మన తెలంగాణ/హైదరాబాద్: ఎసిబి అధికారులు రెండు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై గురువారం మెరుపుదాడులు చేశారు. కూకట్‌పల్లి, కుత్భుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులపై ఏసిబి దాడులు నిర్వహించారు. బయటి వ్యక్తులను, మీడియా ప్రతినిధులను లోపలికి అనుమతించకుం డా గేట్లు మూసివేసి ఏసిబి అధికారులు విచారణ కొనసాగించారు. ఈ నేపథ్యంలోనే దస్తావేజుల పరిశీలించడంతో పాటు కార్యాలయంలోని పలు కీలకమైన ఫైళ్లను ఏసిబి అధికారులు అత్యంత క్షుణ్ణంగా చూశారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ లో జరిగిన అవకతవకలు, అక్రమ వసూళ్లు, లెక్క చూపని నగదు వంటి అంశాలపై ఏసిబి అధికారులు దర్యాప్తు చేసినట్టుగా తెలిసింది.కూకట్‌పల్లి, కుత్భుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్‌ల పరిధిలో అవినీతి ఆరోపణలు రావడంతో ఏసిబి ఈ దాడులు చేసినట్టుగా తెలిసింది.
ఈ దాడులకు సంబంధించి కార్యాలయ సిబ్బందిని, డాక్యుమెంట్ రైటర్స్‌ను సైతం అధికారులు విచారించినట్టుగా సమాచారం.ఏసిబి దాడుల్లో భాగంగా ఒక్కో డాక్యుమెంట్స్ రైటర్‌ను పిలిచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే ఏసిబి అధికారులు విచారించినట్టుగా తెలిసింది. ఈ రెండు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసిబి అధికారులు డాడులు చేసినప్పుడు స్లాట్ బుకింగ్ కన్నా అధికంగా డాక్యుమెంట్‌లు లభ్యకావడం, కొందరు డాక్యుమెంట్ రైటర్‌ల వద్ద నగదు లభ్యమయినట్టుగా తెలిసింది. దీంతోపాటు రిజిస్ట్రేషన్‌లు లేకున్నా డాక్యుమెంట్ రైటర్‌లందరూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే ఉండడాన్ని ఏసిబి అధికారులు గుర్తించారు. ఈ విషయాలన్నింటిని ఏసిబి అధికారులు ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఏసిబి దాడులు హైదరాబాద్ రేంజ్ ఏసిబి డిఎస్పీ, రంగారెడ్డి రేంజ్, ఏసిబి, డిఎస్పీల ఆధ్వర్యంలో జరిగాయి.
వివాదాస్పద భూముల వివాదం వల్లే..
కుత్భుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో సబ్ రిజిస్ట్రార్ 2, సబ్ రిజిస్ట్రార్3లపై భారీగా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ఇక్కడ జరుగుతున్న అవినీతిపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. దీంతోపాటు కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ పరిధిలోని కొన్ని వివాదాస్పద భూముల విషయంలో నెలకొన్న వివాదం నేపథ్యంలో అవినీతి జరిగిందని అందులో భాగంగానే ఈ కా ర్యాలయంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయని తెలిసింది.
సరూర్‌నగర్ సబ్ రిజిస్ట్రార్‌పై కోర్టు తీర్పు
మూడు రోజుల క్రితం అవినీతి ఆరోపణల నేపథ్యంలో సరూర్‌నగర్ సబ్ రిజిస్ట్రార్‌పై విచారణ చేపట్టాలని ఏకంగా హైకోర్టు ఆదేశించడం గమనార్హం. ఇప్పటికే సరూర్‌నగర్ సబ్ రిజిస్ట్రార్‌పై అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తినా ఇప్పటివరకు చర్యలు తీసుకోవడం లేదని ఆ శాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఆ సబ్ రిజిస్ట్రార్ ఏకంగా ఉన్నతాధికారులను మచ్చిక చేసుకొని తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వ్యవహారిస్తున్నారన్న ఆరోపణలు వినిసిస్తున్నాయి.
48 మంది సబ్ రిజిస్ట్రార్‌ల అవినీతిపై
ఇక, ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్ ఏకంగా ఒక మంత్రి పేరు చెప్పి అడ్డగోలుగా వసూళ్లు చేస్తున్నారని ఈ మధ్యే ప్రభుత్వానికి ఫిర్యాదు అందింది. అయినా ఇప్పటివరకు ఈ సబ్ రిజిస్ట్రార్‌పై చర్యలు తీసుకోకపోవడం విశేషం. మూసాపేట్, ఎల్‌బినగర్, శేరిలింగంపల్లి, హయత్‌నగర్, మూసాపేట, ఇబ్రహీంపట్నం, ఆజంపురా, ఫరూక్‌నగర్, షాద్‌నగర్, చౌటుప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై నెలరోజుల క్రితం సిఎంఓకు ఫిర్యాదు అందినట్టుగా తెలిసింది. వీరితోపాటు ఉమ్మడి జిల్లాలైన రంగారెడ్డి, వరంగల్, ఉమ్మడి నల్లగొండ జిల్లాలతో పాటు హైదరాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు చెందిన 48 మంది సబ్ రిజిస్ట్రార్‌ల అవినీతిపై పలువురు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. త్వరలోనే మరికొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసిబి దాడులు చేసే అవకాశం ఉందని సమాచారం.
ఈ ఏడాది ఎసిబి వలలో ఏడుగురు
ఈ సంవత్సరం ఏడుగురు సబ్ రిజిస్ట్రార్‌లు డబ్బులు తీసుకుంటూ ఏసిబికి డైరెక్ట్‌గా పట్టుబడగా, మరో ఇద్దరు వివిధ కారణాలతో సస్పెన్షన్‌కు గురయ్యారు. అయినా సబ్ రిజిస్ట్రార్ వ్యవహారశైలిలో మార్పు రావడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో పనిచేసే ఓ డిఆర్ తన పరిధిలో పనిచేసే సబ్ రిజిస్ట్రార్‌ల నుంచి అవినీతి ఆరోపణలు వస్తే వారి నుంచి అందినకాడికి దండుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ డిఆర్‌కు సిఎంఓలో పనిచేసే ఓ ఉన్నతాధికారికి దగ్గర అని ఈ వసూళ్లకు పాల్పడుతున్నట్టుగా తెలిసింది. ఈ డిస్టిక్ రిజిస్ట్రార్ రెగ్యులర్ డిఐజిగా పదోన్నతి తీసుకోకుండా డిఆర్‌గా కొనసాగుతుండడం విశేషం. ఈయన అవినీతిపై కూడా కొందరు సిఎంకు, ఏసిబి అధికారులకు ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది.