తెలంగాణ స్వాతంత్య్రోద్యమ పుటల్లో శాశ్వతంగా చెరగని అక్షరాలతో నిలిచిపోయిన పేరు నల్లా నరసింహులు. అణచివేత, దోపిడీ, బానిసత్వం నిండిన నిజాం రాజ్యానికి వ్యతిరేకంగా ప్రాణాలర్పించి పోరాడిన మహావీరుడు ఆయన. ఆయన జీవితం ప్రజాస్వాతంత్య్రం కోసం అహర్నిశలు నడిచిన త్యాగయాత్ర. ప్రజల విముక్తి కోసం శస్త్రం ఎత్తి, న్యాయంకోసం గొంతుఎత్తిన ఆ ధీరుని పోరాట చరిత్ర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట గాథలో ఒక అజేయ అధ్యాయం. 1940 దశకంలో తెలంగాణ ప్రజల జీవితం దుర్భరంగా ఉండేది. భూస్వాములు, దేశముఖ్‌లు, సర్దేశ్‌ముఖ్‌లు, దేశాయిలు, రజాకార్లు కలిసి ప్రజలపై అమానుష దోపిడీ సాగించారు. రైతులు తమ కష్టార్జిత పంటను భూస్వాముల కడుపు నింపేందుకు మాత్రమే పండించేవారు. నిజాం పాలనలోని 7430 గ్రామాలు ప్రైవేటు వ్యక్తుల అజమాయిషీ కింద ఉండగా, రైతు కేవలం కూలీగా, బానిసగా మిగిలిపోయాడు. ఈ అన్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా పెల్లుబికిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రజాచరిత్రలో గొప్ప మైలురాయి అయింది. ఈ మహా సమరానికి దళ నాయకుడిగా ముందుండి పోరాడిన యోధుడు నల్లా నరసింహులు. నల్లా నరసింహులు 1926 అక్టోబరు 2న తెలంగాణలోని కడవెండి, జనగామ జిల్లా, దేవరుప్పులలో జన్మించారు.
జనగామ ప్రాంతంలో సాయుధ దళాలను ఏర్పాటు చేసి భూస్వామ్య వ్యవస్థకు గట్టి ప్రతిఘటనగా నిలిచారు. ప్రజలలో ధైర్యం నింపి రజాకార్లపై, దోపిడీదారులపై గెరిల్లా దాడులు నిర్వహించారు. నరసింహుల కేక దోపిడీదారుల పాలనకు ఇక అంతం! అని అణగారిన ప్రజల గుండెల్లో మంటగా మండింది. ఆ కాలంలో తెలంగాణలో కమ్యూనిస్టు భావజాలం విస్తరిస్తున్నది. ఆంధ్ర మహాసభ అనే వేదిక ద్వారా పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, భీమిరెడ్డి నరసింహారెడ్డి వంటి నేతలు ప్రజలను సంఘటితం చేశారు. భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా గ్రామగ్రామంలో కమిటీలు, దళాలు ఏర్పాటయ్యాయి. నరసింహులు ఈ పోరాటానికి తమ జీవితం అంకితం చేశారు. జనగామ తాలూకాలోని గ్రామాల్లో ఆయుధ దళాలను నిర్మించి స్వయంగా నాయకత్వం వహించారు.
