంగ్లిస్ (12) కూడా ఔటయ్యాడు. ఆ వెంటనే కెప్టెన్ మార్ష్ (20) కూడా వెనుదిరిగాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా వరుస క్రమంలో వికెట్లను కోల్పోయింది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు, అక్షర్ పటేల్, శివమ్ దూబె రెండేసి వికెట్లను పడగొట్టారు.