భూకబ్జాలు, కమీషన్లు, దౌర్జన్యాలకు పాల్పడే రాజకీయ నాయకులు, నకిలీ, కల్తీసరుకులు అమ్ముతూ, పన్నులు ఎగ్గొట్టే వ్యాపారులు, చేతులు తడపందే ఫైల్ వైపు చూడని ప్రభుత్వ ఉద్యోగులు.. ఈ మూడు వర్గాలు కూడబలుక్కొని దేశాన్ని పందికొక్కుల్లా మేస్తున్నారు. దృఢమైన గొలుసులా ఏర్పడి సొంత ఆస్తులను గుట్టలుగా పోగు చేసుకుంటున్నారు. వీరి ధనదాహం, అధికార అహం వల్ల దేశంలో వంద కోట్లకు పైగా సామాన్యుల జీవితాలు కష్టాల ఊబిలోకి జారుతున్నాయి. పని చేసి పెట్టేందుకు లంచంకోసం చేయి చాచే ఉద్యోగి ప్రజలకు ప్రత్యక్షంగా కనబడతాడు. వ్యాపారి మోసాలు మాత్రం సామాన్యుడి కంటికి అగపడవు. ఇక రాజకీయ నాయకుడు పెద్ద మాయలోడు. వారి సంపాదన అండర్ గ్రౌండ్ డ్రైనేజిలా ఎటునుంచి ఎటు వెళుతుందో అంతుపట్టదు. ఉద్యోగి పట్టుబడితే కష్టాలే. వ్యాపారి నష్టపోతే తిప్పలే. నాయకుడు ఓడిపోయినా దివాళా తీయడు. ఈ పోలిక ఆధారంగా దేశ సంపద, పౌరుడి శ్రమ ఈమేరకు ఎవరి జేబులోకి వెళుతుందో ఊహించవచ్చు.
ఈ మూడింటిలో అత్యంత బలమైనది వ్యాపార వర్గమే. ఒక రకంగా రాజకీయ, ఉద్యోగ వర్గాలు వ్యాపారికి ఊడిగం చేసేవే. వ్యాపారులు ఇచ్చే విరాళాలు రాజకీయ పార్టీలకు ఇంధనంలా పనికొస్తాయి. ఒక పరిశ్రమ తమ రాష్ట్రానికి రావడానికి పాలకులు పడే ఆరాటం చూస్తుంటే పారిశ్రామికవేత్తలు ఎంత శక్తిమంతులో అర్థమవుతుంది. మంత్రులను తమ కనుసన్నలపై ఆడించే వ్యాపారుల ఇంటి గేటు తాకడానికి కూడా అధికారులు వణికిపోతారు. ప్రభుత్వ బ్యాంకుల్లోంచి తీసుకొన్న వేల కోట్ల అప్పును గుర్తుచేయడానికి కూడా అధికారికి సాహసమే కావాలి. బ్యాంకుల్లోని ప్రజల పొదుపు సొమ్మును వేల కోట్ల దాకా ఎగ్గొట్టిన మన వ్యాపారులు విదేశాలకు వెళ్లి రాజాల్లా బతకగలరు. ఆ అప్పులకు మాఫీ చేస్తున్నట్లు మంత్రులతో ప్రకటనలు ఇప్పించగలరు. రాజకీయ, వ్యాపార వర్గాల చెప్పుచేతల్లో నడిచేవారు ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు. ప్రతి దొంగపనిని చూసీచూడనట్లు ఉన్నందుకు వీరి టిప్పు వీరికి అందుతుంది. రెస్టారెంట్లు, బ్రాందీ షాపులు, పబ్బుల నుండి పోలీసులకు, మున్సిపాలిటీకి, కార్మిక, వాణిజ్య పన్నుల శాఖలకు నెలవారీగా లంచం సొమ్ము టంచనుగా అందుతుంది. పరిశ్రమల, వ్యాపారుల అక్రమ దందాలు ఎలాంటి అడ్డంకి లేకుండా యథేచ్ఛగా సాగడానికి ఎన్నో విభాగాల తనిఖీ అధికారులకు లంచం ముడుతుంది. డిపార్ట్‌మెంట్ వారీగా అందిన సొమ్ము హోదాల క్రమంగా జేబులోకి చేరుకుంటుంది. ఇలా నిశ్శబ్దంగా రోజుకు కోట్లాది రూపాయలు చేతులు మారుతుంటాయి. రోజుకు సగటున లక్ష రూపాయలు ఇంటికి తీసికెళ్లే ప్రభుత్వ ఉద్యోగులు ఒక్క రాష్ట్రంలో వేలల్లో ఉంటారు.