భూస్వాములు, రజాకార్లు, నిజాం సైన్యం ఈ మూడింటి మధ్యలో ప్రజల పక్షాన నిలిచిన నరసింహులు శత్రువుల నిద్రను చెడగొట్టారు. 1947 సెప్టెంబర్ 11న ఆయన స్వగ్రామమైన కడవెండి నుంచే మొదటి తిరుగుబాటును ప్రారంభించి సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారు. ఆ పిలుపు యుద్ధభేరీగా మారి తెలంగాణ అంతటా విప్లవ జ్వాలలు వ్యాపించాయి. నల్గొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలు ఆయన ఆదేశాలపై ఎర్రజెండాల కింద పోరాట రంగమయ్యాయి. వేల ఎకరాల భూములు భూస్వాముల పంజానుండి విడిపించబడి, దున్నేవాడికే భూమి హక్కు! అన్న నినాదం ప్రతిధ్వనించింది. సాయుధ పోరాటం ఉధృతంగా సాగుతుండగా, నరసింహులు అనేకసార్లు అరెస్టుకాబడి చిత్రహింసలు అనుభవించారు. మూడుసార్లు ఉరిశిక్ష విధించబడ్డా ఆయన ధైర్యం ఒక్క క్షణం తగ్గలేదు. అంతర్జాతీయ కమ్యూనిస్టు సంస్థలు, భారత ట్రేడ్ యూనియన్ సంఘాల ఆందోళనల ఫలితంగా ఆయన ఉరిశిక్ష చివరి నిమిషంలో నిలిపివేయబడింది. నల్లగొండ జైలులో బంధితుడిగా ఉన్న నరసింహులను చూడటానికి వచ్చిన యూనియన్ సైనిక జనరల్ జె.ఎస్. చౌదరికి జిల్లా ఎస్.పి. ధన్‌రాజ్ నాయుడు పరిచయం చేస్తూ ఈయనే తెలంగాణ టైగర్ నల్లా నరసింహులు అని చెప్పడం చరిత్రలో నిలిచిపోయింది.
1948లో ‘పోలీస్ యాక్షన్’ అనంతరం కమ్యూనిస్టులపై నిషేధం విధించబడింది. నెహ్రూ ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారనే తప్పుడు ఆరోపణలతో అనేక మంది నేతలు అణచివేతకు గురయ్యారు. నరసింహులు వంటి యోధులు అరణ్యాలలో ఆశ్రయం పొందారు. చివరికి 1951 అక్టోబరులో కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటం విరమిస్తున్నట్లు ప్రకటన చేయడంతో ఉద్యమం చల్లారిపోయింది. అయినా నరసింహులు పోరాట భావజాలాన్ని విడిచిపెట్టలేదు. 1959 జనవరి 26న దీర్ఘ నిర్బంధ జీవితం ముగించి ఆయన తిరిగి స్వేచ్ఛా లోకంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ప్రజాస్వామ్య వ్యవస్థలో పేదల హక్కుల కోసం ఆలోచనాత్మకంగా పనిచేశారు. నల్లా నరసింహులు పేద పద్మశాలి కుటుంబంలో జన్మించి చేనేత పనిని జీవనాధారంగా చేసుకున్నారు. ఉర్దూ మీడియంలో ఏడవ తరగతి వరకు మాత్రమే చదివినా ప్రజల బాధలను అర్థం చేసుకున్న చైతన్యవంతుడు.
భార్య వజ్రమ్మతో కలిసి జీవితాంతం ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించారు. ఆయన తన చివరి వరకు కూడా పోరాట మిత్రులను, రైతాంగ యోధులను స్మరించుకుంటూ ప్రజా హక్కుల పట్ల అవగాహన కల్పిస్తూ గడిపారు. 1993 నవంబర్ 5న ఆయన జీవన యాత్ర ముగిసింది. కానీ ఆయన త్యాగం, ధైర్యం, ప్రజా సంకల్పం తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయింది. వేలాది మంది వీరుల త్యాగానికి ప్రతీకగా, పది లక్షల ఎకరాల భూమి పేదలకు పంచిన విజయానికి చిహ్నంగా ఆయన పేరు ఎప్పటికీ సజీవంగా ఉంటుంది. నల్లా నరసింహుల జీవితం ఒక పాఠం. స్వేచ్ఛ అనేది ఇచ్చేది కాదు, పొందేది. అణచివేతకు వ్యతిరేకంగా నిలబడే ధైర్యమే నిజమైన విముక్తి శక్తి. తెలంగాణ రైతాంగ పోరాటం, భూస్వామ్య వ్యవస్థ కూల్చివేత, పేదల భూ హక్కుల సాధనలో ఆయన చూపిన త్యాగపథం తరతరాలకు మార్గదర్శకం. నవంబర్ 5 నల్లా నరసింహుల వర్ధంతి రోజున ఈ ప్రజా వీరుడిని స్మరించుకుంటూ తెలంగాణ నేల తన గర్వకారణాన్ని మరలా గుర్తు చేసుకుంటుంది. ఆయన త్యాగజ్వాల ఎప్పటికీ మసకబారదు. ఆ జ్వాలే తెలంగాణ ప్రజా చైతన్యానికి చిరస్ఫూర్తి.
– రామకిష్టయ్య సంగనభట్ల
94405 95494