హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో విజయం సాధించేందుకు అన్ని పార్టీలో ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి. అయితే ఈ ఉపఎన్నిక విషయంలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా లేకుండా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పని చేయాలని సిఎం రేవంత్ రెడ్డి పార్టీ నాయకులకు సూచించారు. జూబ్లీహిల్స్ ఎంపి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తదితరులు పాల్గొన్నారు.
ఇప్పటికే మంత్రులు, సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. సిఎం సైతం గత నెల 31, ఈ నెల 1, 4, 5 తేదీల్లో నియోజకవర్గంలోని పలు డివిజన్లలో రోడ్ షోల నిర్వహించడంతో పాటు కార్నర్ సమావేశాలు నిర్వహించారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో.. క్షేత్రస్థాయి పరిస్థితులు, సర్వే నివేదికలు, పార్టీ నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాలు, ప్రతిపక్షాల దుష్ప్రచారాలు, వ్యూహ, ప్రతి వ్యూహాలు తదితర అంశాలపై సిఎం సమీక్ష చేసినట్లు తెలుస్తోంది. మొత్తం మంత్రులందరికి బాధ్యతలు అప్పగించిన.. సిఎం రేవంత్ రెడ్డి.. ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలని దిశానిర్ధేశం చేసినట్లు సమాచారం.