తెలుగు రాష్ట్రాల్లో కార్తీకపౌర్ణమిని అంతటా ఘనంగా జరుపుకున్నారు. శివాలయాలలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, దీపారాధనలు జరిగాయి. తెల్లవారుజాము నుంచే అలయాలకు చేరుకుని కార్తీక దీపాలు వెలిగించి, భక్తులు ప్రత్యేక అభిషేకాలు చేశారు. ముఖ్యంగా ఉసిరి చెట్టు కింద దీపారాధన చేసి అరటి డొప్పలలో దీపాలు వెలిగించి నదిలో వదిలారు. భక్తులు దానధర్మాలు, నదీ స్నానాలు చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో శివనామస్మరణతో ఆలయాలు మారుమోగాయి. ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. పలువులు భక్తులు నదుల్లో వద్ద పుణ్య స్నానాలు ఆచరించి ఆలయాల్లో కార్తిక దీపాలు వెలిగించారు. కార్తిక మాసంలో అత్యంత పవిత్రమైన పౌర్ణమి పర్వదినాన్ని భక్తులు పురస్కరించుకుని రాష్ట్రంలోని శివాలయాలన్నీ భక్త జన సందోహంతో కిటకిటలాడాయి.
తెల్లవారుజాము నుంచే మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చారు. కార్తిక పౌర్ణమి రోజున శివాలయాల్లో దీపం వెలిగించడం వల్ల పుణ్యం వస్తుందని భక్తులకు ప్రగాఢ విశ్వాసం. ఈ నేపథ్యంలో భక్తులు ఉదయం నుంచే ఆలయాలకు వచ్చి స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ప్రత్యేకంగా మహిళలు ఆలయ పరిసరాల్లో కార్తిక దీపాలను వెలిగించి, 365 వత్తులతో కూడిన దీపాలను సమర్పించారు. వరంగల్ వేయిస్తంబాల దేవాలయం, కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం, రామప్ప దేవాలయం, కురవి వీరభద్రస్వామి, పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. బొంతపల్లి వీరభద్ర స్వామి ఆలయంలో స్వామివారి దర్శనానికి బారులు తీరారు. బీరంగూడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి, ఝారాసంగం కేతకి సంగమేశ్వర, సంగారెడ్డి సోమేశ్వర ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది.
శ్రీశైలంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మల్లన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండే పాతాళగంగలో పుణ్య స్థానాలు ఆచరించి స్వామి, అమ్మవార్ల దర్శనార్థం క్యూలైన్లలో బారులు తీరారు. స్వామిఅమ్మవార్ల దర్శనానికి 4 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. భద్రాచలం వద్ద గోదావరి నదిలో భక్తుల పుణ్య స్నానాలు ఆచరించారు. దీపాలు వెలిగించి పూజలు చేశారు. మణుగూరు సబ్ డివిజన్ వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో శివాలయాలు కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేశారు.
భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు : హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి, మదాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లోని ప్రధాన శివాలయాల వద్ద భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ కమిటీలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా భక్తులందరికీ సకాలంలో దర్శనం లభించేలా క్యూలైన్లను ఏర్పాటు చేశారు. శివనామస్మరణతో మారుమోగిన ఆలయాలు, భక్తులు వెలిగించిన దీపాల కాంతులతో ఆ ప్రాంతమంతా పండగ వాతావరణం నెలకొంది.
కీసరగుట్టలో పౌర్ణమి వేడుకలు : సుప్రసిద్ధ శైవ క్షేత్రం కీసరగుట్టలో భక్తుల సందడి నెలకొంది. శ్రీరామలింగేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. దర్శన అనంతరం భక్తులు ఆలయానికి ఎదురుగా ఉన్న శివ లింగాలకు పంచామృత అభిషేకాలు చేశారు. అలాగే ఆలయ పరిసరాల్లో కార్తిక దీపాలు వెలిగించారు. సత్యనారాయణ స్వామి వత్రాలు నిర్వహించారు.
యాదగిరిగుట్టలో కార్తిక శోభ : యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. ఆలయంలోని వ్రత మండపంలో భక్తులు సత్యదేవుడికి పూజలు నిర్వహించారు. కార్తీక దీపారాధన మండపంలో దీపాలు వెలిగించారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని ఆలయ మాఢ వీధులు కార్తిక పూజలు నిర్వహించే భక్తులతో సందడిగా మారాయి. కార్తీక పూజలు జరిపించుకోవడానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సత్యనారాయణస్వామి వ్రతాలు, బిల్వార్చన, నిజాభిషేకం, కార్తీక దీపాలు వెలిగించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో శివాలయం, వ్రత మండపాలు, కార్తీక దీపా రాధన ప్రదేశాలు భక్తులతో కిటకిటలాడాయి.