తెలుగు రాష్ట్రాలను ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. ఒక విషాదం నుంచి తేరుకోకముందే మరో ఘోరం వెంటాడుతోంది. 2025 సంవత్సరం తెలుగు రాష్ట్రాలకు ఎంతో మందికి కలిసి వచ్చిందో తెలియదు గానీ, అనేక కుటుంబాల్లో మాత్రం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఏడాది జనవరి నుండి నవంబర్ వరకు వరుస విషాద ఘటనల్లో పదుల సంఖ్యలో అమాయకులు బలైపోయారు. మొత్తం వంద మందికిపైగా ప్రాణాలు ఇలాంటి దుర్ఘటనలకు బలయ్యాయి. నిర్లక్ష్యం, విధుల్లో వైఫల్యం లేదా కేవలం ప్రమాదాలు.. కారణం ఏదైనా సరే, సంభవించిన మరణాలు మాత్రం అత్యంత బాధాకరం. కనీసం ఐదుగురి కంటే ఎక్కువ మరణాలు సంభవించిన ప్రధాన దుర్ఘటనలు పది ఉన్నాయి. జనవరి 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాటతో విషాదాల పరంపర మొదలైంది. ఏకాదశి పర్వదినం సందర్భంగా దర్శన టిక్కెట్లు తీసుకోవడానికి బైరాగి పట్టెడ వద్ద క్యూ లైన్‌లోకి ప్రజలు ఒక్కసారిగా దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 20 మందికిపైగా గాయపడ్డారు.
శ్రీశైలం ఎడమగట్టు కాలువకు అనుసంధానంగా దోమలపెంట వద్ద నిర్మిస్తున్న టన్నెల్‌లో ఒక్కసారిగా పైకప్పు కూలిపోయింది. మట్టి పెళ్లలు పడిపోవడంతో అందులో పనిచేస్తున్న కార్మికులు ఊపిరాడక సజీవ సమాధి అయ్యారు. ఈ ఘటనలో మొత్తం 12 మంది మృత్యువాత పడ్డారు. టన్నెల్ బోరింగ్ మిషన్ కూడా ప్రమాద తీవ్రతకు ధ్వంసమైంది. మార్చి 28న ఒంగోలు తీరంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు సముద్రంలో మునిగిపోయింది. మొత్తం 12 మందితో వెళ్లిన బోటు తిరగబడి ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతై మరణించారు. ఏప్రిల్ 29న సింహాచలంలో సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో స్వామివారి నిజరూపాన్ని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులపై గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. మే 18న హైదరాబాద్‌లోని చార్మినార్ దగ్గరున్న గుల్జార్ హౌస్‌లో ఉదయం 6:00 గంటల ప్రాంతంలో చెలరేగిన మంటల్లో 17 మంది ఆహుతైపోయారు. మృతుల్లో ఎనిమిదిమంది చిన్నారులు, నలుగురు వృద్ధులు ఉండడం అత్యంత విషాదకరం.
జూన్ 30న సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువు మండలంలోని పాశమైలారంలో ఉన్న సికాచి పరిశ్రమలో రియాక్టర్ పేలింది. భారీగా మంటలు చెలరేగి దట్టమైన పొగలు అలుముకున్నాయి.పేలుడు ధాటికి రియాక్టర్ దగ్గర పనిచేస్తున్న కార్మికులు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో 46 మంది దుర్మరణం పాలవ్వగా, 30కి పైగా క్షతగాత్రులయ్యారు. జూన్ 14న అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజంపేట నుంచి రైల్వేకోడూరు మార్కెట్‌కు మామిడికాయల లోడుతో వెళుతున్న లారీ పుల్లంపేట మండలం రెడ్డిపల్లి చెరువు కట్టపై బోల్తాపడింది. ఘటన జరిగిన సమయంలో లారీలో 18 మంది కూలీలు ఉండగా, ఎనిమిది మంది మృతి చెందారు. కర్నూలు హైవేపై తెల్లవారుజాము 3:00 గంటల ప్రాంతంలో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు బైక్‌ను ఢీకొని అగ్నిప్రమాదానికి కారణమైంది. మొత్తం 19 మంది సజీవ దహనమయ్యారు. నవంబర్ 1న శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వరాలయంలో జరిగిన తొక్కిసలాట మాటల్లో వర్ణించలేనిది. రైలింగ్ ఊడిపడటంతో భక్తులు ఒక్కసారిగా కిందపడిపోయారు.
ఏకాదశి కావడంతో భారీగా తరలివచ్చిన భక్తుల్లో తొమ్మిది మంది మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. ఆలయంలో భద్రతా చర్యలు లేకపోవడం ఈ ఘటనకు కారణమైంది. నవంబర్ 3న చేవెళ్ల దగ్గరలోని మీర్జాగూడ వద్ద ఘోరం జరిగింది. తాండూరు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ఆర్‌టిసి బస్సు, ఓవర్‌లోడ్, ఓవర్‌స్పీడ్‌తో వస్తున్న టిప్పర్‌ను ఢీకొట్టింది. స్పాట్‌లో 19 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. టిప్పర్ డ్రైవర్, బస్సు డ్రైవర్ కూడా మృతి చెందారు. ఈ విషాదంలో విద్యార్థులు, మహిళలు ఎక్కువగా చనిపోయారు, వారిలో రెండు నెలల పసికందు కూడా ఉంది. బంధువుల రోదనలతో చేవెళ్ల ఆస్పత్రి ప్రాంగణమంతా గంభీరంగా మారింది. ఈ వరుస ఘటనలు తెలుగు రాష్ట్రాల ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేశాయి. మరో వైపు భారతదేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతోందని కేంద్రం విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం రాష్ట్రాలవారీగా రోడ్డు ప్రమాదాల సంఖ్యను పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కూడా ప్రమాదాలు ఎక్కువగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో 8,276 రోడ్డు ప్రమాదాలు జరిగి, దేశంలో ఏడో స్థానంలో నిలవగా, తెలంగాణలో 8,103 ప్రమాదాలు జరిగి ఎనిమిదో స్థానంలో ఉంది. మరణాల విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్‌లో 3,806 మంది, తెలంగాణలో 3,508 మంది మరణించారు. ఈ రెండు రాష్ట్రాలు కూడా అత్యధిక మరణాలు సంభవించిన రాష్ట్రాల జాబితాలో ఎనిమిది, తొమ్మిదో స్థానాల్లో ఉన్నాయి.
– ఐనం ప్రసాద్
98489 28787