బీజేపీ, ఎన్నికల కమిషన్ కుమ్మక్కయి ఓట్ల చోరీకి పాల్పడుతున్నాయని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శించారు. 2024లో హర్యానాలో ఓట్ల చోరీ కారణంగానే కాంగ్రెస్ పార్టీ విజయం అంచులనుంచి ఓటమి పాలైందని ఆయన అన్నారు. హర్యానాలో 2 కోట్ల మంది ఓటర్లలో 25 లక్షలమంది నకిలీ ఓటర్లేనని ఢిల్లీలో విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ విమర్శించారు. బోగస్ ఓటర్ల సంఖ్య రాష్ట్రంలో 12 శాతం మేరకు ఉందని. ఇందుకు సంబంధించి తమ వద్ద 100 శాతం రుజువులు ఉన్నాయని ఆయన తెలిపారు. తమ బృందం 5.21 లక్షల నకిలీ ఓటర్ల ఎంట్రీలను కనుగొన్నట్లు తెలిపారు. అంటే హర్యానాలో ప్రతి8 మంది ఓటర్లలో ఒకరు నకిలీ అని ప్రతిపక్షనేత ఎద్దేవా చేశారు.
ఒక బ్రెజిలియన్ మోడల్ ఫోటో గ్రాఫ్ సీమా, స్వీటీ, సరస్వతి వంటి వివిధి పేర్లతో ఓటర్లజాబితాలో అనేకసార్లు కన్పించిందని, ఆమె 22 సార్లు ఓటు వేసిందనే ఆరోపణలు ఉన్నాయని పేర్కొంటూ, ఓటర్ల జాబితాలోని తేడాలను చూపే స్లయిడ్ లను రాహుల్ ప్రదర్శించారు. ప్రజాస్వామ్య ప్రక్రియకు తూట్లు పొడిచేందుకు బీజేపీ కుట్రపూరితంగా ఇలాంటి పన్నాగాలు పన్నుతోందని రాహుల్ ఆరోపించారు. హర్యానా చరిత్రలోనే తొలిసారిగా, పోస్టల్ బ్యాలెట్లు వాస్తవ ఓట్లతో సరిపోలలేదన్నారు. ఇంతకు ముందు ఎన్నడూ ఇలా జరగలేదని చెబుతూ, కాంగ్రెస్ అఖండవిజయాన్ని ఓటమిగా మార్చేందుకు కుట్ర అమలయిందని రాహుల్ ఆరోపించారు. ఎన్నికల తర్వాత వచ్చిన వీడియోను చూపుతూ, హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సైనీపై కూడా విమర్శించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన రెండు రోజులతర్వాత కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయిందని అందరూ చెబుతున్న సమయంలో నైనీ నవ్వుతున్న ఫోటో ప్రదర్శించారు.
ఉత్తరప్రదేశ్, హర్యానా రెండింటిలోనూ వేలాదిమంది బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. ఒక్ పాల్వాల్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఇంటి నెంబర్ .150లోని బీజేపీ నాయకుడి చిరునామాలో 66 మంది ఓటర్లు నమోదయ్యారన్నారు. ఒక వ్యక్తి ఇంట్లో ఏకంగా 500 మంది ఓటర్లు నమోదయ్యారని ఆయన ఆరోపించారు. తాను ఆషామాషీగా ఆరోపణలు చేయడం లేదని, తన ఆరోపణలను ధ్రువీకరించే డేటా ఉందని రాహుల్ స్పష్టం చేశారు. ఈసీని మాత్రమే కాదు, ప్రజాస్వామ్య ప్రక్రియనే ప్రశ్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఓట్ల చోరీ విషయంలో బీజేపీ, ఎన్నికల కమిషన్ కుమ్మక్కయ్యాయని ఆయన పునరుద్ఘాటించారు.
ఎన్నికల కమిషన్ నకిలీ ఓట్లను ఎందుకు తొలగించడం లేదు. అలా చేస్తే, న్యాయంగా ఎన్నికలు జరుగుతాయికదా. అన్నారు రాహుల్. ఈసీ. న్యాయమైన ఎన్నికలను కోరుకోవడం లేదని ఆయన విమర్శించారు. బీజేపీ కుట్రకు, ఈసీ వత్తాసు ఉందనడానికి ఇదే రుజువు అని దుయ్యబట్టారు.