మాఫియాలో బ్లాక్ మనీ, స్మగ్లింగ్, హత్యలు ఉంటాయి. లంచగొండి వ్యవస్థ కూడా వైట్ కలర్ మాఫియానే. వారానికి ఒకరిద్దరు లంచగొండి అధికారులు అవినీతి శాఖకు చిక్కుతున్నారనే వార్తలు కనబడుతుంటాయి. అవినీతి నిరోధక శాఖ బాగా పనిచేస్తుందని చర్చ సాగుతుంది. వాస్తవానికి ప్రజలనుంచి వచ్చిన ఫిర్యాదు మేరకే ఎసిబి స్పందిస్తుంది. ఊర్లో పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంటుందో అందరికీ తెలుసు. అవినీతి నిరోధక స్టేషన్ మాత్రం ఎక్కడా కనబడదు. ఆ సిబ్బంది కూడా అందులోనే ఉంటే బయట బోర్డుపెట్టాలి. దాని మార్గం విడిగా ఉండాలి. హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కౌంటర్ కనబడేలా పెట్టినట్లు లంచాలు అడిగే ఆఫీసుల వద్ద ఎసిబి కౌంటర్లు పెట్టాలి. ఈ వ్యవస్థ లేకపోవడం వల్లనే తమను లంచం అడిగారని ఆ శాఖ దృష్టికి తీసుకువెళ్లే వారి సంఖ్య అతి తక్కువగా ఉంటోంది. సిబ్బంది కోరిన ప్రకారం సమర్పించుకొని తమ పనులు పూర్తి చేసుకొని బయట పడడానికే జనం ఇష్టపడుతున్నారు.
చాలా సందర్భాల్లో అధికారుల అత్యాశే విషయం ఎసిబి దాకా వెళ్లేలా చేస్తుంది. బిల్లు మంజూరుకు అధికారి లక్ష డిమాండ్ చేస్తాడు. అంత ఇవ్వలేము, 70 వేలతో సరిపెట్టుకోండి అని వేడుకుంటారు. ససేమిరా కుదరదు. లక్ష ఇవ్వాల్సిందే అని అధికారి మొండికేస్తాడు. చిర్రెత్తిన లబ్ధిదారు ఎసిబిని ఆశ్రయిస్తాడు. శ్రమలేకుండా ఎసిబి వారికి ఓ చేప పడుతుంది. దానికో వార్త. ఇదేం పెద్ద నేరమన్నట్లు ఉద్యోగి దర్జాగా ఫోటోకి పోజు ఇస్తాడు.లంచం తీసుకోవడం తప్పు అనే భావన సమాజంలోంచి ఎగిరిపోయింది. బాధితుల ఫిర్యాదుపైనే కాకుండా, ఉద్యోగుల ఇళ్లపై దాడి చేసి కూడా అవినీతి ఉద్యోగులను ఎసిబి పట్టుకుంటుంది. ఆ ఉద్యోగులకు ఆదాయాన్ని మించిన ఆస్తులున్నాయని లెక్కలేసి మరీ చెబుతుంది. మిగతా వారికి అక్రమాస్తుల లేవా అంటే వారికీ ఉన్నాయనే సమాధానం వస్తుంది. చాలా డిపార్ట్‌మెంట్లు పూర్తిగా అవినీతిలో మునిగేవే. వాటిపై చర్యలు తీసుకుంటే ఆఫీసులే ఖాళీ అవుతాయి. జైళ్లు సరిపోవు. బలమైన ఈ చక్రవ్యూహంలో సామాన్యుడు సర్దుకు బతకడమే తప్ప మరో మార్గం లేదు.
బి.నర్సన్, 9440128169