మన తెలంగాణ/అమీన్‌పూర్: క్రూర జం తువులే కాదు.. చిట్టి చీమలు కూడా మనిషి మరణానికి కారణం అవుతున్నాయి. ఇది వినడానికి విడ్డూరంగా ఉన్నా.. ఇది ముమ్మాటికి నిజం. అందుకు అమీన్‌పూర్‌లో జరిగిన ఘటనే ఉదాహరణ. బంగారం లాంటి బిడ్డ కంటికి రెప్పలా కాపాడుకునే భర్త జీవితానికి కావలసిన సదుపాయాలతో నిండు నూరేళ్లు సంతోషంగా గడపాల్సిన ఓ మహిళ కేవలం చీమల బెడద తట్టుకోలేక జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకుంది. ఈ అనూహ్య ఘటన అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి సిఐ నరేష్ తెలిపిన వివరా ప్రకారం ఇలా ఉన్నాయి.. అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో నవ్య కాలనీలో నివాసముంటున్న మనీషా (25) చీమలకు భయపడి చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 2022లో మృతురాలు మనీషా కు చిందం శ్రీకాంత్ (35)తో వివాహం జరిగింది. వీరికి అనికా (3) పాప ఉంది.
మంచిర్యాలకు చెందిన ఈ దంపతులు రెండున్నర సంవత్సరాల కింద ఉద్యోగ నిమిత్తం అమీన్‌పూర్‌లోని నవ్య కాలనీలో నివాసముంటున్నారు. అయితే మనీషా కు చిన్నప్పటి నుంచి చీమలకు భయపడే మైర్మెకోఫోబియా అనే వ్యాధి ఉంది. మంగళవారం ఉదయం మృతురాలు భర్త శ్రీకాంత్ ఆఫీస్‌కు వెళ్ళాడు. అదే సాయంత్రం శ్రీకాంత్ ఆఫీస్ నుంచి ఇంటికి రాగా లోపల నుంచి గడియ పెట్టి ఉంది. స్థానికుల సహాయంతో డోర్‌ను పగలకొట్టి చూడగా సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని కనిపించింది. పక్కనే దొరికిన లేఖలో చీమలు భరించడం నా వల్ల కావడం లేదని అందుకే చనిపోతున్నానని పేర్కొం ది. కూతురు అనికాను జాగ్రత్తగా చూసుకోమని చెప్తూ వదిలి వెళ్తున్నందుకు క్షమించాలని భర్తను వేడుకుంది. అన్నవరం,తిరుపతి హుండీ లో రూ.1116/- లు వేయడంతో పాటు ఎల్లమ్మ తల్లికి ఒడి బియ్యం పోయాలని లేఖలో తెలిపింది. ఎప్పుడూ వినని సమస్యతో మహిళ ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా విషాదం నింపింది. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.